ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సండ్ర, అఖిలపక్షం నాయకులు
- రాజకీయాలు ఎన్నికలకే పరిమితం
- రెవెన్యూ డివిజన్ కోసం పోరాడుదాం: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
కల్లూరు : కల్లూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూరులో బుధవారం నిర్వహించిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు. రాజకీయాలు ఎన్నికలకే పరిమితమన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం ప్రకటన వరకు కలిపి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భౌగోళిక స్వరూపాన్ని మార్చి చూపించడం వల్లనే శాస్త్రీయత లోపించిందన్నారు. ఇది కాస్త రెండు ప్రాంతాల ప్రజల మధ్య భేదాభిప్రాయాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కి.మీ పరిధిలో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఉండాలనే నిబంధన ఉన్నా వైరాను ఎందుకు ఎంచుకున్నట్లు అని ప్రశ్నించారు. కల్లూరు అన్ని మండలాలకు సమానదూరంలో ఉంటుందన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. దీనిపై జిల్లా మంత్రి తుమ్మల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, జేసీ దివ్యను కలిసి వినతిపత్రాలు సమర్పించామన్నారు. హేతుబద్ధత గల భౌగోళిక స్వరూపాన్ని పరిశీలించి ప్రభుత్వం కల్లూరులో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే సండ్రతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూసంపూడి రవీందర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు గోకినపల్లి వెంకటేశ్వరరావు, అఖిలపక్షం నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, కాటమనేని వెంకటేశ్వరరావు, కర్నాటి అప్పిరెడ్డి, ఎ. వెంకన్న, గొర్రెపాటి రాధయ్య, గంగుల పుల్లారావు, జాస్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
– బంద్ సందర్భంగా వ్యాపార, విద్యాసంస్థలు, హోటళ్లు మూసివేశారు.