ఫిబ్రవరిలో జార్ఖండ్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యాటకం, ఐటీ, వ్యవసాయం తదితర రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. సత్వర అనుమతులు, నిరంతర విద్యుత్‌తో వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16-17 తారీఖుల్లో జార్ఖండ్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో రఘుబర్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సిమెంట్‌తోనూ, విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణ కోసం ఐటీ సంస్థ ఒరాకిల్‌తోనూ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు. శ్రీ సిమెంట్ దాదాపు రూ. 600 కోట్లతో జార్ఖండ్‌లో గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు రఘుబర్ దాస్ ఈ సందర్భంగా చెప్పారు.