భద్రాచలం వద్ద స్నానఘట్టాల వద్దకు చేరిన వరద నీరు
భద్రాచలం: భారీ వర్షాలతో భద్రాచలం ఏజన్సీలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలోగల ప్రాజెక్టుల నుంచి కూడా భారీగా వరద నీరు దిగువకు వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి, గురువారం సాయంత్రానికి 33 అడుగులకు చేరింది. స్నాన ఘట్టాల పైకి వరద నీరు చేరింది. గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
స్నాన ఘట్టాల రేవులో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రాచలం దిగువనున్న శబరి ఉధృతంగా ప్రవహిస్తుండటంగో వాగులకు వరద నీరు పోటెత్తుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 18 గేట్లను ఆరు అడుగుల వరకు ఎత్తి 50,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డివిజన్‌లోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో పలు చోట్ల వాగులు ఉధృతికి రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతంలోని మండలాల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ ఆదేశించారు.