ఖమ్మం ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సింగరాయిపాలెంవాసులు
-
జ్వరాలతో మూలుగుతున్న ప్రజలు
-
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
-
ఇప్పటికీ 20 మందికి పైగా మృత్యువాత
-
గ్రామాలు విడిచి వెళ్తున్న పల్లెవాసులు
ఖమ్మం / కొణిజర్ల :
వారం రోజులుగా జిల్లాలోని పల్లెలను డెంగీ వణికిస్తోంది. ఏ పల్లెలో చూసినా మంచాన పడిన మహిళలు, మూలుగుతున్న ముసలవ్వలు, తాతలు, నీరసంగా నడవలేని స్థితిలో ఉన్న చిన్నారులే కనిపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంతోపాటు, మైదాన ప్రాంతాల్లోని పల్లెల్లో సైతం ఇలాంటి దృశ్యాలే. జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే వందకు పైగా డెంగీ కేసులు నమోదు కాగా.. జిల్లావ్యాప్తంగా 20 మందికి పైగా జ్వరాలతో మృతి చెందారు. జ్వరాలు రావడం, వైద్య పరీక్షల్లో డెంగీ పాజిటివ్ కేసులు అధికం కావడం ఉన్నట్టుండి ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఉంటే కొందరు ఆ గ్రామాన్ని విడిచి వెళ్తున్నారు.
–రోజురోజుకూ పెరుగుతున్న డెంగీ కేసులు..
కొణిజర్ల మండలం సింగరాయపాలెం, తుమ్మలపల్లి, తల్లాడ మండలం మల్లాపురం, సింగరేణి మండలం చీమలపాడు గ్రామాల్లో డెంగీ జ్వరాలు అధికంగా ఉన్నాయి. సింగరాయిపాలెంలో సుమారు 100 మందికి పైగా జ్వరాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొణిజర్లలో ప్రయివేట్ వైద్యశాలలో రోజుకు 100 మంది వరకు జ్వరాలతో చేరుతున్నారు. మల్లాపురం, చీమలపాడు గ్రామాలకు చెందిన వంద మందికి పైగా డెంగీ పాజిటివ్ కేసులు రావడం, ప్లేట్‌లెట్లు పడిపోవడంతో అత్యవసర చికిత్స కోసం ఖమ్మం నగరంలోని ప్రైవేట్ వైద్యశాలల్లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. సింగరాయిపాలెం గ్రామానికి చెందిన మేడి కొండలరావు కుటుంబానికి చెందిన సోదరుడు దానేల్, సారమ్మ, జ్యోతి, మేషక్, శైలజ, మల్లాపురం గ్రామానికి చెందిన కృష్ణయ్య, నీలమ్మ, ప్రవీణ, నాగబాబుల కుటుంబం మొత్తం డెంగీతో ఇబ్బందులు పడుతున్నారు. వారిలో మేడి మేషక్ ప్లేట్‌లెట్లు 15 వేలకు పడిపోవడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.
–పెరుగుతున్న మరణాలు
జ్వరం రావడం ప్లేట్‌లెట్లు తగ్గి ఉన్నట్టుండి మృత్యువాత పడుతున్నవారి సంఖ్య సింగరాయిపాలెం, మల్లాపురం గ్రామాల్లో రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు రోజుల్లో సింగరాయిపాలెం గ్రామానికి చెందిన గోగుల నరసింహారావు, బలమాల జయరాజు, మోటపోతుల రాణి, కంకణాల లచ్చమ్మ మల్లాపురం గ్రామంలో గారపాటి వెంకమ్మ (60), వెంపటి రాములమ్మ (17), మేడి చిన్నమ్మాయి (77) దొనకొండ లక్ష్మీనరసమ్మ (50), దుగ్గిదేవర వెంకయ్య (60) జ్వరాలతో మృతి చెందారు.
సింగరాయిపాలెం ఖాళీ...
జ్వరాల భయంతో సింగరాయపాలెం, తుమ్మలపల్లి గ్రామాల ప్రజలు ఇళ్లు వదిలిపెట్టి బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. ఇంట్లో ఒకరికి వస్తే విషజ్వరాలు ఆ వీధంతా సోకుతుండటంతో తమకు జ్వరాలు రాకుండా ముందుగానే గ్రామాన్ని విడిచి పెట్టి పోతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్క సింగరాయపాలెంలోనే సుమారు 50 కుటుంబాల వారు ఇళ్లు వదిలి బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.