
రామయ్యకు కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
- స్వామివారికి నిత్యకల్యాణం
- అమ్మవారికి కుంకుమార్చన
భద్రాచలం : మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేశారు. గోదావరి నది నుంచి తీర్థ జలాలను తెచ్చి.. భద్రుని గుడిలో అభిషేకం నిర్వహించారు. ఈనెల 13 నుంచి 18 వరకు జరిగిన పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారి నిత్యకల్యాణాలు నిలిపి వేసిన విషయం విదితమే. అయితే శుక్రవారం నుంచి స్వామివారి నిత్యకల్యాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. నిత్య కల్యాణమూర్తులను ఆలయ ప్రాకార మండపానికి తీసుకొచ్చి.. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశక్రమాన్ని భక్తులకు తెలియజేసి.. ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవోపేతంగా స్వామివారికి నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.
సామూహిక కుంకుమార్చన
రామాలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీతాయారమ్మ వారికి మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా అభిషేకం నిర్వహించారు. గోదావరి నదీ జలాలు, నారికేళ జలాలు, హరిద్రాచూర్ణాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. సాయంత్రం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.