- గుండెల్లో పెట్టుకున్న దళిత కుటుంబం ∙
- వల్లభి రామాలయంలో 90 ఏళ్లుగా దళితులే పూజారులు
- ధూప, దీప నైవేద్యాలతో శ్రీరామచంద్రుడికి నిత్యపూజలు ∙
- కులమతాలకతీతంగా దర్శనానికి భక్తుల రాక
ముదిగొండ: సామాజిక కట్టుబాట్లు కఠినంగా ఉన్న రోజుల్లో దళితులకు ఆలయ ప్రవేశం ఉండేది కాదు. కుల వివక్షత అడుగడుగునా తాండవించేది. అలాంటి రోజుల్లో దళితులు దేవుడిని తమ గుండెల్లో పెట్టుకుని రామాలయం నిర్మాణం చేపట్టారు. ఆ ఆలయానికి 90 ఏళ్ల నుంచి వారసత్వంగా ఇప్పటికీ దళితుడే పూజారిగా కొనసాగుతుండటం విశేషం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ రామచంద్రస్వామికి నిత్య పూజలు జరుగుతుండగా.. కులమతాలకతీకంగా అంతా దర్శించుకుని తరిస్తున్నారు.
ఆ అవమాన భారంతోనే..
ఏళ్ల క్రితం గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండగా కొందరు దళితులు గోడ పైనుంచి చూస్తుండగా అగ్రకుల పెద్దలు అవమానించారు. దీన్ని ఆత్మగౌరవ సమస్యగా భావించిన దళితులు రామాలయం నిర్మాణానికి ప్రతిన బూనారు. స్థల సేకరణ, ఆపై దేవాలయ నిర్మాణం చకచకా జరగగా.. దళితవాడలో సద్గురు బోధనానంద బోధనల ప్రభావంతో ఆధ్యాత్మిక చింతన అలవర్చుకున్న వంగూరి రామస్వామి తొలినాళ్లలో పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. మొదట రాములవారి చిత్ర పటంతో నిత్యం పూజలు చేసేవారు. చిన్నగా నిర్మించిన ఆలయంలో పూజలు చేస్తున్న దళితులను అగ్రకులాల వారు హేళన చేసేవారు.
దీంతో అగ్రకులాలు – దళితుల నడుమ వివాదం రాజుకుంది. అప్పటికే రామాలయ నిర్మాణం పేరుతో ఆత్మగౌరవ జెండాను ఎగురవేసిన దళితులు అగ్రకులాలపై సై అంటే సై అన్నారు. దీన్ని తట్టుకోలేక అగ్రకులాల వారు దాడులకు పాల్పడటంతో పలువురు గ్రామాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది.
ఈ విషయం తెలిసిన గాంధేయవాది బన్సాలీ వల్లభి గ్రామానికి చేరుకుని దళితులు నిర్మించిన రామాలయంలోనే దీక్షకు పూనుకున్నారు. ఈ వార్త బాహ్య ప్రపంచానికి తెలియడంతో ఆనాటి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోగా ఇరువర్గాల మధ్య రాజీ అనంతరం బన్సాలీ దీక్ష విరమించారు.
భారమైనా బాధ్యతగా..
దళితులు రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దస్తమానం కష్టపడితే కుటుంబాలను పోషించుకోవడమే కష్టం. అయినప్పటికీ కుటుంబ బాగోగుల కంటే మిన్నగా రాముడి కోసం, రాముడే శ్వాసగా వంగూరి రామస్వామి కుటుంబం జీవిస్తోంది. ఎంత కష్టమైనా.. తాము తిన్నా తినకపోయినా రామయ్యకు నిత్యపూజలు చేయడం, నైవేద్యం సమర్పించడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కుటుంబ పోషణ మాటేమో కానీ.. వీరే కుటుంబానికి భారంగా మారినా రాముడి సేవలోనే జీవిస్తున్నారని చెప్పాలి.
వైఎస్సార్ హయాంలో ధూపదీప నైవేద్యం
ఆలయంలో ఏటా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. వంగూరి రామస్వామి నిత్యం ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తూనే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవారు. వంగూరి రామస్వామి మరణానంతరం 1988లో ఆయన కుమారుడు చిన ముత్తయ్య పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. 2021 వరకు ఆయన కొనసాగగా అనారోగ్య కారణాలతో చిన ముత్తయ్య మరణించాక ఆయన మనవడు అనంతరాములు పూజారిగా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ క్రమాన అనంతరాములు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన అర్చకత్వం, పౌరోహిత్యంలో శిక్షణ పొందడం విశేషం. కాగా, ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో పలు ఆలయాల నిర్వహణ, అర్చకుల భృతి కోసం ధూప, దీప నైవేద్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో వల్లభి ఆలయానికి కూడా చోటు దక్కగా నెలనెలా నిధులు అందుతున్నాయి.
రూ.40 లక్షలతో పునర్నిర్మాణం
తొలినాళ్లలో నిర్మించిన ఆలయం పాతబడటంతో రూ.40 లక్షలతో నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయంలో 2023 మార్చి 17న ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపనతో పాటు రాజగోపురం, కల్యాణమండపం, శిఖర ప్రతిష్టాపన భవనేస్వరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి చేతుల మీదుగా జరిగింది.
దళిత పూజారి ద్వారా దగ్గరైన దేవుడు
నా వయస్సు 80 ఏళ్లు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆలయం ఉంది. అప్పట్లో గానుగ సున్నంతో నిర్మించగా రాములవారి పటంతో శ్రీరామనవమి వేడుకలు వంగూరి చిన ముత్తయ్య జరిపించేవారు. ఇప్పుడు కులమత భేదం లేకుండా అంతా ఆలయానికి వస్తున్నారు. నూతన గుడి నిర్మించాక అభివృద్ధి చెందింది. దళిత పూజారి ద్వారా శ్రీరాముడు మాకు దగ్గరయ్యాడు.
– సామల వీరన్న, వల్లభి గ్రామవాసి
వారసత్వంగా పూజలు...
తాతముత్తాతల నుంచి ఆనవాయితీగా వస్తుండటంతో పాటు టీటీడీలో వేదమంత్రాలు, పూజల్లో శిక్షణ తీసుకున్నాను. ఆలయంలో పూజలు చేస్తూనే సత్యనారాయణస్వామి వ్రతాలు, గృహప్రవేశాలు నిర్వహిస్తుంటా. సీఎంగా వైఎస్సార్ ఉన్నప్పుడు ప్రకటించిన ధూపదీప నైవేద్యం పథకం ద్వారా వచ్చే నిధులతో పాటు గ్రామస్తులు ఇచ్చే విరాళాలు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి.
– వంగూరి అనంతరాములు, ప్రస్తుత పూజారి
Comments
Please login to add a commentAdd a comment