ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం 'శ్రీరామనవమి' వేడుకలకు ఇప్పుడు ప్రధాన వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇక్కడే ఉత్సవాలను నిర్వహిస్తోంది. సర్వలాంఛనాలతో ఈ దేవాలయం నేడు కళకళలాడుతోంది. ముఖ్యంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన నాటి నుంచి ఈ క్షేత్రానికి శోభ, ప్రాశస్త్యం పెరుగుతూ వస్తున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వికాసంలో ఇది శుభ పరిణామం. 'భద్రాచలం' తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో, ఒంటిమిట్టకు పూర్వవైభవం ఆరంభమైంది.
ఈ తీర్థం గురించి ఇంకా తెలియల్సినవారు చాలామంది ఉన్నారు. వారందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో గొప్ప పౌరాణిక,చారిత్రక నేపథ్యం ఉన్నా ఈ దేవాలయం చరిత్రగతిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు, దోపిళ్ళు, దొంగతనాలు,దాడులు, ఘాతకాలకు తట్టుకొని నిలబడింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం ఇన్నేళ్లు నిలబడడానికి, పునరుద్ధరణకు, పురావైభవం పొందడానికి ఆధునిక కాలంలో ఒక మహనీయుడు చేసిన అవిరళమైన కృషి, అనన్య సామాన్యమైన సేవలు నిత్యరమణీయ స్మరణీయాలు. ఆ మహనీయుడి పేరు వావిలకొలను సుబ్బారావు. వాసుదాసుగా, ఆంధ్రవాల్మీకిగా చరిత్ర ప్రసిద్ధుడు. భద్రాచలం శ్రీరామునికి రామదాసు ఎలాగో! ఒంటిమిట్ట కోదండరామునికి వాసుదాసు అలాగ! 'వాసుదాసు -ఒంటిమిట్ట'ను వేరుచేసి చూడలేం.
ఈరోజు ఇంతటి ఉత్సవాలను జరుపుకుంటున్నామంటే? అంతా వావిలకొలనువారి చలవే అన్నది నిర్వివాదాంశం. ఒంటిమిట్టకు 'ఏకశిలా నగరం' అనే పేరు కూడా ఉంది. భాగవతకర్త పోతన్న మహాకవి ఇక్కడి వాడేనని వావిలకొలను సుబ్బారావు ఘంటాపథంగా చెబుతూ ఎందరితోనో వాదనలకు దిగారు. నాటి పండితులలో కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఆ వాదంతో అంగీకరించలేదు. పోతనామాత్యుడు తన భాగవతాన్ని ఈ కోదండరామునికే అంకితం చేశారని ఆయన చెబుతారు. కవి పోతన కొంతకాలం ఒంటిమిట్టలో నివసించారని అంటారు. భాగవత రచనలో కడప మాండలిక పదాలు కూడా ఉండడం, మరోబలమైన సాక్ష్యమని వాసుదాసు వంటి కొందరు పండితులు విశ్వసించారు.
పోతనామాత్యుని విగ్రహాన్ని కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు. "పోతన్నది ఒంటిమిట్ట" అన్నది చారిత్రక వివాదం. ఆ వివాదం గురించి పక్కన పెడదాం. ఈ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. సీత,రామ,లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా మలచడం ఇక్కడి విశిష్టత. కాబట్టి ఈ క్షేత్రం 'ఏకశిలా నగరం'గా ఖ్యాతికెక్కింది. సీతారామలక్ష్మణుల పక్కన ఆంజనేయస్వామి లేకుండా ఇక్కడ విగ్రహాలను రూపొందించారు. భారతదేశంలో ఇలా నిర్మాణమైన ఏకైక దేవాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం మాత్రమే. శ్రీరాముడిని ఆంజనేయుడు కలవకముందు కాలంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్లు ఒక కథనం ప్రసిద్ధంగా ఉంది. అందుకే, అక్కడ ఆంజనేయుడు లేడని చెప్పుకుంటారు.
మృకండుడు,శృంగి మహర్షులు సీతారామలక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని ప్రసిద్ధి. విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఐతిహ్యం. ఇలాంటి విశేషాలెన్నో స్థలపురాణంలో ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు.ఈ దేవాలయం నిర్మాణం మాటున ఎన్నో చారిత్రక విశేషాలు దాగివున్నాయి. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని వివిధ దశల్లో నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో, ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ ఈ దేవాలయన్ని దర్శించాడు. భారతదేశంలోని పెద్దగోపురాల్లో ఈ దేవాలయం ఒకటని రాసుకున్నాడు. ఒకప్పుడు ఈ క్షేత్రం ఎందరో మహాకవులకు, కళాకారులకు నిలయంగా ఉండేది. ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతీయుడే.
ఈయన మనవడే 'అష్ట దిగ్గజ కవులు'లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు. తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి,వరకవి మొదలైన పేరెన్నికగన్న కవులెందరో కోదండరామునికి కవితా రూపంగా అక్షరార్చన చేశారు. ఆధునిక కాలంలో దేవాలయ పునరుద్దీపనలో ప్రధాన భూమికను పోషించిన వావిలకొలను సుబ్బారావు కవిగా కూడా పరమాద్భుతమైన పాత్రను పోషించాడు. 24వేల శ్లోకాల సంగమమైన వాల్మీకి విరచిత సంస్కృత రామాయణాన్ని 108సార్లు పఠించి,మధించి, ఉపాసించి 'మందరం' పేరుతో తెలుగులోకి పద్యాల రూపంలో అనువాదం చేశాడు. ఒంటిమిట్ట శ్రీకోదండరామునికి అంకితం చేశాడు. ఆయన చేసిన ఈ అపూర్వ కృషికి మెచ్చిన నాటి మహాకవి,పండితులు 'ఆంధ్రవాల్మీకి' బిరుదుతో ఆయనను ఘనంగా సత్కరించారు.
బళ్లారి రాఘవ అధ్యక్షతలో ఈ వేడుక జరిగింది. ఒంటిమిట్ట దేవాలయానికి ఎందరో రాజులు,జమీందారులు, సంపన్నులు ఇచ్చిన వందలాది ఎకరాల భూములు,సంపదలు దోపిడీకి,దురాక్రమణకు ఆవిరైపోయాయి. నైవేద్యం పెట్టే నాథుడు కూడా లేని జీర్ణదశకు ఆ దేవాలయం చేరిపోయింది. అటువంటి సమయంలో, వావిలకొలను సుబ్బారావు దేవాలయ పునరుద్ధరణ బాధ్యతను తలకెక్కించుకున్నారు. టెంకాయ చిప్పను చేతిలో పట్టుకొని,దేశమంతా తిరిగి, ఊరూరా బిచ్చమెత్తి, ధనాన్ని పోగుచేసి, ఆలయాన్ని పునరుద్ధరించాడు. "నీ జన్మ ధన్యము కదే ! టెంకాయ చిప్పా " అంటూ శతకం కూడా రాశాడు.
టెంకాయ చిప్ప సంగతి ఎలా ఉన్నా... వాసుదాసు ధన్యుడయ్యాడు, భక్తాగ్రగణ్యుడయ్యాడు. తెలుగువారికి,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు 'ఒంటిమిట్ట' కోదండరామలయాన్ని నిలబెట్టి, పుణ్యచరితుడయ్యాడు. ప్రస్తుతం ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. శ్రీరామనవమి వేడుకలతో పాటు, బ్రహ్మోత్సవాలు, విశేష పూజలు,సంబరాలు నేడు జరుగుతున్నాయి. దేవాలయాలను పరిరక్షించుకోవడం, ఆ అనంతమైన సంపద పరులపరం కాకుండా చూసుకోవడం, ఆధ్యాత్మిక, చారిత్రక,సాంస్కృతిక వైశిష్ట్యాన్ని నిలబెట్టడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. మనందరి కర్తవ్యం కూడా. ఒంటిమిట్ట కోదండరామాలయం అపూర్వ వైభవంతో అనంతకాలం అలరారుతుందని ఆకాంక్షిద్దాం. వాసుదాసు భక్తప్రభాసుగా తరతరాలకు వాసికెక్కుతాడని ఆశిద్దాం.
మాశర్మ, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment