దూసుకొచ్చే ఖడ్గాలు, నిప్పులు కక్కే బరాటాలు
ఆద్యంతం రోమాంచితులను చేసే రణ విన్యాసాలు
దసరాకు అమలాపురాన్ని సూదంటురాయిని చేసే చెడీ తాలింఖానా ప్రదర్శనలు శత్రురాజ్యంపై యుద్ధం చేయాలంటే కొన్నాళ్లకు ముందే కత్తులకు పదును పడతారు. సైనికులను సమాయత్తం చేస్తారు. శకటాలను సిద్ధం చేస్తారు. ఇది నాటి యుద్ధరీతి. అయితే ఇదే సన్నద్ధం ఏటా దసరాకు అమలాపురం పట్టణంలో కనిపిస్తుంది. ఏడు వీధులకు చెందిన చురకత్తుల్లాంటి కుర్రాళ్లు పట్టా కత్తులకు పదును పెడతారు. భద్రపరచిన బళ్లేలు, బాణా కర్రలను బయటకు తీస్తారు. కత్తి, కర్రసాము సాధన చేస్తారు. అయితే ఇదంతా శత్రురాజ్యంపైనో, వైరి వీరులపైనో యుద్ధానికి కాదు. ‘బాహుబలి’ లాంటి చిత్రం షూటింగ్ కోసం అసలే కాదు. ఏటా దసరా సంబరాలకు కోనసీమ కేంద్రం అమలాపురంలో చేసే చెడీ తాలింఖానా వీరవిద్యా ప్రదర్శన కోసమే ఈ కత్తుల ఖణేల్‌లు, బళ్లేల జిగేల్‌లు. రహదారులను రణవేదికలుగా మారుస్తూ, రాచరిక కాలపు యుద్ధాన్ని తలపించే ఈ సాహసోపేత విన్యాసాలను ఈ దసరా సందర్భంగా తిలకించేందుకు బుధవారం రాత్రి రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున జనం అమలాపురం తరలి రానున్నారు.
అమలాపురం రూరల్ : విజయదశమి నాడుæ అమలాపురం వీధుల్లో జరిగే చెడీ తాలింఖానా ప్రదర్శనల సందడి అంతాఇంతా కాదు. వీధుల్లో యువకులు, పెద్దలు ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా ప్రదర్శించే చెడీతాలింఖానా ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. కళ్ళకు గంతలు కట్టుకుని మనిషి శరీరం, కంఠం, నుదురు, పొత్తికడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు. అగ్గిబరాటాలు, లేడికొమ్ములు, పట్టాకత్తులతో వేగంగా, ఒడుపుగా కదులుతూ యువకులు చేసే విన్యాసాలు గ్రాఫిక్స్‌తో కూడిన సినీ పోరాటాలను చిన్నబుచ్చుతాయి. ఈ విద్య ప్రదర్శనలో క్షణకాలం, వెంట్రుకవాసి ఏమరుపాటు జరిగినా అవతలి వీరుడి శరీరంలో ఏదో ఒక అవయవం తెగిపడుతుంది. అందుకే చూసే వారంతా ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని నరాలు తెగే ఉత్కంఠకు లోనవుతారు. ఈ ఏడాది దశమి మంగళవారం వచ్చినందున బుధవారం రాత్రి విన్యాసాలు జరగనున్నాయి.
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో..
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయుల్లో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఆయన స్ఫూర్తితో 1856లో అమలాపురానికి చెందిన రైతుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు ఈ విద్యకు అంకురార్పణ చేశారు. అమలాపురంలో 181 ఏళ్లుగా చెడీతాలింఖానా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొంకాపల్లిలో 1835లో మొదటి తాలింఖానా ప్రదర్శన ప్రారంభమైంది. స్వాతంత్ర సమరయోధుడు రామదాసు 1856లో మహిపాలవీధిలో ఈ ప్రదర్శనలను ప్రారంభించారు.
అమెరికా నుంచి వచ్చి శిక్షణనిస్తున్న ఇంజనీర్
ఆయన అనంతరం ఈ విన్యాసాలను నిర్వహించిన ఆయన మనవడు రామదాసు ఆరునెలక్రితం మృతి చెందారు. ఆయన కుమారుడు మల్లేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఇంజనీర్‌గా పని చేస్తున్న యువకుడు మల్లేష్. అయినా దసరా ఉత్సవాల కోసం అమలాపురం వచ్చారు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న చెడీతాలింఖానా గురువుగా బాధ్యతలు చేపట్టి యువకులకు శిక్షణ ఇస్తున్నారు. 161వ వార్షికోత్సవాన్ని తండ్రి రామదాసుకు అంకితం ఇస్తున్నారు. కాగా రామదాసు విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆవిష్కరించనున్నారు.
పలు వీధుల్లో ‘పోరు’దళాలు
వీటితోపాటు గండు వీధి మైనర్స్ పార్టీ చెడీ తాలింఖానా విన్యాసాలకు 108 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఇక నల్లా వీధిలో చెడీతాలింఖానా ప్రదర్శనలను 1967లో ప్రారంభించారు. కడలి అప్పారావు 1945లో శ్రీరామపురంలో మైనర్స్ పార్టీ చెడీ తాలింఖానా ప్రారంభించారు. రవణం మల్లయ్యవీధి తాలింఖానా ప్రదర్శన కూడా దశాబ్దాల చరిత్ర ఉంది.
కనులకు ఇంపుగా ఊరేగింపులు
దసరా ఉత్సవాల్లో పట్టణ ంలోని ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను ఊరేగింపులో ప్రదర్శిస్తారు. బుధవారం రాత్రి బాజాభజంత్రీలు, డప్పువాయిద్యాలు, శక్తివేషధారణలు, కోయడ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్, తీన్‌మార్ బ్యాండ్‌లు, విద్యుత్‌దీపాలంకరణలతో వాహనాలు ముం దుకు సాగుతాయి. కొంకాపల్లి ఏనుగు అంబారీ, ఆంజనేయస్వామి వాహనం, మహిపాలవీధి రాజహంస, గండువీధి శేషశయన, రవణం వీధి మహిషాసుర మర్దిని, రవణం మల్లయ్యవీధి గరుడ విష్ణు, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మ వాహనం, శ్రీరామపురం హంస, శ్రీకృష్ణుడు, వినాయక వాహనాలను వీధుల్లో రాత్రి ఏడు గంటల నుంచి ఊరేగిస్తారు. ప్రధాన వీధుల్లో ఊరేగాక వాహనాలన్నీ ముమ్మిడివరం గేటు వద్దకు చేరుకుంటాయి. గురువారం ఉదయం వరకు వేడుక సాగుతుంది. జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కూడా ఉత్సవాలను తిలకించేందుకు అమలాపురం తరలివస్తారు.