
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: వెబ్‌సైట్ల హ్యాకింగ్‌తో విద్యుత్ సంస్థలు కళ్లు తెరిచాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సర్వర్లను వేరుచేసే ప్రక్రియను ముమ్మరం చేశాయి. వీలైనంత త్వరగా డేటాను సొంతంగా నిల్వ చేసుకోవాలని భావిస్తున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోని తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల డేటా హ్యాకింగ్ నేపథ్యంలో తాజా పరిస్థితిని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు గురువారం సమీక్షించారు. డిస్కమ్‌ల వెబ్‌సైట్లు హ్యాక్ అయినప్పటికీ.. డేటాను తిరిగి పొందే వీలుందని చెబుతున్నారు. వెబ్‌సైట్లను నిర్వహిస్తున్న టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్)తో డిస్కమ్‌ల సీఎండీలు సంప్రదింపులు జరిపారు. అనంతరం నిర్వహించిన అంతర్గత సమీక్షలో అనేక అంశాలను గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. వీటికి సంబంధించిన డేటాను డిజిటలైజ్ చేసే ప్రక్రియ 2012లోనే ప్రారంభమైంది. 2015లో టీసీఎస్‌తో ఒప్పందం చేసుకున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు ఇచ్చింది. అప్పట్లో ప్రైవేట్ సంస్థకు దీని నిర్వహణ బాధ్యతను అప్పగించాయి. వీటికి సంబంధించి సర్వర్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. బ్యాకప్ మాత్రం తిరుపతిలోని దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంస్థ కాంట్రాక్ట్ గడువు ఈ ఏడాదితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ డిస్కమ్‌లు సొంతంగా డేటా స్టోరేజి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్) కూడా పూర్తి చేసినట్టు డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు.
భద్రతలో లోపాలున్నాయా?
రెండేళ్ల క్రితం దక్షిణ ప్రాంత పరిధిలో ఆన్‌లైన్ టెండర్లు లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. అత్యంత రహస్యంగా నిర్వహించాల్సిన ఈ ప్రక్రియను పోటీ సంస్థలకు లీక్ చేయడంపై దుమారం రేగింది. అప్పట్లో సాంకేతిక కమిటీ వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. కోట్లాది రూపాయల కాంట్రాక్టుల వివరాలు లీకవ్వడంపై కమిటీ ఎలాంటి వివరాలను సేకరించలేకపోయింది. డేటా మొత్తం ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉండటం వల్లే ఈ సమస్య తలెత్తిందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా వెబ్‌సైట్ హ్యాక్ కావడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. మరోవైపు వెబ్ డేటా తెలంగాణలో ఉండటం వల్ల భద్రత లేదని అధికారులు భావిస్తున్నారు. అక్కడి సర్వర్లపై తెలంగాణ సంస్థలకే పూర్తి అధికారం ఉండటం కూడా సమస్యగా మారుతోందని అధికారులు చెబుతున్నారు.
ఏపీ ఈపీడీసీఎల్ ఆన్‌లైన్ సేవలకు బ్రేక్
అంతర్జాతీయ హ్యాకర్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడంతో ఆ సంస్థకు సంబంధించిన ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించే వారికి ఇబ్బంది తలెత్తింది. డిస్కంల వెబ్‌సైట్లు హ్యాక్ అయి అప్లికేషన్ సర్వర్‌కు వైరస్ ఇంజెక్ట్ అయినట్టు తెలుసుకున్న అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వాటి లింకు కట్ చేశారు. అప్పట్నుంచి ఇతర డిస్కంలతోపాటు ఈపీడీసీఎల్ వెబ్‌సైట్ కూడా ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. ఈ వెబ్‌సైట్ ద్వారా మన రాష్ట్రంలో రోజుకు సగటున 10 వేల లావాదేవీలు జరుగుతున్నాయి. హ్యాకింగ్ వల్ల మూడు రోజులుగా ఆన్‌లైన్ చెల్లింపులు స్తంభించిపోయాయి. ఈపీడీసీఎల్ డేటాను వేరే సర్వర్‌లో ఉంచామని, అందువల్ల డేటాకు వచ్చిన ముప్పు లేదని ఈపీడీసీఎల్ జనరల్ మేనేజర్ (ఐటీ) శ్రీనివాసమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు.
హ్యాక్ అయిందా..డేటా చెరిపేశారా?
వెబ్‌సైట్ల హ్యాకింగ్ నేపథ్యంలో విద్యుత్ సంస్థల్లో అనేక వాదనలు విన్పిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థల్లో ప్రధానంగా టెండర్ల వివరాలు, విద్యుత్ బిల్లుల వివరాలు మాత్రమే ఉంటాయి. హ్యాకర్లకు దీనివల్ల ప్రయోజనం ఏమిటనే వాదన తెరమీదకొచ్చింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్న నేపథ్యంలో.. కొత్త ప్రభుత్వం వస్తే విద్యుత్ శాఖలోని అక్రమాలపై విచారణ జరిపే వీలుంది. డిస్కమ్‌ల పరిధిలో గత ఐదేళ్లుగా అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇటీవల కవర్డ్ కండక్టర్ల కుంభకోణంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రమేయం ఉందనే ఆరోపణలు బయటకొస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విలువైన సమాచారం తొలగించే ప్రయత్నం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాకప్ డేటా ఉన్నప్పటికీ, అవసరమైన డేటాను తొలగించి, ఇతర డేటాను తిరిగి స్టోర్ చేసే వీలుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలకు ఎంతమాత్రం అవకాశం లేదని డిస్కమ్‌ల సీఎండీలు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా హ్యాకింగ్‌పై పూర్తిస్థాయి విచారణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment