
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) రాజమహేంద్రవరం సర్కిల్‌లో కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్(ఎస్‌ఎస్‌ఆర్) సవరణలో ధరలు పెరగకపోగా, తగ్గించడంతో తమకు గిట్టుబాటు కాదంటూ నెల రోజుల నుంచి పనులు నిలిపివేశారు. చివరగా 2014 ఏప్రిల్‌లో ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల సవరణ జరిగింది. మూడేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టులో 2014 ఎస్‌ఎస్‌ఆర్ రేట్లలో ఏపీఈపీడీసీఎల్ మార్పులు చేసింది. ఆ మార్పుల్లో పాత రేట్లలో పెరుగుదల లేకపోగా సగటును 30 శాతం రేట్లు తగ్గిపోయాయి. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు ఏడాదికి ఒకసారి సవరిస్తారు. ఆయా జిల్లాల్లో కూలీల అందుబాటు, రేట్లు ఆధారంగా కలెక్టర్లు ఏటా లేబర్ చార్జీలు నిర్ణయిస్తారు. ఆ మేరకు ఏపీఈపీడీసీఎల్ కూడా జిల్లాల వారీగా ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు నిర్ణయిస్తుంది. ఫలితంగా ఐదు జిల్లాల్లో ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు భిన్నంగా ఉన్నాయి.
30 శాతం మేర తగ్గిన రేట్లు...
ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన సవరించిన ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతో 2014–15 రేట్లను పోల్చితే పెరగకపోగా సరాసరి 30 శాతం ప్రస్తుతం తగ్గిపోయాయి. 2014–15లో విద్యుత్ స్తంభాన్ని కిలోమీటర్ దూరం తరలిస్తే రూ.545 ఇచ్చేవారు. అదే రెండు కిలోమీటర్లకు రూ.681, మూడు కిలోమీటర్లకు రూ.818, ఐదు కిలోమీటర్లలోపు దూరానికి రూ. 980లు చెల్లించేవారు. అయితే తాజాగా ఇవన్నీ ఎత్తివేసిన ఏపీఈపీడీసీఎల్ ఎంత దూరం విద్యుత్ స్తంభం తరలించినా రూ.510 చెల్లించేలా ఎస్‌ఎస్‌ఆర్ రేట్లను సవరించింది. స్తంభాలు పాతే గుంతలు తొవ్వితే గతంలో రూ.357 చెల్లించగా ప్రస్తుతం ఆ రేటును రూ. 312.50లకు తగ్గించారు. స్తంభం పాతినందుకు పాత రేటు రూ.575 ఉండగా, తాజాగా ఆ రేటు రూ.507లకు కుదించారు. గృహ అవసరాలకు వినియోగించే విదుత్య్ వైరు కిలో మీటర్ మేర స్తంభాలపై అమర్చినందుకు గతంలో రూ.1797 చెల్లించగా, ప్రస్తుతం ఆ రేటులో రూ.297 కోత విధించి రూ.1500లకు పరిమితం చేశారు. పాత విద్యుత్ తీగలను తొలగించి కొత్త తీగలను అమర్చినందుకు ఉన్న రేట్లను రూ.1390 నుంచి రూ.690లకు కుదించారు.
గిట్టుబాటు కాదంటున్న కాంట్రాక్టర్లు...
2014–15 ఆర్థిక ఏడాదిలో జరిగిన ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల సవరణలో వాస్తవానికి అధికంగా రాజమహేంద్రవరం సర్కిల్‌లో రేట్లు నిర్ణయించామని ఏపీఈపీడీసీఎల్ భావించి తాజా నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మూడేళ్ల తర్వాత సవరించిన ఎస్‌ఎస్‌ఆర్‌లో రేట్లు పెంచకపోగా తగ్గించిన రేట్లతో తమకు గిట్టుబాటు కాదంటూ కాంట్రాక్టర్లు అధికారులకు తేల్చిచెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన సవరించిన ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు అమలులోకి వచ్చాయి. అప్పటి నుంచి రేట్లను సవరించాలని విజ్ఞప్తి చేస్తూ కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. అయితే సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నెలరోజుల నుంచి కొత్త పనులు చేపట్టడం ఆపేశారు. వినియోగదారులు డీడీలు చెల్లించిన మూడు నెలల లోపు విద్యుత్‌శాఖ అధికారులు వారి పనులు పూర్తి చేయాలి. అయితే ప్రస్తుతం కాంట్రాక్టర్లు పనులు చేయకపోవడంతో రాజమహేంద్రవరం సర్కిల్‌లోని ఐదు డివిజన్లలో వందలాది పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
తుపాను హెచ్చరికలతో ఆందోళన...
ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు తుపాను హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లాలోని విద్యుత్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. తుపాను వల్ల స్తంభాలు కూలి, వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. తిరిగి విద్యుత్ పునరుద్ధరణలో కాంట్రాక్టర్ల వద్ద ఉండే సిబ్బందే కీలక ప్రాత పోషిస్తారు. నాలుగు రోజుల క్రితం రాజమహేంద్రవరం లాలాచెరువులో లారీ అదుపు తప్పి ఢీకొట్టడంతో 20 స్తంభాలు కూలిపోయాయి. అ సమయంలో విద్యుత్ అధికారులు, సిబ్బందే అష్టకష్టాలు పడి మరుసటి రోజు మధ్యాహ్నం సమయానికి తిరిగి పునరుద్ధరించారు. కాంట్రాక్టర్లు ఎలాంటి సహాయం అందించలేదు. ప్రస్తుతం పాత రేట్లు చెల్లిస్తూ కొత్త రేట్లలో మార్పులు చేర్పులు చేస్తే తాము పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టర్లు అధికారులకు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment