- కస్టమర్ సర్వీస్ సెంటర్ల నుంచి తొలగనున్న పలు సేవలు
- అధికారులకు స్పష్టం చేసిన సీఎండీ ఎంఎం నాయక్
ఏపీఈపీడీసీఎల్‌కు ‘మీ–సేవ’లు
Published Sat, Aug 13 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సేవలను వినియోగదారులకు అందించేందుకు మీ–సేవ కేంద్రాలను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల్లో 67 కస్టమర్ సర్వీస్ సెంటర్ల ద్వారా మాత్రమే ఏ సేవకైనా దరఖాస్తు చేసే వెసులుబాటు ఉంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) నుంచి అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టు తీసుకున్న ఓ ప్రైవేటు సంస్థ వాటిని నడుపుతోంది. ఇక మీదట దశల వారీగా వాటిలో అందుతున్న సేవలను మీ సేవ కేంద్రాలకు బదలాయించి అక్కడి నుంచే ప్రజలకు అందేలా చేయాలని డిస్కం భావిస్తోంది. ఈ విషయాలను అధికారులకు సీఎండీ ఎంఎం నాయక్ స్పష్టం చేశారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి ఐదు జిల్లాల సర్కిల్ అధికారులతో సీఎండీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కస్టమర్ సర్వీస్ సెంటర్ల అంశంపై సీఎండీ ప్రధానంగా చర్చించారు. ఐదు జిల్లాల్లోనూ వందలాది మీ–సేవ కేంద్రాలు ఉన్నందున కేటగిరి 1,2,7 విద్యుత్ కొత్త సర్వీసుల కోసం దరఖాస్తులను వాటి ద్వారా స్వీకరించే ఏర్పాటు చేస్తే వినియోగదారులకు వెసులుబాటు కలుగుతుందని అధికారులకు సీఎండీ సూచించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐటీ జీఎం శ్రీనివాసమూర్తి ధ్రువీకరించారు. రానున్న రోజుల్లో అన్ని సేవలను మీ సేవా కేంద్రాల నుంచే అందించాలని డిస్కం భావిస్తున్నట్లు ‘సాక్షి’కి ఆయన వెల్లడించారు.
Advertisement