సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగలా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు వ్యవసాయ విద్యుత్ సర్వీసులను వేగంగా మంజూరు చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57,420 వ్యవసాయ సర్వీసులు అందజేశారు. డిస్కంల వారీగా పరిశీలిస్తే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ ఏడాది (2022–23 ఆర్థిక సంవత్సరం) ఇప్పటివరకూ 33,794 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను అధికారులు అందజేశారు.
మరో 33,099 సర్వీసులకు ఈ నెలాఖరుకల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు జిల్లాల్లో ఈ ఏడాది 4,525 సర్వీసులను రైతులకు అందించారు. 3,687 సర్వీసులను ఈ నెలలో మంజూరు చేయనున్నట్టు ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు.
ఇక ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకూ 19,101 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రైతులకు మంజూరు చేశారు. విజయవాడ సర్కిల్ పరిధిలో 6,411, గుంటూరు సర్కిల్ పరిధిలో 2,064, ఒంగోలుæ సర్కిల్ పరిధిలో 11,479, సీఆర్‌డీఏ పరిధిలో 88 చొప్పున మరో 20,042 కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు.
రూ.1,700 కోట్ల ఖర్చు
వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా తీసుకునే సౌర విద్యుత్‌ను 9 గంటలపాటు పగటిపూటే పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,700 కోట్లను ఖర్చు చేసింది.
అంతేకాకుండా హై–ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్) పథకం ద్వారా రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేయనున్నారు. బోరు దగ్గరకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్వీసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటిని బాగుచేయడం కోసం రూ.102 కోట్లు ఖర్చవుతోంది. అయినప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగు చేయడం లేదా కొత్తది ఇవ్వడం జరగాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో ఆ మేరకు అవసరమైన మెటీరియల్ కూడా ఆయా జిల్లాల స్టోర్లలో అధికారులు సిద్ధంగా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment