power connection
-
ఈవీలకు ప్రత్యేక మీటర్.. విద్యుత్ కనెక్షన్లలో కీలక మార్పులు!
దేశంలో విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించే వారు ఇప్పుడు ఏడు రోజులకు బదులుగా కేవలం మూడు రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్లను పొందవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ఛార్జ్ చేయడానికి ప్రత్యేక విద్యుత్ కనెక్షన్‌ను పొందవచ్చు. ఈ మేరకు విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020ని సవరించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. సవరించిన నిబంధనల ప్రకారం కొత్త విద్యుత్ కనెక్షన్ పొందేందుకు గల గడువును మహానగరాల్లో ఏడు రోజుల నుంచి మూడు రోజులకు, ఇతర మున్సిపల్ ప్రాంతాల్లో 15 రోజుల నుంచి ఏడు రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించారు. ఇక కొండ ప్రాంతాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలు, కొత్త కనెక్షన్లు లేదా ఇప్పటికే ఉన్న కనెక్షన్లలో మార్పుల కోసం వ్యవధి 30 రోజులు ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రూఫ్‌టాప్ సోలార్ రూఫ్‌టాప్ సోలార్ పీవీ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడానికి డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ కాలపరిమితిని కూడా 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. ఏడాదిలో కోటి గృహాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిర్యాదులొస్తే అదనపు మీటర్ వినియోగదారులు మీటర్ రీడింగ్‌లు తమ వాస్తవ విద్యుత్ వినియోగంతో సరిపోలడం లేదని ఫిర్యాదులు చేసిన సందర్భాల్లో డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ ఫిర్యాదు అందిన తేదీ నుంచి ఐదు రోజులలోపు అదనపు మీటర్‌ను ఏర్పాలు చేయాల్సి ఉంటుంది. ఈ అదనపు మీటర్ ద్వారా మూడు నెలలపాటు విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తారు. కో-ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్థుల భవనాలు, నివాస కాలనీలు మొదలైన వాటిలో నివసిస్తున్నవారు పంపిణీ లైసెన్స్‌దారు నుంచి ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత కనెక్షన్లు లేదా మొత్తం ప్రాంగణానికి సింగిల్ పాయింట్ కనెక్షన్‌ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. -
AP: బడుగుల భూముల్లో వెలుగుల పంట
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు బలగం అప్పలనరసయ్య. ఊరు విజయనగరం జిల్లా కొండకరకం. బీసీ వర్గానికి చెందిన ఈయన తన రెండున్నరెకరాల పొలంలో సాగుకోసం పక్క రైతు నుంచి గంటల లెక్కన నీటిని అడిగి తెచ్చుకుని అందుకు తగ్గట్లుగా డబ్బులిచ్చేవాడు. ఆ భారాన్ని తట్టుకోలేక గతంలో విద్యుత్ సర్వీసు కోసం ఏళ్ల తరబడి ప్రయత్నించినా ఫలితంలేదు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్యుత్ సర్వీసు కోసం దరఖాస్తు చేసిన నెలన్నరలోనే కొత్త సర్వీసు మంజూరైంది. ఇప్పుడా రైతు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పగటిపూట నిరంతరాయంగా 9 గంటలు విద్యుత్ వస్తోంది. దీంతో ఏడాది పొడవునా వరి, కాయగూరలు పండిస్తున్నాడు. ‘‘నీటికి లోటు లేకపోవడంతో గతం కంటే పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడులు పెరిగాయి’’ అని ఆ రైతు కంటి నిండా ఆనందంతో చెబుతున్నాడు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్ : కొండా కోనల్లో ప్రకృతినే నమ్ముకుని జీవించే అడవి బిడ్డలు.. రాళ్లు, రప్పల్లో వర్షాలపై ఆధారపడి సాగు చేసుకునే బడుగు జీవులు తరతరాలుగా వెనుకబాటుతనంలోనే బతుకులీడుస్తున్నారు. ఇన్నేళ్లుగా వారిని పట్టించుకున్న వారే లేరు. ఇప్పుడు వీరి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతోంది. రోజు గడిస్తే చాలనుకున్న వారి కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ భరోసానిచ్చి ఉచిత విద్యుత్‌తో వారి ఇంట వెలుగులు నింపుతున్నారు. నిరాదరణకు గురైన వారిని తలెత్తుకుని జీవించేలా చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పగటి పూట ఉచితంగా తొమ్మిది గంటలు విద్యుత్‌ను అందిస్తుండటంతో కూలీలుగా ఉన్న వారు సైతం రైతులుగా మారుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 19.29 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వెనుకబడ్డ సామాజికవర్గాలకు వ్యవసాయ సర్వీసులు ఇవ్వడంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. దీంతో 2019 నుంచి ఇప్పటివరకూ 1.74 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు కొత్తగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేశారు. పాత వాటితో కలిపి ఆయా వర్గాలకు చెందిన మొత్తం 5.02 లక్షల సర్వీసులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దీంతో ఒకప్పుడు రాళ్లు, రప్పలకు నిలయమైన కొండలు నేడు పంట పొలాలతో పచ్చగా కళకళలాడుతున్నాయి. కూలీలుగా ఉన్న మేం రైతులుగా మారాం.. గతంలో నాకున్న ఐదున్నరెకరాల్లో వర్షాధారంగానే పంటలు పండించే వాళ్లం. మా గ్రామంలో అసలు బోర్లే ఉండేవి కావు. ఎక్కడైనా ఉన్నా అర్థరాత్రి బోర్ల దగ్గర జాగారం.. అయినా చేలు తడవక పంట చేతికొచ్చేది కాదు. జగనన్న ప్రభుత్వం వచ్చాక దరఖాస్తు చేసిన నెలరోజుల్లోనే ఉచిత విద్యుత్ సర్వీసు ఇచ్చారు. ఇప్పుడు నాతో సహా అందరికీ విద్యుత్ సర్వీసులు రావడంతో కూలీలుగా ఉన్న మేమంతా రైతులుగా మారాం. గతంలో పంటకు పెట్టుబడి పెట్టిన తరువాత వానలు పడక నష్టపోయే వాళ్లం. ఇప్పుడు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తుండటంతో నీటికి కొదవేలేదు. దిగుబడులు బాగున్నాయి. – ఇజ్జిరోతు సూరప్పలనాయుడు, ఎస్సీ రైతు, రామతీర్ధం, విజయనగరం జిల్లా బాగుపడుతున్న బలహీన వర్గాలు.. వ్యవసాయాన్ని రాష్ట్రంలో పండుగలా మార్చాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచే అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అధికారులూ చర్యలు చేపడుతున్నారు. రానున్న 30 ఏళ్ల వరకూ ఉచిత విద్యుత్‌ను రైతులకు హక్కుగా అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా ఏటా 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ సర్వీసులకు నాణ్యమై విద్యుత్ సరఫరా అందించేందుకు, అవసరమైన విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించారు. దీంతో ముఖ్యంగా బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్‌వల్ల ప్రయోజనం చేకూరుతోంది. – ఐ.పృథ్వీతేజ్, జే పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, డిస్కంల సీఎండీలు ఒక్కో సర్వీసుపై సర్కారుకు రూ.1.20లక్షల ఖర్చు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు విద్యుత్ సర్వీసులతో పాటు ట్రాన్స్ఫార్మర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే సీఎం ఆదేశాల మేరకు 48 గంటల్లోనే బాగుచేయడం, లేదా కొత్తది ఇస్తున్నాం. బోరు దగ్గర విద్యుత్ సర్వీసుకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను ఏర్పాటుచేస్తున్నాం. ఈ మొత్తం ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్వీసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. – మువ్వల లక్ష్మణరావు, ఎస్ఈ, విజయనగరం సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ ఉచిత విద్యుత్ మా బతుకుల్ని మార్చేసింది.. భూమి ఉన్నా పండించుకునేందుకు నీరులేక నిరుపయోగంగా వదిలేయాల్సి వచ్చేది. కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. మా పరిస్థితిని ఉచిత విద్యుత్ మార్చేసింది. వ్యవసాయానికి విద్యుత్ కావాలని అడిగిన నెలరోజుల్లోనే అధికారులు సర్వీసును మంజూరు చేశారు. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నుంచి మా పొలంలో మేం వ్యవసాయం చేసుకుంటూ ఇంకొందరికి పని కల్పించే స్థాయికి వచ్చాం. – వోళ్ల పైడిరాజు, బీసీ రైతు, కొండకరకం గ్రామం, విజయనగరం జిల్లా దరఖాస్తు చేసుకున్న వెంటనే కనెక్షన్ ఇచ్చారు.. నాకు రెండెకరాల పొలం ఉంది. వరి, మొక్కజొన్న, కాయగూరల పంటలు సాగుచేస్తున్నాం. గతంలో వానొస్తేనే పంట పండేది. లేదంటే మా కుటుంబం మొత్తం పస్తులుండేది. మా లైన్‌మెన్‌ని అడిగితే ఉచిత విద్యుత్ సర్వీసు గురించి చెప్పాడు. దరఖాస్తు చేసుకున్న వెంటనే సర్వీసు ఇచ్చారు. ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా, చేయూత వంటి సంక్షేమ పథకాలూ అందుతున్నాయి. ఈ ప్రభుత్వంవల్ల మా బతుకులు బాగుపడ్డాయి. – జమ్మాల తవిటిదొర, ఎస్టీ రైతు, కొరిసీల గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా -
రికార్డు సృష్టించిన ఏపీ.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఫస్ట్
అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతులందరికీ మంచి జరగాలన్నదే లక్ష్యంతో వారి ఆదాయ మార్గాలు పెంచేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి అధిక మొత్తంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసింది. తద్వారా వ్యవసాయ ఆధారిత పంటలతో రైతుల ఆదాయం పెంచేందుకు తోడ్పడుతోంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 20 సూత్రాల అమలు కార్యక్రమం 2022–23 ఆర్థిక సంవత్సరం ఫలితాల నివేదికను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. 2022– 23 ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24,852 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలన్నది లక్ష్యం కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1,24,311 కనెక్షన్లను రైతులకు మంజూరు చేసింది. ఒక్క దరఖాస్తు కూడా పెండింగులో లేకుండా దరఖాస్తుచేసిన ప్రతిఒక్కరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. లక్షకు పైగా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. రైతు ప్రయోజనాల పరిరక్షణ పట్ల జగన్ సర్కారుకు ఉన్న ఎనలేని శ్రద్ధకు ఇది నిదర్శనమని విద్యుత్, వ్యవసాయ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా 4,54,081 వ్యవసాయ పంపుసెట్లను విద్యుదీకరించాలని లక్ష్యం కాగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రాపాలిత ప్రాంతాలు 7,35,338 కనెక్షన్లు జారీ చేశాయి. ఇందులో 1,24,311 కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే మంజూరు కావడం గమనార్హం. రాజస్థాన్‌లో... 44,770 వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం కాగా 99,137 కనెక్షన్లు విడుదల చేసి రాజస్థాన్ రాష్ట్రం దేశంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. 25148కు గాను 89,183 వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలో తృతాయ స్థానంలో నిలిచిందిలక్ష్య 1,50,000 కనెక్షన్లు మంజూరు చేయాలని పంజాబ్ రాష్ట్రం లక్ష్యం కాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 524 కనెక్షన్లు మాత్రమే మంజూరు చేసి ‘జీరో’ శాతం లక్ష్య సాధనలో ఉన్నట్లు కేంద ప్రభుత్వం పేర్కొంది. కేవలం 45 కనెక్షన్లు మాత్రమే మంజూరు చేసి సంఖ్యాపరంగా పాండిచ్చేరి చిట్ట చివరి స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతోనే సాధ్యం : కె. విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని దరఖాస్తుదారులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని మార్గదర్శకం చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగులో పెడితే రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం పెండింగు దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించింది. దీంతో మౌలిక వసతులు కల్పించి మొత్తం 1,24,311 వ్యవసాయ పంపుసెట్లకు గత ఆర్థిక సంవత్సరం విద్యుత్ కనెక్షన్లు జారీ చేశాం. పెండింగు క్లియర్ చేసినందున ప్రస్తుతం దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలు చేస్తున్నాం. -
‘షాక్’ ఇస్తే సర్వీసులెలా పెరిగాయి?.. ఈనాడు కథనం అవాస్తవం
సాక్షి, అమరావతి: ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో గత రెండున్నరేళ్లలో చేనేత విద్యుత్ సర్వి సులు పెరిగాయని సంస్థ సీఎండీ కె. సంతోషరావు తెలిపారు. ‘నేతన్నలకు కరెంట్ షాక్’ అనే శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై గురువారం ఆయన స్పందించారు. నేతన్నలకు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 2021–22 వరకూ 9,912 విద్యుత్ సర్వీసులు వుండగా, 2022–23 నాటికి ఆ సర్వి సుల సంఖ్య 10,125కు పెరిగిందని.. 2023–24 జూలై నాటికి మొత్తం 10,157 సర్వి సులున్నాయన్నారు. అయితే, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా పవర్ లూమ్స్ విద్యుత్ సర్వి సుల సంఖ్య తగ్గినట్లు ఈనాడు కథనంలో రాయడం అవాస్తవమన్నారు. షాక్ ఇస్తే సర్వి సులు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులకు ఇంధన చార్జీల్లో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. అలాగే, చేనేత కార్మికుల గృహాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, నేతన్నల అభ్యర్థన మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కిలోవాట్ హవర్ (కేడబ్ల్యూహెచ్) బిల్లింగ్ విధానానికి అనుమతించిందని తెలిపారు. ఈ ఉత్తర్వులవల్ల మగ్గాలకు సంబంధించిన సర్వీసుల విద్యుత్ బిల్లు కొంతమేరకు తగ్గినట్లు సీఎండీ వెల్లడించారు. -
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు. ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది. ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు. -
అన్నదాత అడిగిందే తడవుగా విద్యుత్ కనెక్షన్
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగలా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు వ్యవసాయ విద్యుత్ సర్వీసులను వేగంగా మంజూరు చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57,420 వ్యవసాయ సర్వీసులు అందజేశారు. డిస్కంల వారీగా పరిశీలిస్తే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ ఏడాది (2022–23 ఆర్థిక సంవత్సరం) ఇప్పటివరకూ 33,794 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను అధికారులు అందజేశారు. మరో 33,099 సర్వీసులకు ఈ నెలాఖరుకల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు జిల్లాల్లో ఈ ఏడాది 4,525 సర్వీసులను రైతులకు అందించారు. 3,687 సర్వీసులను ఈ నెలలో మంజూరు చేయనున్నట్టు ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు. ఇక ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకూ 19,101 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రైతులకు మంజూరు చేశారు. విజయవాడ సర్కిల్ పరిధిలో 6,411, గుంటూరు సర్కిల్ పరిధిలో 2,064, ఒంగోలుæ సర్కిల్ పరిధిలో 11,479, సీఆర్డీఏ పరిధిలో 88 చొప్పున మరో 20,042 కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. రూ.1,700 కోట్ల ఖర్చు వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా తీసుకునే సౌర విద్యుత్‌ను 9 గంటలపాటు పగటిపూటే పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,700 కోట్లను ఖర్చు చేసింది. అంతేకాకుండా హై–ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్) పథకం ద్వారా రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేయనున్నారు. బోరు దగ్గరకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్వీసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటిని బాగుచేయడం కోసం రూ.102 కోట్లు ఖర్చవుతోంది. అయినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగు చేయడం లేదా కొత్తది ఇవ్వడం జరగాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో ఆ మేరకు అవసరమైన మెటీరియల్ కూడా ఆయా జిల్లాల స్టోర్లలో అధికారులు సిద్ధంగా ఉంచారు. -
చీకటి చదువులు.. ఇంకెన్నాళ్లు?
రాయ్‌పూర్ : దేశవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే.. చత్తీస్‌ఘడ్‌లోని ఓ గ్రామంలో మాత్రం గత కొన్నేళ్లుగా విద్యార్థులు సవాళ్లు ఎదుర్కుంటున్నారు. చిమ్మచీకటిలో లాంతరు వెలుగుల మధ్య చదువుకోవాల్సిన పరిస్థితి వాళ్లది. బలరాంపూర్ జిల్లాలోని త్రిశూల్ గ్రామంలో పరిస్థితి ఇది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా కూడా ఈ గిరిజన గ్రామానికి కరెంట్ సరఫరా లేదు. జిల్లా అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని అయినా కూడా పరిస్థితి మారలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్నామని.. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. అయితే గ్రామానికి 15 కి.మీ దూరంలో ఉన్న బీజేపీ ఎంపీ రాంవిచార్ నేతమ్ ఇంటికి మాత్రం నిత్యం కరెంట్ సరఫరా ఉండటాన్ని వారు ప్రస్తావించారు. మరోవైపు గ్రామంలో ప్రైమరీ ఎడ్యూకేషన్ ప్రారంభించినాకూడా సరైన రోడ్డు సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరు కూడా పాస్ కాలేదు.. ఇప్పటివరకూ ఈ గ్రామంలో ఒక్కరు కూడా పదోతరగతి పాస్ అవ్వలేదని గ్రామస్థులు చెబుతుండగా, కరెంట్ లేకపోవడంతో సరిగ్గా చదవలేక ఫెయిల్ అవుతున్నట్లు విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. త్వరలో సమస్యకు పరిష్కారం.. పొరుగునే ఉన్న బుండిపాకు గ్రామానికి కరెంట్ సరఫరా ప్రారంభించామని.. త్వరలోనే త్రిశూల్ గ్రామానికి కూడా సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ తెలిపారు. -
కలకలం!
శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టరేట్ సాక్షిగా కలకలం రేగింది. రెండేళ్లుగా తిరుగుతున్నా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయడం లేదని, అధికార టీడీపీ నాయకులు అడ్డుతగులుతున్నారనే ఆవేదనతో జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన యువ రైతు టంకాల మోహన్‌రంగ బలవన్మరణానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్నవారంతా అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. టంకాల మోహన్రంగకి బాతువ గ్రామంలోని సర్వే నంబర్ 279లో ఎకరాన్నర భూమి ఉంది. ఆ భూమి మెట్టు ప్రాంతంలో ఉండడంతో రెండేళ్ల క్రితం బోరుబావి వేయించాడు. దీనికి విద్యుత్ కనెక్షన్ అవసరం ఉండడంతో సంబంధిత శాఖకు డిపాజిట్‌ను కూడా చెల్లించాడు. అయితే విద్యుత్ కనెక్షన్ మంజూరు కానీయకుండా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ విద్యుత్ కనెక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రెండుసారు కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. మరో రెండు పర్యాయాలు గ్రామంలో జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో కూడా వినతి పత్రాలు అందజేశాడు. అలాగే ముఖ్యమంత్రికి తెలియజేసేలా 1100 నంబర్‌కి కూడా ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో చావే శరణ్యమని భావించాడు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ వచ్చిన మోహనరంగ.. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకున్నాడు. అయితే అక్కడ ఉన్న వారు వెంటనే మేల్కొని అడ్డుకోవడంతో ఆపాయం తప్పింది. విషయం జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. రైతు మోహనరంగతో మాట్లాడారు. రెండో రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జి.సిగడాం తహసీల్దారు, ఆర్ఐలకు ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. భూమిని అమ్మాలని పట్టుబడుతున్నారు తమ గ్రామానికి చెందిన అధికార్టీ నాయకుడు, రేషన్ డీలర్ కూర్మారావు రియల్ ఎస్టెట్ వ్యాపారం చేస్తుంటారు. దీంతో నా భూమిని అమ్మాలని పట్టుబడుతున్నారు. దీనికి అంగీకరించలేదు. దీంతో విద్యుత్ కనెక్షన్ మంజూరు కానీయకుండా పలుకుబడిని ఉపయోగించి అడ్డుకుంటున్నారు. దీంతో చచ్చిపోవాలనుకున్నాను.- మోహన్‌రంగ,బాధిత రైతు -
రూ.125కే విద్యుత్ కనెక్షన్
కర్నూలు (రాజ్‌విహార్) : కేంద్ర ప్రభుత్వ చేయూతతో రూ.2800 కోట్లు వెచ్చించి విద్యుదీకరణ పనులు చేపట్టనున్నట్లు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ హెచ్.వై. దొర తెలిపారు. శుక్రవారం కర్నూలులో ఆయన విలేకరుతో మాట్లాడారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ యోజన కింద తమ డిస్కం పరిధిలోని 8 జిల్లాల్లో (రాయలసీమ జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 3 లక్షల మందికి రూ.125 కే విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 500 వాట్స్ లోపు లోడు ఉన్న ఇంటికి తామే వైరింగ్ చేసి ఒక బల్బు ఇవ్వడంతోపాటు ఉచితంగా మీటర్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇది టెండరు దశలో ఉందన్నారు. -
మిషన్ పనుల్లో అపశ్రుతి
చింతలపల్లి(ఎల్కతుర్తి) :చింతలపల్లిలో మిషన్ కాకతీయ పనుల్లో ా గంగా జరుగుతున్న చెరువు మరమ్మతు పనుల్లో అపశ్రుతి దొర్లింది. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి ఆటోడ్రైవర్ జంగం రాజు విద్యుత్ షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రత్యక్ష సాక్షుల కథ నం ప్రకారం... కొద్దిరోజులుగా చెరువులో మట్టి తీసి కట్ట పోస్తున్నారు. కట్ట కింది భాగంలో 11 కేవీ విద్యు త్ స్తంభాలున్నాయి. కట్టపై మట్టి పోస్తుండడంతో స్తంభాలు మునిగి వైర్లు చేతికందేలా అయ్యాయి. స్థాని కులు విద్యుత్ అధికారులకు సమాచారమందించగా, కాంట్రాక్టర్‌తో విద్యుత్‌శాఖ ఏఈ మాట్లాడగా తొలగి స్తామని చెప్పారు. అయినా స్తంభాలు తొలగించకపోవడంతో ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ కనెక్షన్ నిలిపివేశారు. గ్రామ తాగునీటి బావికి ఈ లైన్నుంచే కనెక్షన్ ఉండడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించిన అధికారులు... స్తంభాలు తొలగించేదాకా పను లు చేయొద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు. పెడచెవిన పెట్టిన కాంట్రాక్టర్ మళ్లీ పనులు ప్రారంభించాడు. గురువారం మత్తడి పనుల కోసం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రాజు సలాకను తన ఆటోలో తీసుకువచ్చి దింపుతుండగా ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. కాళ్లకు చేతులకు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ముల్కనూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి మెరుగ్గానే ఉంది. -
బ్యాంకు ఖాతా ఉంటేనే కనెక్షన్: పీయూష్
హైదరాబాద్: కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వారికి బ్యాంక్ ఖాతాను తప్పనిసరి చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 2017 సంవత్సరం నాటికి ఆంధ్రపదేశ్ 27 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 నుంచి అమలు చేసే ‘అందరికీ విద్యుత్’ పథకానికి సంబంధించి మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పలు ఒప్పందాలు జరిగిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ నష్టాలు భారీగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ మాత్రం అతి తక్కువగా ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. దీన్ని మరింత తగ్గించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘జన్‌ధన్ యోజన’కు ఏపీ సర్కారు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తీసుకునేందుకు వీలుగా, విద్యుత్ బిల్లులను సైతం బ్యాంకులోనే చెల్లించే ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల సబ్సిడీలను నేరుగా అందించొచ్చని అభిప్రాయపడ్డారు. అందరికీ విద్యుత్ పథకం వెల్లడించిన 50 రోజుల్లోనే ఒప్పందాలు చేసుకోవడం హర్షణీయమని, రాష్ట్రాభివృద్ధికి బాబు పడుతున్న తపనకు ఇది నిదర్శనమని ప్రశంసించారు. అందరికీ విద్యుత్‌పై కసరత్తు చేయాలి రాష్ట్రంలో కరెంట్ దొంగతనాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దిశగా ఇక నుంచి ఆన్లైన్ పద్ధతిని అమలులోకి తెస్తామన్నారు. అందరికీ విద్యుత్ ఎలా ఇవ్వాలనే విషయమై ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని, అందుకే తేదీని ప్రకటించలేదని తెలిపారు. గతంలో విద్యుత్ సంస్కరణలు తానే తెచ్చానని, ఇప్పుడు అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్లు విద్యుత్ లోటు ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు తిరిగి సంస్కరణలు చేపడుతున్నట్టు చెప్పారు. రాయలసీమలో పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. రాష్ట్రంలో 9 వేల ఫీడర్లున్నాయని, వినియోగదారులు ఇక నుంచి ఇంట్లో కూర్చునే విద్యుత్ పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు, ఎంపీలు సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి రామ్మోహన్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వంద రోజుల పాలనపై రాష్ట్ర కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ రూపొందించిన పుస్తకాన్ని బాబు ఆవిష్కరించారు. -
గుండె కోత
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : వేసవి రాకమునుపే కరెంటు కోతలు బెంబేలెత్తిస్తున్నాయి. రబీ పంటల సాగు సమయంలోనే ట్రాన్స్‌కో అధికారులు తమ మార్కును ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయానికి అధికారికంగా ఒక గంట కోత పెట్టారు. అనధికారికంగా రెండు గంటల పాటు తీసేస్తున్నారు. మిగిలిన ఐదు గంటలు కూడా విడతల వారీగా ఇస్తున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతోందో తెలియని పరిస్థితి. దీంతో అన్నదాతలు వ్యవసాయ బోరుబావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో మొత్తం 1.96 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి కింద వాస్తవానికి 1,61,694 హెక్టార్లలో పంటలను సాగు చేయాలి. అయితే... కొన్నేళ్లుగా వేసవిలో కరెంట్ సరఫరా అస్తవ్యస్తంగా మారుతోంది. దీంతో చాలా మంది రైతులు రబీలో పంటల సాగుకు వెనుకాడుతున్నారు. దీనికారణంగా ఏడాదికేడాది పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రస్తుతం 1.33 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగవుతున్నాయి. ట్రాన్స్‌కో అధికారుల దెబ్బకు భయపడి రైతులు వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు స్వస్తి చెబుతున్నారు. బిందు సేద్యం(డ్రిప్)పై ఆధారపడి కూరగాయల పంటలు, కళింగర, దోస లాంటి పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువగా కూరగాయలు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పప్పుశనగ పంటలు వేశారు. రబీలో వరి సాధారణ విస్తీర్ణం 16,124 హెక్టార్లు కాగా.. ప్రస్తుతం ఆరు వేల హెక్టార్లకే పరిమితమైంది. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 19,448 హెక్టార్లు కాగా.. 12 వేల హెక్టార్లకు పరిమితమైంది. వాస్తవానికి వ్యవసాయానికి విద్యుత్‌కోత విధించరాదనే నిబంధన ఉంది. ఏడు గంటల పాటు నిర్విరామంగా సరఫరా చేయాలి. ట్రాన్స్‌కో అధికారులు మాత్రం అన్నదాతలపై శీతకన్ను వేస్తున్నారు. ఉత్పత్తి తగ్గిందన్న సాకు చూపి మొదట వ్యవసాయ రంగానికే కోత పెడుతున్నారు. కృత్రిమ కొరతేనా? చలి కాలంలోనూ కరెంట్ కోతలు విధిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లాకు 14 మిలియన్ యూనిట్ల కరెంటు అవసరం. ప్రస్తుతం 13.2 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోందని అధికారులు చెబుతున్నారు. చలికాలంలో వినియోగం ఎందుకు పెరిగిందో ట్రాన్స్‌కో అధికారులకే అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. రైతులకు మాత్రం ఇది శాపంగా పరిణమిస్తోంది. సాగు సమయంలోనే కోత పెడుతుండడంతో రబీ పంటలపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. కాగా... కోతల కారణంగా రైతులు నిత్యం వ్యవసాయ బోర్ల వద్దే ఉంటున్నారు. కరెంటు రాగానే అందరూ ఒకేసారి మోటార్లు వేస్తున్నారు. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్‌లోడ్ పడి కాలిపోతున్నాయి. వాటిని మరమ్మతు చేసేందుకు 10 నుంచి 15 రోజులు పడుతోంది. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయి. నిబంధనల మేరకు అర్బన్ పరిధిలో 24 గంటలు, రూరల్ పరిధిలో 48 గంటల్లోపు కొత్త ట్రాన్స్ఫార్మర్ అమర్చాలి. దీన్ని అధికారులెవరూ పాటించడం లేదు. రైతుల ఇబ్బందులను గుర్తించాం విద్యుత్ సరఫరాలో లోటు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నది వాస్తవమే. ఆ లోటును ఎలాగోలా పూడుస్తున్నాం. పగలు కోత పెట్టినా రాత్రి వదులుతున్నాం. అక్కడక్కడ గంట పాటు కోత పడుతోంది. భవిష్యత్‌లో రైతన్నలకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. వేసవిలో వ్యవసాయానికి ఏ విధంగా విద్యుత్ సరఫరా చేయాలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తాం. - ప్రసాద్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ -
కనెక్షన్.. కలెక్షన్
మంథని, న్యూస్‌లైన్ : వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూ రులో ఎన్పీడీసీఎల్ అధికారులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు. డబ్బుల కోసం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. నిబంధనల మేరకు డిపాజిట్లు కట్టినా.. ముడుపులు ముట్టందే ఫైళ్లు ముట్టుకోవడం లేదు. దానికితోడు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పైరవీలు తప్పనిసరి. అధికారుల వైఖరితో ఇబ్బం దులకు గురవుతున్నామని మంథని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఒక హెచ్‌పీ కెపాసిటీ కోసం రూ.1225నుంచి రూ.1375 వరకు డీడీ రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రైతు 3, 5, 7.5 హెచ్‌పీ మోటార్లను వినియోగిస్తుంటాడు. 5హెచ్‌పీ మోటారుకు డీఈ ఎన్పీడీసీఎల్ పేరిట రూ.5125, ఏవో ఈఆర్వో పేరిట రూ.1000 డీడీ తీయాలి. 3హెచ్‌పీకి రూ.3125, రూ.600 డీడీ తీస్తే సరిపోతుంది. 3, 5 హెచ్‌పీ కెపాసిటీ కోసం డీడీలు చెల్లించి కొందరు రైతులు 7.5 మోటార్లను బిగిస్తారు. ఈ విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించే ఎన్పీడీసీఎల్ అధికారులకు రైతు ఎంత కెపాసిటీ కోసం దరఖాస్తు చేసుకున్నా రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. పైగా మంత్రి, శాసనసభ్యుల రికమండేషన్ లెటర్ కూడా తీసుకురావాలని అధికారులు షరతు పెడుతుం డడం వారి ముందు జాగ్రత్త చర్యకు నిదర్శనంగా చెప్పవచ్చు. ముడుపులు ఏమాత్రం తగ్గినా సర్వీసుల మం జూరులో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఏప్రిల్ 2013 నుంచి నవంబర్ 30 వరకు మంథని డీఈ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 746 దరఖాస్తులు అందా యి. అందులో 428 సర్వీసులకు కనెక్షన్లు ఇచ్చిన అధికారులు 318 పెండింగ్‌లో పెట్టారు. ఒక్కో రైతు నెలల తరబడి విద్యుత్‌శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా కనికరించడంలేదు. దీంతో అధికారులు కోరిన విధంగా డబ్బులు ముట్టజెబుతున్నారు. లైన్మార్పిడి, కొత్త స్తంభాల ఏర్పాటు, ఇతరత్రా పనులకు సైతం రేటు నిర్ణయించి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం జిల్లాస్థాయి అధికారులకు తెలిసినా వారు కూడా తిలాపాపం తలపిరికెడు అన్న చందంగా సద్దుకుపోతున్నారు. విచారణ జరిపి చర్యలు - మాధవరావు, డీఈఈ, ఎన్పీడీసీఎల్ మంథని మినీ ట్రాన్స్ఫార్మర్లు, ఇతరత్రా పనులకు వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు. అలాంటి కేసులేమైనా ఉంటే విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. రైతులు తమకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు, ఇతరత్రా సామగ్రికి మా సంస్థ నిర్ణయించి ధర ప్రకారమే డీడీ రూపంలో డబ్బు చెల్లించాలి. -
ఏసీబీ వలలో.. సెస్ జేఎల్ఎం
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్ : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలోని ఎల్లారెడ్డిపేటలో జూనియర్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న గుర్రం శ్రీనివాస్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కుంచం రాజవ్వ అనే మహిళా రైతు వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ మీటరుకోసం దరఖాస్తు చేసుకుంది. మీటరు మంజూరు చేయాలంటే రూ.17వేలు లంచం ఇవ్వాలని జూనియర్ లైన్‌మన్ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. దరఖాస్తు సమర్పిస్తున్నప్పుడే ఫైల్ కదలాలంటే రూ.500 చెల్లించాలని అడగడంతో రాజవ్వ కుమారుడు రవి డబ్బులు ఇచ్చాడు. అప్పటినుంచి మూడు నెలలుగా మీటరు కోసం శ్రీనివాస్ చుట్టూ తల్లీకొడుకులు తిరుగుతున్నారు. తాజాగా ఎస్టిమేషన్ కోసం రూ.7500 చెల్లించాలని శ్రీనివాస్ డిమాండ్ చేయడంతో గురువారం ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం మండల కేం ద్రంలోని సెస్ కార్యాలయం వద్ద శ్రీనివాస్‌ను కలిసిన రవి ఆయనకు రూ.7500 ఇవ్వగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపా రు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు వీవీ.రమణమూ ర్తి, జె.శ్రీనివాస్‌రాజ్, సిబ్బంది పాల్గొన్నారు. లంచంకోసం వేధించాడు లంచం ఇస్తేనే కరెంటు కనెక్షన్ ఇస్తానని చప్పులరిగేలా తిప్పించుకున్నాడు. మేము పేదోళ్లమని ప్రాధేయపడినా వినిపించుకోలేదు. సెస్ ఏఈని కలిస్తే జూనియర్ లైన్మన్నే కలవాలన్నాడు. గత్యంతరం లేక కరీంనగర్ వెళ్లి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాం. - కుంచం రవి, రైతు, ఎల్లారెడ్డిపేట లంచం అడిగేందుకు భయపడాలి జిల్లాలో వరుసగా దాడులు చేస్తూ ఎంతోమంది అవినీతిపరులను పట్టుకుంటున్నాం. అయినా లంచగొడుల తీరు మారకపోవడం బాధాకరం. ప్రభుత్వోద్యోగులు లంచం అడిగేందుకు భయపడే పరిస్థితి రావాలంటే.. ప్రజలు మాకు ఎప్పుటికప్పుడు సమాచారం అందించాలి. - టి.సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ -
జలప్రభపై నిర్లక్ష్యం తగదు : కలెక్టర్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ఇందిర జలప్రభ లక్ష్యాల సాధనలో ఏ స్థాయిలో కూడా నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇందిర జలప్రభ ప్రగతిపై డ్వామా ఇతర శాఖల అధికారులతో మంగళవారం కాన్ఫరెన్స్ హాలు కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సక్సెస్ అయిన బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి విద్యుత్ శాఖకు అంచనాల మేరకు డబ్బులు కట్టినా ఇంత జాప్యం జరిగితే ఎలా అంటూ సంబంధిత అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిర జలప్రభ కింద వేసిన బోర్లలో 560 సక్సెస్ అయ్యాయని, ఇందులో 238 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్, పంపుసెట్లు అమర్చామన్నారు. మిగతావాటికి కనెక్షన్ ఎంతకాలానికి ఇస్తారని ప్రశ్నించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పండ్ల తోటలకు డ్రిప్ సౌకర్యం కల్పన, పెండింగ్ భూముల్లో గ్రౌండ్ వాటర్ సర్వే , ఫీజుబులిటీ ఇచ్చిన పాయింట్లలో బోర్లు వేయడం తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. సోలార్ పంపు సెట్ల వినియోగంపై రైతులకు అవగాహన పెంచి వాటిని వినియోగించుకునేలా చూడాలన్నారు. సమావేశంలో డ్వామా అదనపు పీడీ విశ్వనాథరెడ్డి, ఎంఈ నాగసులోచన, ఏపీడీలు లక్ష్మన్న, అబ్దుల్ కలామ్, అరుణకుమారి, అరుణలత, ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో సేవలందించకపోతే జరిమానా!
విద్యుత్ సమస్యల పెనాల్టీలు పెంచుతూ ఈఆర్సీ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని రుసుములన్నీ చెల్లించి 30 రోజులు దాటినప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోయినా, గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ పాడైందని ఫిర్యాదు చేసి 48 గంటలు దాటినప్పటికీ మార్చకపోయినా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అధికారులు ఇకపై అధికంగా జరిమానాలు చెల్లించాల్సిందే. ఈ మేరకు ఇప్పటికే ఉన్న పనితీరు ప్రమాణాల (స్టాండర్డ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్-ఎస్వోపీ) విధానంలో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గురువారం ఆదేశాలు జారీచేసింది. సకాలంలో సేవలు అందించకపోతే ఈ విషయాన్ని సంబంధిత పై అధికారులకు తెలిపి నష్టపరిహారాన్ని పొందవచ్చునని ఈఆర్సీ పేర్కొంది. నష్టపరిహారం అందకపోతే వినియోగదారుల పరిష్కారాల ఫోరంను ఆశ్రయించాలని సూచించింది.