ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన టంకాల మోహనరంగ
శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టరేట్ సాక్షిగా కలకలం రేగింది. రెండేళ్లుగా తిరుగుతున్నా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయడం లేదని, అధికార టీడీపీ నాయకులు అడ్డుతగులుతున్నారనే ఆవేదనతో జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన యువ రైతు టంకాల మోహన్‌రంగ బలవన్మరణానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్నవారంతా అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. టంకాల మోహన్‌రంగకి బాతువ గ్రామంలోని సర్వే నంబర్ 279లో ఎకరాన్నర భూమి ఉంది. ఆ భూమి మెట్టు ప్రాంతంలో ఉండడంతో రెండేళ్ల క్రితం బోరుబావి వేయించాడు. దీనికి విద్యుత్ కనెక్షన్ అవసరం ఉండడంతో సంబంధిత శాఖకు డిపాజిట్‌ను కూడా చెల్లించాడు. అయితే విద్యుత్ కనెక్షన్ మంజూరు కానీయకుండా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ విద్యుత్ కనెక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రెండుసారు కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు.
మరో రెండు పర్యాయాలు గ్రామంలో జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో కూడా వినతి పత్రాలు అందజేశాడు. అలాగే ముఖ్యమంత్రికి తెలియజేసేలా 1100 నంబర్‌కి కూడా ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో చావే శరణ్యమని భావించాడు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ వచ్చిన మోహనరంగ.. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకున్నాడు. అయితే అక్కడ ఉన్న వారు వెంటనే మేల్కొని అడ్డుకోవడంతో ఆపాయం తప్పింది. విషయం జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. రైతు మోహనరంగతో మాట్లాడారు. రెండో రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జి.సిగడాం తహసీల్దారు, ఆర్‌ఐలకు ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
భూమిని అమ్మాలని పట్టుబడుతున్నారు
తమ గ్రామానికి చెందిన అధికార్టీ నాయకుడు, రేషన్ డీలర్ కూర్మారావు రియల్ ఎస్టెట్ వ్యాపారం చేస్తుంటారు. దీంతో నా భూమిని అమ్మాలని పట్టుబడుతున్నారు. దీనికి అంగీకరించలేదు. దీంతో విద్యుత్ కనెక్షన్ మంజూరు కానీయకుండా పలుకుబడిని ఉపయోగించి అడ్డుకుంటున్నారు. దీంతో చచ్చిపోవాలనుకున్నాను.- మోహన్‌రంగ,బాధిత రైతు
Comments
Please login to add a commentAdd a comment