ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు బలగం అప్పలనరసయ్య. ఊరు విజయనగరం జిల్లా కొండకరకం. బీసీ వర్గానికి చెందిన ఈయన తన రెండున్నరెకరాల పొలంలో సాగుకోసం పక్క రైతు నుంచి గంటల లెక్కన నీటిని అడిగి తెచ్చుకుని అందుకు తగ్గట్లుగా డబ్బులిచ్చేవాడు. ఆ భారాన్ని తట్టుకోలేక గతంలో విద్యుత్ సర్వీసు కోసం ఏళ్ల తరబడి ప్రయత్నించినా ఫలితంలేదు.
కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్యుత్ సర్వీసు కోసం దరఖాస్తు చేసిన నెలన్నరలోనే కొత్త సర్వీసు మంజూరైంది. ఇప్పుడా రైతు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పగటిపూట నిరంతరాయంగా 9 గంటలు విద్యుత్ వస్తోంది. దీంతో ఏడాది పొడవునా వరి, కాయగూరలు పండిస్తున్నాడు. ‘‘నీటికి లోటు లేకపోవడంతో గతం కంటే పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడులు పెరిగాయి’’ అని ఆ రైతు కంటి నిండా ఆనందంతో చెబుతున్నాడు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్ :
కొండా కోనల్లో ప్రకృతినే నమ్ముకుని జీవించే అడవి బిడ్డలు.. రాళ్లు, రప్పల్లో వర్షాలపై ఆధారపడి సాగు చేసుకునే బడుగు జీవులు తరతరాలుగా వెనుకబాటుతనంలోనే బతుకులీడుస్తున్నారు. ఇన్నేళ్లుగా వారిని పట్టించుకున్న వారే లేరు. ఇప్పుడు వీరి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతోంది. రోజు గడిస్తే చాలనుకున్న వారి కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ భరోసానిచ్చి ఉచిత విద్యుత్‌తో వారి ఇంట వెలుగులు నింపుతున్నారు. నిరాదరణకు గురైన వారిని తలెత్తుకుని జీవించేలా చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పగటి పూట ఉచితంగా తొమ్మిది గంటలు విద్యుత్‌ను అందిస్తుండటంతో కూలీలుగా ఉన్న వారు సైతం రైతులుగా మారుతున్నారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 19.29 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వెనుకబడ్డ సామాజికవర్గాలకు వ్యవసాయ సర్వీసులు ఇవ్వడంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. దీంతో 2019 నుంచి ఇప్పటివరకూ 1.74 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు కొత్తగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేశారు. పాత వాటితో కలిపి ఆయా వర్గాలకు చెందిన మొత్తం 5.02 లక్షల సర్వీసులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దీంతో ఒకప్పుడు రాళ్లు, రప్పలకు నిలయమైన కొండలు నేడు పంట పొలాలతో పచ్చగా కళకళలాడుతున్నాయి.
కూలీలుగా ఉన్న మేం రైతులుగా మారాం..
గతంలో నాకున్న ఐదున్నరెకరాల్లో వర్షాధారంగానే పంటలు పండించే వాళ్లం. మా గ్రామంలో అసలు బోర్లే ఉండేవి కావు. ఎక్కడైనా ఉన్నా అర్థరాత్రి బోర్ల దగ్గర జాగారం.. అయినా చేలు తడవక పంట చేతికొచ్చేది కాదు. జగనన్న ప్రభుత్వం వచ్చాక దరఖాస్తు చేసిన నెలరోజుల్లోనే ఉచిత విద్యుత్ సర్వీసు ఇచ్చారు. ఇప్పుడు నాతో సహా అందరికీ విద్యుత్ సర్వీసులు రావడంతో కూలీలుగా ఉన్న మేమంతా రైతులుగా మారాం. గతంలో పంటకు పెట్టుబడి పెట్టిన తరువాత వానలు పడక నష్టపోయే వాళ్లం. ఇప్పుడు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తుండటంతో నీటికి కొదవేలేదు. దిగుబడులు బాగున్నాయి. – ఇజ్జిరోతు సూరప్పలనాయుడు, ఎస్సీ రైతు, రామతీర్ధం, విజయనగరం జిల్లా
బాగుపడుతున్న బలహీన వర్గాలు..
వ్యవసాయాన్ని రాష్ట్రంలో పండుగలా మార్చాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచే అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అధికారులూ చర్యలు చేపడుతున్నారు. రానున్న 30 ఏళ్ల వరకూ ఉచిత విద్యుత్‌ను రైతులకు హక్కుగా అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా ఏటా 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ సర్వీసులకు నాణ్యమై విద్యుత్ సరఫరా అందించేందుకు, అవసరమైన విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించారు. దీంతో ముఖ్యంగా బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్‌వల్ల ప్రయోజనం చేకూరుతోంది. – ఐ.పృథ్వీతేజ్, జే పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, డిస్కంల సీఎండీలు
ఒక్కో సర్వీసుపై సర్కారుకు రూ.1.20లక్షల ఖర్చు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు విద్యుత్ సర్వీసులతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతింటే సీఎం ఆదేశాల మేరకు 48 గంటల్లోనే బాగుచేయడం, లేదా కొత్తది ఇస్తున్నాం. బోరు దగ్గర విద్యుత్ సర్వీసుకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను ఏర్పాటుచేస్తున్నాం. ఈ మొత్తం ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్వీసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. – మువ్వల లక్ష్మణరావు, ఎస్‌ఈ, విజయనగరం సర్కిల్, ఏపీఈపీడీసీఎల్
ఉచిత విద్యుత్ మా బతుకుల్ని మార్చేసింది..
భూమి ఉన్నా పండించుకునేందుకు నీరులేక నిరుపయోగంగా వదిలేయాల్సి వచ్చేది. కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. మా పరిస్థితిని ఉచిత విద్యుత్ మార్చేసింది. వ్యవసాయానికి విద్యుత్ కావాలని అడిగిన నెలరోజుల్లోనే అధికారులు సర్వీసును మంజూరు చేశారు. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నుంచి మా పొలంలో మేం వ్యవసాయం చేసుకుంటూ ఇంకొందరికి పని కల్పించే స్థాయికి వచ్చాం. – వోళ్ల పైడిరాజు, బీసీ రైతు, కొండకరకం గ్రామం, విజయనగరం జిల్లా
దరఖాస్తు చేసుకున్న వెంటనే కనెక్షన్ ఇచ్చారు..
నాకు రెండెకరాల పొలం ఉంది. వరి, మొక్కజొన్న, కాయగూరల పంటలు సాగుచేస్తున్నాం. గతంలో వానొస్తేనే పంట పండేది. లేదంటే మా కుటుంబం మొత్తం పస్తులుండేది. మా లైన్‌మెన్‌ని అడిగితే ఉచిత విద్యుత్ సర్వీసు గురించి చెప్పాడు. దరఖాస్తు చేసుకున్న వెంటనే సర్వీసు ఇచ్చారు. ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా, చేయూత వంటి సంక్షేమ పథకాలూ అందుతున్నాయి. ఈ ప్రభుత్వంవల్ల మా బతుకులు బాగుపడ్డాయి.
– జమ్మాల తవిటిదొర, ఎస్టీ రైతు, కొరిసీల గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment