దేశంలో విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించే వారు ఇప్పుడు ఏడు రోజులకు బదులుగా కేవలం మూడు రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్‌లను పొందవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ఛార్జ్ చేయడానికి ప్రత్యేక విద్యుత్ కనెక్షన్‌ను పొందవచ్చు. ఈ మేరకు విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020ని సవరించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది.
సవరించిన నిబంధనల ప్రకారం కొత్త విద్యుత్ కనెక్షన్ పొందేందుకు గల గడువును మహానగరాల్లో ఏడు రోజుల నుంచి మూడు రోజులకు, ఇతర మున్సిపల్ ప్రాంతాల్లో 15 రోజుల నుంచి ఏడు రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించారు. ఇక కొండ ప్రాంతాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలు, కొత్త కనెక్షన్‌లు లేదా ఇప్పటికే ఉన్న కనెక్షన్‌లలో మార్పుల కోసం వ్యవధి 30 రోజులు ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
రూఫ్‌టాప్ సోలార్
రూఫ్‌టాప్ సోలార్ పీవీ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడానికి డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ కాలపరిమితిని కూడా 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. ఏడాదిలో కోటి గృహాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫిర్యాదులొస్తే అదనపు మీటర్
వినియోగదారులు మీటర్ రీడింగ్‌లు తమ వాస్తవ విద్యుత్ వినియోగంతో సరిపోలడం లేదని ఫిర్యాదులు చేసిన సందర్భాల్లో డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ ఫిర్యాదు అందిన తేదీ నుంచి ఐదు రోజులలోపు అదనపు మీటర్‌ను ఏర్పాలు చేయాల్సి ఉంటుంది. ఈ అదనపు మీటర్ ద్వారా మూడు నెలలపాటు విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తారు.
కో-ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్థుల భవనాలు, నివాస కాలనీలు మొదలైన వాటిలో నివసిస్తున్నవారు పంపిణీ లైసెన్స్‌దారు నుంచి ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత కనెక్షన్‌లు లేదా మొత్తం ప్రాంగణానికి సింగిల్ పాయింట్ కనెక్షన్‌ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment