న్యూఢిల్లీ: ప్రమోషనల్ లేదా అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఫిబ్రవరి 14న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ కమిటీలో టెలికం శాఖ, ఆర్థిక సర్వీసుల విభాగం, గృహ .. పట్టణ వ్యవహారాల శాఖ, రిజర్వ్ బ్యాంక్, బీమా రంగ నియంత్రణ .. అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ), టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) సహా పరిశ్రమ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మరోవైపు, అవాంఛిత కాల్స్ అనేవి యూజర్ల గోప్యతకు మాత్రమే కాకుండా వారి హక్కులకు కూడా భంగం కలిగిస్తాయని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఆర్థిక సేవల సంస్థలు.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ఇలాంటి కాల్స్ ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించినట్లు తెలిపింది. అంతే కాకుండా కస్టమర్లను పోంజీ స్కీములు, క్రిప్టో పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు స్పామ్ కాలర్లు ఇప్పుడు వాట్సాప్ మొదలైన యాప్స్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ కూడా చేస్తున్నట్లు వివరించింది. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్ల నుంచి స్పామ్ మెసేజీలు, అవాంఛిత కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు టెలికం శాఖ, ట్రాయ్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment