న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ద్రవ్య లోటును కట్టడి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భవిష్యత్ తరాలపై రుణాల భారం మోపకుండా చూసేందుకు తగు చర్యలు తీసుకుంటోందని ఆమె వివరించారు. కౌటిల్య ఆర్థిక సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రభుత్వ రుణభారాన్ని తగ్గించుకునేందుకు తోడ్పడే చర్యలన్నింటినీ పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
’దేశ స్థూల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన అంశాలు, అలాగే ద్రవ్య నిర్వహణపరమైన బాధ్యతల గురించి, నేడు తీసుకునే నిర్ణయాల ప్రభావం భవిష్యత్ తరాలపై ఎలా ఉంటుందనే అంశం గురించి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. తదనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నాం’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే ప్రభుత్వ రుణభారం మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ, దాన్ని కూడా తగ్గించుకునే క్రమంలో మిగతా దేశాలు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నాయనేది పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. డిజిటల్ ఎకానమీ ద్వారా దేశీయంగా మరింత పారదర్శకత పెరుగుతోందని మంత్రి చెప్పారు. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడంలో జన్ ధన్ ఖాతాలు కీలక సాధనాలుగా మారాయని వివరించారు.
2014లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు బోలెడన్ని సందేహాలు వ్యక్తమయ్యాయని, ఆ ఖాతాల్లో పైసా కూడా ఉండకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులకు నిర్వహణపరంగా భారమవుతాయనే విమర్శలు వచ్చాయని ఆమె చెప్పారు. అయితే, నేడు జన్‌ధన్ ఖాతాల్లో మొత్తం రూ. 2 లక్షల కోట్ల పైగా బ్యాలెన్స్ ఉందని మంత్రి తెలిపారు. కోవిడ్ పరిస్థితుల్లో నిరుపేదలు ఈ ఖాతాల ద్వారానే ప్రభుత్వం నుంచి నిధులు పొందగలిగారని వివరించారు.
‘ఉగ్ర’ ముప్పును కూడా పరిగణనలోకి తీసుకున్నాకే పెట్టుబడులు..
పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంతర్జాతీయంగా ఉగ్రవాద ముప్పు ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వ్యాపారవర్గాలకు నిర్మలా సీతారామన్ సూచించారు. ఉగ్రవాదం ప్రస్తుతం యావత్ ప్రపంచంపైనా ప్రభావం చూపుతోందని, ఏ ఒక్క ప్రాంతమూ మినహాయింపుగా లేదని ఆమె పేర్కొన్నారు. వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భారీ స్థాయి రిస్కులు నెలకొన్నప్పుడు పెట్టుబడుల విషయంలో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment