తుపాను సహాయ చర్యల కోసం శ్రీకాకుళం చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఫొని తుపాను రేపు (3న) ఒడిశాలోని గోపాల్‌పూర్, చాంద్‌బలీల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో తీవ్ర ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ఫొని తుఫానుపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి తదితర కోస్తా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నేడు, రేపు తీర ప్రాంతం వెంట గంటకు 90 నుంచి 120 కి.మీల వేగంతో బలమైన గాలులు వీయడంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు.
పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్ అధికారులు
సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను పంపుతున్నామని, అలాగే ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి వనరులకు, విద్యుత్‌కు అంతరాయం కలిగితే సకాలంలో నీరందించేందుకు వీలుగా ట్యాంకర్లను, జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. పునరావాస కేంద్రాల్లో కావాల్సిన సౌకర్యాలను కల్పించాలన్నారు. కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందించేందుకు కృషి చేయాలన్నారు. నిత్యావసర సరుకులను, మందులను, మంచినీటి ప్యాకెట్లను, కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఫోన్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ విద్యుత్‌కు అంతరాయం కలిగితే తక్షణం పునరుద్ధరించడానికి వీలుగా ప్రతి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో 500 విద్యుత్ స్తంభాలు, రెండు జేసీబీలు, ఇతర మెటీరియల్ అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల్లవన్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి డి.వరప్రసాద్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఆర్టీజీఎస్ సీఈవో బాబు సహాయక చర్యలను వివరించారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా
ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీ నుంచి మూడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. 3వ తేదీ సాయంత్రం 5గం.ల 35 నిమిషాల సమయంలో ఒడిశాలోని గోపాల్‌పూర్, చాంద్‌బలీ ప్రాంతాల మధ్య తుపాన్ తీరాన్ని దాటొచ్చన్నారు. దీని ప్రభావం ఒడిశా తీరంపై అధికంగా ఉంటుందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. ఈ ప్రాంతాల్లో కచ్చా గృహాల్లో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన పునరావాసం కల్పించాలని సీఎస్‌ను ఆదేశించారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం
కావాలన్నా అందిస్తామన్నారు.
తుపాన్ ఎఫెక్ట్... పవర్ సెక్టార్ అలర్ట్
‘ఫొని’ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అప్రమత్తమయింది. తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రలో, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువ చూపనుంది. దీంతో గతంలో హుద్‌హుద్, తిత్లీ తుపాన్లు సృష్టించిన పెనుబీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని ఈపీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస, టెక్కలి, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి, వజ్రపుకొత్తూరు, కంచిలి, సంతబొమ్మాళి, పోలాకి, గార, నందిగామ మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ వల్ల తలెత్తే పరిణామాలను ఎదుర్కోడానికి ఐదు వేల మంది కార్మికులను శ్రీకాకుళం జిల్లాకు తరలించారు. అలాగే తుపానుకు విద్యుత్ స్తంభాలు కూలిపోయిన పక్షంలో వాటి స్థానంలో అమర్చడానికి 12 వేల స్తంభాలను ఆ జిల్లాకు పంపారు. వాటిని పాతడానికి అవసరమైన 30 పోల్ డ్రిల్లింగ్ మిషన్లు, 70 పవర్ రంపాలు, క్రేన్లను సిద్ధం చేశారు. తగినన్ని ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు (విద్యుత్ తీగలు), ఇన్సులేటర్లను అందుబాటులో ఉంచారు. ఈపీడీసీఎల్ పరిధిలోని ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల సిబ్బందిని శ్రీకాకుళం జిల్లాకు పంపారు. నాలుగు మండలాలకు ఒక చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)ను, మూడు సబ్ స్టేషన్లకు ఒక జనరల్ మేనేజర్, ఒక్కో సబ్‌స్టేషన్‌కు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఫీడర్‌కు ఒక ఏఈఈ చొప్పున ఇన్‌చార్జులను నియమించినట్టు ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ బొడ్డు శేషుకుమార్ చెప్పారు. ఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపనయ్య బుధవారం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. తుఫాన్ తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు ఆయన అక్కడే ఉండి అవసరమైన సహాయ, పునరావాస పనులను సమీక్షిస్తారు. సమాచారం కోసం శ్రీకాకుళం (94906 12633), విశాఖపట్నం (0891–2853854)కంట్రోల్ రూంలలో సంప్రదించాలని ఆపరేషన్స్ డైరెక్టర్ శేషుకుమార్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment