సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంసలో చెక్కుల మాటున సాగుతున్న గోల్‌మాల్ మరోసారి తెరపైకొచ్చింది. కొద్ది రోజుల కిందట శ్రీకాకుళం సర్కిల్లో చెక్కులు చెల్లించిన హెచ్‌టీ వినియోగదారులపై సర్‌చార్జి వేసి, వసూలైన సొమ్మును పక్కదారి పట్టించిన వైనం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. అలానే విశాఖ సర్కిల్ పరిధిలో జరిగిన అవకతవకలపై సర్కిల్ రెవెన్యూ అధికారులు తాజాగా అవినీతి నిరోధక శాఖకు, ట్రాన్స్‌కో విజిలెన్స్‌కు 62 పేజీల సమగ్ర నివేదికను అందజేశారు.
13 మందిపై ఆరోపణలు
విశాఖపట్నంలోని ఓ భారీ పరిశ్రమ ప్రతినెలా విశాఖ సర్కిల్ కార్యాలయానికి అందజేసిన తమ విద్యుత్ బిల్లులకు సంబంధించిన చెక్కులు 2017, 2018 సంవత్సరాల్లో సకాలంలో నగదుగా మారలేదు. గడువు తేదీ ముగిశాక ఒక రోజు నుంచి ఐదు రోజులకు జమ అయ్యేవి. నిజానికి నిర్ణీత గడువు పూర్తయ్యాక చెల్లించే బిల్లులపై లేట్ పేమెంట్(ఎల్‌పీ) చార్జి వసూలు చేయాలి. కానీ అలా జరగకుండా నగదు వచ్చినట్టుగానే అప్పట్లో విశాఖ సర్కిల్ అధికారులు రికార్డుల్లో నమోదు చేసేశారు. దీంతో డిస్కంకు రావాల్సిన ఎల్‌పీ ఆదాయం పోయింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ఫిర్యాదు అందడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు, ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను విశాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీవో) ప్రసన్నకుమార్‌కు విశాఖ సర్కిల్ అధికారులు తాజాగా అందించారు. దాదాపు రూ.15 లక్షలు ఎల్‌పీ నష్టం జరిగినట్టు ఆ నివేదికలో స్పష్టం చేశారు.
ఆ రెండేళ్ల కాలంలో పనిచేసిన సీనియర్, జూనియర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లతో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను బాధ్యులుగా తేల్చారు. కేసు విచారణను వారంలోగా పూర్తి చేస్తామని చీఫ్ విజిలెన్స్ అధికారి ఏవీఎల్ ప్రసన్నకుమార్ చెప్పారు. కాగా, ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని కొంత మంది కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారులు లబ్ధి పొందాలని చూస్తున్నట్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి చెప్పాడు. ఓ కంపెనీకి కొన్ని వెసులుబాట్లు కల్పించిన మాట వాస్తవమని తెలిపారు. కానీ అవి కేవలం కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేసినట్టు తెలిపాడు.
శ్రీకాకుళం వ్యవహారంలో త్వరలో చర్యలు
ఇదిలా ఉండగా, శ్రీకాకుళం రెవెన్యూ కార్యాలయం(ఈఆర్‌వో)లో హెచ్‌టీ వినియోగదారుల నుంచి చెక్కులు తీసుకుని సకాలంలో బ్యాంకులో డిపాజిట్ చేయలేదు. ఫలితంగా వారిపై ఎల్‌పీ పడింది. కొంత మంది గొడవెందుకని ఆ మొత్తాన్ని చెల్లించేశారు. కానీ ఆ సొమ్ము సంస్థకు చేరలేదు. దీనిపై అక్కడి ఎస్‌ఈ మహేందర్‌తో పాటు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మరికొన్ని అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. బాధ్యులపై చర్యలకు డిస్కం సీఎండీకి సిఫారసు చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈఆర్‌వో అక్రమార్కులపై వేటు పడే అవకాశం ఉంది.
బాధ్యులపై కఠిన చర్యలు..
బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. విశాఖపట్నం సర్కిల్లో జరిగిన చెక్కుల వ్యవహారం గత సీఎండీల కాలంలోనిది. దానిపైనా పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. తప్పుచేసిన వారెవరినీ ఉపేక్షించేది లేదు.
– కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్
‘ఏపీఈపీడీసీఎల్’ ఆదాయానికి ‘చెక్’!
Published Thu, Dec 30 2021 5:30 AM | Last Updated on Thu, Dec 30 2021 2:25 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment