చంద్రబాబుకు చికిత్స అందించిన వైద్యురాలికి నజరానా
ఆమె భర్తకు రాజమహేంద్రవరం సర్కిల్ ఎస్‌ఈగా పోస్టింగ్
అంతకు ముందు కాపు సామాజిక వర్గ అధికారికి ఆ పదవి
సీఎంవో ఆదేశాలతో రాత్రికి రాత్రి ఆదేశాలను మార్చేసిన సీఎండీ
సాక్షి, అమరావతి : చేతికొచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని తాము చెప్పిన పని క చ్చితంగా చేసి తీరాల్సిందేని కూటమి నేతలు ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ.. ‘చినబాబు’ చెప్పారని రాత్రికి రాత్రే రాజమహేంద్రవరం ఎస్‌ఈ పోస్టుకు సంబంధించిన ఆదేశాలను మార్చేయడం విద్యుత్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది.
కాకినాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గొర్లె ప్రసాద్‌ను రాజమహేంద్రవరం ఎస్‌ఈగా పదోన్నతిపై నియమిస్తూ డిస్కం సీఎండీ ఐ.పృధ్వీతేజ్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం సీఎంఓలోని ఓ ఉన్నతాధికారి ద్వారా మంత్రి లోకేశ్‌కు తెలియడంతో వెంటనే ఆ ఆదేశాలు రద్దు చేసి, తాను చెప్పిన అధికారిని ఆ పోస్టులో నియమించాలని చెప్పారు. ఈ మేరకు ఆ ఉన్నతాధికారి ఏపీఈపీడీసీఎల్ సీఎండీని ఫోన్‌లో దీనిపై హెచ్చరించారు.
సీఎంఓ ఆగ్రహాం వ్యక్తం చేయడంతో ప్రసాద్‌ను కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్(ఆపరేషన్స్)గా పంపి, ఆ స్థానంలో ఉన్న కె.తిలక్ కుమార్‌ను రాజమహేంద్రవరం ఎస్‌ఈగా నియమిస్తూ అర్ధరాత్రి 11.30 గంటల తర్వాత ఆదేశాలు ఇచ్చారు. ఈ సంఘటన విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇందుకు కారణం ఏమంటే..
ఎన్నికల ముందు అవినీతి కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యురాలిగా తిలక్ భార్య ఆయనకు చికిత్స అందించారని తెలిసింది. బాబు సూచనల మేరకు వైద్యం అందించినందుకే ఆమెకు నజరానాగా ఆమె భర్తకు ఎస్‌ఈ పోస్టును కట్టబెట్టారని సమాచారం.
కాగా, ఇంధన శాఖలో ఇప్పటికే జేఎండీలు, ఎండీలు, డైరెక్టర్లు అంటూ పది మందికి పైగా ఉన్నతాధికారుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. వారి స్థానంలో తమ వారిని నియమించేందుకు రూ.కోట్లల్లో బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఈ పోస్టుకు రూ.50 లక్షల వరకు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టుకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment