వడి వడిగా.. నుడా | Nellore Urban Development Company as Velocity | Sakshi
Sakshi News home page

వడి వడిగా.. నుడా

Published Sat, Mar 25 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

Nellore Urban Development Company as Velocity

సాక్షి ప్రతినిధి–నెల్లూరు: నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) ఏర్పాటులో శుక్రవారం మరో అడుగు ముందుకు పడింది. తడ నుంచి కావలి దాకా ఉన్న జిల్లాలోని 21 మండలాలు, మున్సిపాలిటీలు.. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల్లోని 13 గ్రామాలతో నుడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో నెల్లూరులో అధికారిక కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం శుక్రవారం జీఓ నంబర్‌ 108 జారీ చేసింది.

2014 నవంబర్‌లో కార్పొరేషన్‌ కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి చక్రధర్‌బాబు, టౌన్‌ప్లానింగ్‌ అధికారి శ్రీనివాసులు నుడా ప్రతిపాదనలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. జిల్లాలోని 33 మండలాలతో కూడిన నుడా ప్రతిపాదనను ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రతిపాదనలు అందిన రెండేళ్ళ తరువాత  ఇటీవల నుడా ఆమోదానికి అడుగులు పడ్డాయి. మొదట 33 మండలాలతో కూడిన ప్రతిపాదనను, రెండవసారి 14 మండలాలతో కూడిన ప్రతిపాదనలు పంపారు. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 21 మండలాలు.. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, వరదయ్య పాలెం మండలాల్లోని 13 గ్రామాలను కలుపుతూ రాష్ట్ర మంత్రి వర్గం ఆర్నెల్ల కిందట నుడా ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 
       
నుడాలో కలిపిన ప్రాంతాలు ఇవే..
నెల్లూరు కార్పొరేషన్, నెల్లూరు రూరల్, గూడూరు, కావలి, సూళ్ళూరుపేట, నాయుడుపేట, జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు, కొడవలూరు, కోవూరు, టీపీ గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మలుబోలు, చిల్లకూరు, ఓజిలి,  దొరవారిసత్రం, తడ మండలాలు నుడాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లోని 13 గ్రామాలను నుడాలో చేర్చారు. తడ నుంచి కావలి దాకా హైవేకి ఇరు వైపులా ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలతో పాటు శ్రీసిటీ 7వేల ఎకరాలను మొత్తం నుడాలో కలిపారు. నుడా పరిధిలో  13లక్షల జనాభా, 1600 చదరపు కి.మీ. భూ విస్తీర్ణం ఉంది.

నుడా ద్వారానే అనుమతులు
ఇప్పటి వరకు భారీ పరిశ్రమలు, భవనాల నిర్మాణాలకు  అనుమతుల కోసం అమరావతికి వెళ్ళాల్సి వచ్చేది.  నుడా ఏర్పాటుతో పరిశ్రమలు, భారీ భవనాలకు అనుమతులు నుడా ద్వారానే ఇచ్చే అవకాశం ఉంది. దీంతో నుడాకు భారీ ఆదాయం సమకూరుతుంది. నుడా ఆదాయాన్ని రోడ్లు, పార్క్‌లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంది.

త్వరలో కార్యాలయం ఏర్పాటు
నెల్లూరు కేంద్రంగా త్వరలో నుడా కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. నుడా కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారిని నియమించనున్నారు. దీంతో పాటు ఈ కార్యాలయ నిర్వహణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement