
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాలో మరో రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. గత కొన్నేళ్లుగా వీటికి అడ్డంకిగా ఉన్న జీవోను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఇది సాధ్యపడింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రికల్ బస్ యూనిట్‌తో పాటు ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కు నిర్మాణాలు ప్రారంభం అయ్యేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
► అనంతపురం జిల్లాలో కియా మోటర్స్ పరిశ్రమ ఏర్పాటు సమయంలో ఇచ్చిన జీవోతో ఆ ప్రాంతంలో మిగిలిన పరిశ్రమలకు ఆటంకంగా మారింది. కియా చుట్టుపక్కల 10 కి.మీ పరిధి వరకు ఎటువంటి కాలుష్య కారకమైన పరిశ్రమలు ఏర్పాటు చేయకూడదంటూ 2017లో జీవో నెంబర్ 151 ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు. దీని ఫలితంగా అప్పటికే ఒప్పందం కుదిరినప్పటికీ ఈ రెండు పరిశ్రమల ఏర్పాటు ఆగిపోయింది.
► ఈ నేపథ్యంలో అడ్డంకిగా ఉన్న ఆ జీవో నుంచి ఈ పరిశ్రమలకు మినహాయింపు ఇస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులిచ్చారు. దీంతో కియా కంటే ముందే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నందున ఈ 2 పరిశ్రమలకు ఈ జీవో నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
► తాజా ఉత్తర్వులతో వీర్‌వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో 120 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి అడ్డంకులు తొలిగాయి.
► అలాగే ఏపీఐఐసీ భాగస్వామ్యంతో 246.06 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్‌కు కూడా అడ్డంకులు తొలిగాయి.
Comments
Please login to add a commentAdd a comment