న్యూఢిల్లీ: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పన్ను మినహాయింపులు కోరుతున్న అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లాకు కేంద్రం కీలక సూచన చేసింది. ముందుగా భారత్‌లో తయారీ మొదలుపెట్టాలని, ఆ తర్వాత మినహాయింపుల గురించి పరిశీలించవచ్చని టెస్లాకు భారీ పరిశ్రమల శాఖ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఏ ఆటోమొబైల్ సంస్థకూ సుంకాలపరమైన మినహాయింపులు ఇవ్వడం లేదని, ఇప్పుడు టెస్లాకు గానీ ఇచ్చిన పక్షంలో భారత్‌లో బిలియన్ల డాలర్ల కొద్దీ ఇన్వెస్ట్ చేసిన ఇతర కంపెనీలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుందని కేంద్రం భావిస్తున్నట్లు వివరించాయి.
ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరుతోంది. ప్రస్తుతం పూర్తిగా తయారై దిగుమతయ్యే వాహనాలపై (సీబీయూ) కస్టమ్స్ సుంకాలు 60 శాతం నుంచి 100 శాతం దాకా ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను (వాహన ధర) ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 40,000 డాలర్ల పైగా ఖరీదు చేసే వాహనాలపై 110 శాతం దిగుమతి సుంకాలను విధించడమనేది .. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తింపచేయొద్దంటూ కేంద్రాన్ని టెస్లా కోరుతోంది. కస్టమ్స్ విలువతో సంబంధం లేకుండా టారిఫ్‌ను 40 శాతానికి పరిమితం చేయాలని, 10 శాతం సామాజిక సంక్షేమ సుంకం నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment