ధర్నాలో నినాదాలు చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మధ్యాహ్నభోజన పథకం నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపారాణి డిమాండ్ చేశారు. మధ్యాహ్నభోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో గురువారం ఆందోళన చేశారు. స్వరూపారాణి మాట్లాడుతూ పథకం కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
2003 నుంచి పనిచేస్తున్న కార్మికులను కాదని, నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రైవేటు సంస్థలకు అప్పగించారన్నారు. పథకం నిర్వాహణకు అవసరమైన స్థలం, కిచెన్ షెడ్లు ఏర్పాటుకు కావాల్సిన నిధులను ప్రభుత్వమే సమకూరుస్తోందన్నారు. ఇది సరైన విధానం కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులపై రాజకీయ ఒత్తిళ్లను అరికట్టాలని కోరారు. ప్రైవేటు సంస్థలకు పథకాన్ని అప్పగించడం వల్ల 80 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, మద్యాహ్నభోజన పథకం కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మీ, ఉపాధ్యక్షురాలు ఎన్‌సీహెచ్ సుప్రజ, కార్యదర్శి డి.రమాదేవి, నాగరాణి, నాగమణి, వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment