ఇక ఈ–పాస్‌! | E-Pass System To Implement In Government Schools For Rice Supply | Sakshi
Sakshi News home page

ఇక ఈ–పాస్‌!

Published Tue, Jun 18 2019 12:20 PM | Last Updated on Tue, Jun 18 2019 12:22 PM

E-Pass System To Implement In Government Schools For Rice Supply - Sakshi

సాక్షి, వైరా(ఖమ్మం): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం సరఫరా చేసే సన్నబియ్యం పక్కదారి పట్టకుండా.. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో జనవరి 2015 నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం విదితమే. అప్పటి పరిస్థితులనుబట్టి విద్యార్థులకు దొడ్డు బియ్యం సరఫరా చేయడం వల్ల వారు సరిగా భోజనం చేయకపోవడం.. పాఠశాలల్లో వండిన వంటలు మిగిలిపోవడం వంటి వాటిని గుర్తించిన ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది.

పాఠశాలలతోపాటు ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల కోసం సన్నబియ్యం సరఫరా చేస్తుండడం.. ఆ బియ్యం పక్కదారి పట్టడంతోపాటు పలు అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ–పాస్‌ విధానాన్ని ప్రవేశపెట్టి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తోంది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ రేషన్‌ బియ్యం సరఫరాకు సంబంధించి ఈ–పాస్‌ విధానాన్ని అమలు చేస్తోంది.  

అక్రమాలకు అడ్డుకట్ట.. 
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఒకటి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థికి 100 గ్రాములు, 5 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థికి 150 గ్రాముల చొప్పున బియ్యం వండి.. భోజనం వడ్డిస్తున్నారు. అలాగే వసతి గృహాల్లో ఉంటూ.. 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు 500 గ్రాములు, 6–10వ తరగతి వారికి 600 గ్రాముల భోజనాన్ని అందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పాఠశాలకు విద్యార్థులు హాజరుకాకున్నా వచ్చినట్లుగా లెక్కలు చూపించి.. బియ్యం స్వాహా చేస్తున్నట్లు అక్కడక్కడా ఆరోపణలు వచ్చాయి.

కొన్ని పాఠశాలల్లో కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడం లేదు. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న భోజనం తినడమో.. ఇంటికి వెళ్లి రావడమో చేస్తున్నారు. అయితే అలాంటి విద్యార్థులు కూడా పాఠశాలల్లోనే భోజనం చేస్తున్నట్లుగా తప్పుడు లెక్కలు చూపించి బియ్యం కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులు ఇళ్లకు వెళ్లినా.. హాస్టల్‌లోనే ఉన్నట్లుగా లెక్కలు సృష్టించి సంబంధిత హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు సన్న బియ్యాన్ని మాయం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ–పాస్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.  

ప్రస్తుత విధానం.. 
ప్రస్తుతం ఆయా మండలాల్లో గల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అనుగుణంగా ఎంఈఓలు.. తహసీల్దార్లకు లెక్కలు అందిస్తున్నారు. వారు ఇండెంట్‌ పెడితే దానికి అనుగుణంగా సంబంధిత రేషన్‌ దుకాణానికి సన్నబియ్యం వస్తున్నాయి. అక్కడి నుంచి సంబంధిత పాఠశాలలకు బియ్యం తీసుకెళ్తున్నారు.  

వేలిముద్రలతో బియ్యం సరఫరా.. 
అయితే పాఠశాలలకు సరఫరా అయ్యే బియ్యంకు సంబంధించి రేషన్‌ దుకాణాల నుంచి కాకుండా నేరుగా సరఫరా చేయాలని భావిస్తున్నారు. పాఠశాలకు సంబంధించి బియ్యాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తి వేలిముద్ర తీసుకొని పంపిణీ చేయనున్నారు. అలాగే హాస్టళ్లకు సంబంధించి వేలిముద్రల ఆధారంగా బియ్యం ఇస్తారు. తద్వారా బియ్యం పక్కదారి పట్టదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో నేరుగా పాఠశాల, హాస్టళ్లకు ఎన్ని బియ్యం తీసుకెళ్తున్నారనేది వెంటనే తేలిపోతుంది. 

అక్కడ విద్యార్థులకు భోజనం వండి పెట్టగా.. ప్రతి నెలా మిగిలిన బియ్యం బయటకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉండదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ–పాస్‌ విధానం అమలు చేయడం ద్వారా సన్నబియ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట పడడంతోపాటు పిల్లలకు సక్రమంగా భోజనం అందే అవకాశం ఉంటుంది.

త్వరలోనే 'ఈ' విధానం అమలు
ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలో ఈ–పాస్‌ విధానం ద్వారా బియ్యాన్ని పాఠశాలలకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  త్వరలోనే అందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థులకు 100 శాతం న్యాయం జరుగుతుంది. ఎక్కడా అక్రమాలకు అవకాశమే ఉండదు. విద్యార్థుల ఆధార్‌ కార్డుల సేకరణ కూడా చేపడుతున్నాం. ఈ కార్యక్రమం పూర్తయితే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ–పాస్‌ విధానం ద్వారా సన్న బియ్యం సరఫరా అవుతుంది.  
– కె.వెంకటేశ్వర్లు, వైరా, ఎంఈఓ 

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వివరాలిలా.. 

జెడ్పీఎస్‌ఎస్‌ ప్రాథమికోన్నత ప్రాథమిక పాఠశాలలు
211 192 810 

వసతి గృహాల వివరాలిలా..

ఎస్సీ  ఎస్టీ

బీసీ

ఆశ్రమాలు
50 19 33 11

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement