జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భువనగిరి కేజీబీవీ విద్యార్థినులు(ఫైల్)
సాక్షి, యాదాద్రి : ఏం పెట్టినా తినాల్సిందే.. ఏదైనా జరిగినా బయటకు పొక్కొదు.. ఎవరైనా ఎదురు మాట్లాడితే బెదిరింపులు.. టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తామంటూ వేధింపులు.. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల దుస్థితి దారుణంగా ఉంది. జిల్లాలోని కస్తూర్బా, మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ, గరుకుల పాఠశాలల వసతి గృహాలు రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయి. ఆధ్వానమైన భోజనం, శుభ్రత లేని నీటితోనే వంటలు, నాణ్యతలేని కూరగాయలు, నీళ్ల చారు, మరుగుడొడ్లు పూర్తిస్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలో పలు పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా భువనగిరి పట్టణ శివారులో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడే తప్ప అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడరు. పర్యవేక్షణ లేకపోవడంతో షరా మామూలవుతోంది. ఆయా పాఠశాలల అధికారుల నుంచి పెద్ద ఎత్తున ముడుతున్న ముడుపులే పర్యవేక్షణ అధికారుల ఉదాసీనతకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, బొమ్మలరామారం, మోటకొండూరు, తుర్కపల్లి,భువనగిరి మండలాల్లోని మోడల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో సంఘటనలు వెలుగుచూశాయి. మరికొన్ని చోట్ల వెలుగుచూడని సంఘటలు ఉన్నాయి.
జిల్లాలో పాఠశాలలు..
జిల్లాలో కేజీబీవీ, మోడల్, ఆర్‌ఈఐఎస్, టీఆర్‌డబ్ల్యూఆర్‌ఎస్, టీఆర్‌టీడబ్ల్యూఆర్‌ఎస్ టీడబ్ల్యూ, మైనార్టీ రెసిడెన్షియల్,ఎంజేపీ రెసిడెన్షియల్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు మొత్తం 35 పని చేస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో 14,214 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 5,114 మంది బాలురు, 9,100 మంది బాలికలు చదువుకుంటున్నారు. చదువుకోసం వచ్చిన విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. కానీ, ఎక్కడా మెనూ అమలు కావడం లేదు. విద్యార్థులు ఇబ్బందులను బయటకు చెప్పుకోలేకపోతున్నారు.
ఏదైనా జరిగినప్పుడే..
రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో సంఘటనలు జరిగినపుడే అధికారులు చర్యలు చేపడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మొక్కుబడి తనిఖీలు ఫలితాలను ఇవ్వడంలేదు. ఆయా సంస్థల్లో బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఉపా«ధ్యాయులు, వంట మనుషుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిటి శాపంగా మారుతోంది. మంచినీటి కొరత, మరుగుదొడ్లు, మూత్ర శాలలలేక అవస్థలు తీరడం లేదు.
మెనూ అమలెక్కడ?
విద్యార్థులకు అందాల్సిన మెనూ మెజార్టీ వసతి గృహాల్లో అమలు కావడం లేదు. లక్కపురుగుల బియ్యం, పుచ్చుపట్టిన కూరగాయలు, చాలీచాలనీ నూనె, నీళ్ల పాలు, నీళ్ల చారు, ఉడికీఉడకని అన్నం, రెండు మూడు రోజులకోసారి కోడిగుడ్డు, పండ్లు, అరకొరగా చికెన్ కర్రీ, దేవుని ప్రసాదంలా స్నాక్స్ ఇలా చెప్పుకుంటే పోతే అన్నీ ఇబ్బందులే. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆరోపణలు ఇలా..
వసతి గృహాలకు సరఫరా అవుతున్న సన్న బియ్యం సివిల్ సప్‌లై గోదాంలోనే గోల్‌మాల్ జరుగుతుంది. గోదాం ఇంచార్జ్, బియ్యం రవాణా చేసే కాంట్రాక్టర్‌తో ఆయా సంస్థల ఇంచార్జ్‌లు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అక్రమాలు జరగుతున్నాయి. విద్యార్థుల హాజరు, సంఖ్యలో ఉన్న తేడాతోపాటు వారికి ఇచ్చే భోజనం తక్కువగా ఉంటుంది.
నాసిరకం భోజనం
ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ నాణ్యమైన కర్రీలు విద్యార్థులకు అందడం లేదు. దీంతో ప్రతి రోజూ కిలోల కొద్ది భోజనం విద్యార్థులు తినకుండా పారవేస్తున్నారు. పారవేసిన అన్నాన్ని సైతం బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. వారానికి ఒక్కసారి కూరగాయలు తెచ్చి వండి పెడుతున్నారు.తక్కువ ధరకు దొరికే నాసిరకం గ్రేడ్ త్రీ రకం కూరగాయలు తెచ్చి వండిపెట్టడం వల్ల అవి రుచికరంగా లేక విద్యార్థులు తినడం లేదు. బలవంతంగా తిని కొన్నిసార్లు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. సరిపడా పాలు సరఫరా అవుతున్నా విద్యార్థులకు మాత్రం సరిగా అందడంలేదు. మూడు రోజుల కోసారి కోడిగుడ్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంచినూనె, కారం, పాలు, మసాల దినుసులు,పొపు దినుసులు నాసిరకంతోపాటు కోత విధిస్తున్నారు.
జిల్లాలో వెలుగుచూసిన ఘటనలు కొన్ని
ఫిబ్రవరి 13న భువనగిరి కేజీబీవీలో 50 మంది విద్యార్థులు, ఒక టీచర్ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కేవలం 10మందినే ఆస్పత్రిలో చేర్చారు. మిగతా విద్యార్థులకు పాఠశాలలోనే చికిత్స అందించారు. 2018 మార్చి 31న మోటకొండూరు పాఠశాలలో కలుషిత ఆహారం తిని 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. 2019 ఆగస్టు20న చీకటి మామిడి మహాత్మాజ్యోతీరావ్‌పూలే వసతి గృహంలో 15 మంది, 2020 మార్చి 20న తుర్కపల్లి మండలం రాంపూర్‌తండా మోడల్ స్కూల్‌లో 20మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇంకా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా వెలుగు చూడనీయకుండా జాగ్రత్త పడుతున్నారు.
నాణ్యమైన భోజనం అందిస్తున్నాం
విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇస్తున్నాం. భువనగిరి కేజీబీవిలో నాసిరకం భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయంలో ప్రాథమిక విచారణ జరిపి హెడ్‌కుక్‌ను సస్పెండ్ చేశాం. ఇన్‌చార్జ్ అధికారికి మెమో ఇచ్చాం. పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాం. గతంలో జరిగిన సంఘటనలపై విచారణ జరిపించి చర్యలు తీసుకున్నాం. వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం.–అండాల్, జీసీడీఓ
Comments
Please login to add a commentAdd a comment