సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృత్యువాతపడగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు ఉదయం 10 గంటలకు బయలుదేరింది.
కాగా జిల్లాలోని అడ్డగూడూర్ మండలం బొడ్డుగూడెం వద్దకు రాగానే అతి వేగం కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి పల్టీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే ఇద్దరు మరణించారు. మృతులను అడ్డ గూడూరు మండలం చిన్నపడిశాలకు చెందిన చుక్క యాకమ్మ అనే మహిళ, బీబీనగర్‌కు చెందిన కొండా రాములుగా గుర్తించారు. కొండ రాములు అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు తేలింది.
మరో 10 మందికి పైగా గాయపడ్డారు. మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: రితీ సాహా మృతిపై వైద్యుల కమిటీ విచారణ
Comments
Please login to add a commentAdd a comment