residencial school
-
చెప్పిందే మెనూ.. పెట్టిందే తిను..!
సాక్షి, యాదాద్రి : ఏం పెట్టినా తినాల్సిందే.. ఏదైనా జరిగినా బయటకు పొక్కొదు.. ఎవరైనా ఎదురు మాట్లాడితే బెదిరింపులు.. టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తామంటూ వేధింపులు.. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల దుస్థితి దారుణంగా ఉంది. జిల్లాలోని కస్తూర్బా, మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ, గరుకుల పాఠశాలల వసతి గృహాలు రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయి. ఆధ్వానమైన భోజనం, శుభ్రత లేని నీటితోనే వంటలు, నాణ్యతలేని కూరగాయలు, నీళ్ల చారు, మరుగుడొడ్లు పూర్తిస్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలో పలు పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా భువనగిరి పట్టణ శివారులో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడే తప్ప అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడరు. పర్యవేక్షణ లేకపోవడంతో షరా మామూలవుతోంది. ఆయా పాఠశాలల అధికారుల నుంచి పెద్ద ఎత్తున ముడుతున్న ముడుపులే పర్యవేక్షణ అధికారుల ఉదాసీనతకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, బొమ్మలరామారం, మోటకొండూరు, తుర్కపల్లి,భువనగిరి మండలాల్లోని మోడల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో సంఘటనలు వెలుగుచూశాయి. మరికొన్ని చోట్ల వెలుగుచూడని సంఘటలు ఉన్నాయి. జిల్లాలో పాఠశాలలు.. జిల్లాలో కేజీబీవీ, మోడల్, ఆర్ఈఐఎస్, టీఆర్డబ్ల్యూఆర్ఎస్, టీఆర్టీడబ్ల్యూఆర్ఎస్ టీడబ్ల్యూ, మైనార్టీ రెసిడెన్షియల్,ఎంజేపీ రెసిడెన్షియల్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు మొత్తం 35 పని చేస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో 14,214 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 5,114 మంది బాలురు, 9,100 మంది బాలికలు చదువుకుంటున్నారు. చదువుకోసం వచ్చిన విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. కానీ, ఎక్కడా మెనూ అమలు కావడం లేదు. విద్యార్థులు ఇబ్బందులను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఏదైనా జరిగినప్పుడే.. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో సంఘటనలు జరిగినపుడే అధికారులు చర్యలు చేపడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మొక్కుబడి తనిఖీలు ఫలితాలను ఇవ్వడంలేదు. ఆయా సంస్థల్లో బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఉపా«ధ్యాయులు, వంట మనుషుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిటి శాపంగా మారుతోంది. మంచినీటి కొరత, మరుగుదొడ్లు, మూత్ర శాలలలేక అవస్థలు తీరడం లేదు. మెనూ అమలెక్కడ? విద్యార్థులకు అందాల్సిన మెనూ మెజార్టీ వసతి గృహాల్లో అమలు కావడం లేదు. లక్కపురుగుల బియ్యం, పుచ్చుపట్టిన కూరగాయలు, చాలీచాలనీ నూనె, నీళ్ల పాలు, నీళ్ల చారు, ఉడికీఉడకని అన్నం, రెండు మూడు రోజులకోసారి కోడిగుడ్డు, పండ్లు, అరకొరగా చికెన్ కర్రీ, దేవుని ప్రసాదంలా స్నాక్స్ ఇలా చెప్పుకుంటే పోతే అన్నీ ఇబ్బందులే. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఇలా.. వసతి గృహాలకు సరఫరా అవుతున్న సన్న బియ్యం సివిల్ సప్లై గోదాంలోనే గోల్మాల్ జరుగుతుంది. గోదాం ఇంచార్జ్, బియ్యం రవాణా చేసే కాంట్రాక్టర్‌తో ఆయా సంస్థల ఇంచార్జ్‌లు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అక్రమాలు జరగుతున్నాయి. విద్యార్థుల హాజరు, సంఖ్యలో ఉన్న తేడాతోపాటు వారికి ఇచ్చే భోజనం తక్కువగా ఉంటుంది. నాసిరకం భోజనం ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ నాణ్యమైన కర్రీలు విద్యార్థులకు అందడం లేదు. దీంతో ప్రతి రోజూ కిలోల కొద్ది భోజనం విద్యార్థులు తినకుండా పారవేస్తున్నారు. పారవేసిన అన్నాన్ని సైతం బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. వారానికి ఒక్కసారి కూరగాయలు తెచ్చి వండి పెడుతున్నారు.తక్కువ ధరకు దొరికే నాసిరకం గ్రేడ్ త్రీ రకం కూరగాయలు తెచ్చి వండిపెట్టడం వల్ల అవి రుచికరంగా లేక విద్యార్థులు తినడం లేదు. బలవంతంగా తిని కొన్నిసార్లు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. సరిపడా పాలు సరఫరా అవుతున్నా విద్యార్థులకు మాత్రం సరిగా అందడంలేదు. మూడు రోజుల కోసారి కోడిగుడ్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంచినూనె, కారం, పాలు, మసాల దినుసులు,పొపు దినుసులు నాసిరకంతోపాటు కోత విధిస్తున్నారు. జిల్లాలో వెలుగుచూసిన ఘటనలు కొన్ని ఫిబ్రవరి 13న భువనగిరి కేజీబీవీలో 50 మంది విద్యార్థులు, ఒక టీచర్ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కేవలం 10మందినే ఆస్పత్రిలో చేర్చారు. మిగతా విద్యార్థులకు పాఠశాలలోనే చికిత్స అందించారు. 2018 మార్చి 31న మోటకొండూరు పాఠశాలలో కలుషిత ఆహారం తిని 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. 2019 ఆగస్టు20న చీకటి మామిడి మహాత్మాజ్యోతీరావ్పూలే వసతి గృహంలో 15 మంది, 2020 మార్చి 20న తుర్కపల్లి మండలం రాంపూర్‌తండా మోడల్ స్కూల్లో 20మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇంకా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా వెలుగు చూడనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇస్తున్నాం. భువనగిరి కేజీబీవిలో నాసిరకం భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయంలో ప్రాథమిక విచారణ జరిపి హెడ్కుక్ను సస్పెండ్ చేశాం. ఇన్చార్జ్ అధికారికి మెమో ఇచ్చాం. పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాం. గతంలో జరిగిన సంఘటనలపై విచారణ జరిపించి చర్యలు తీసుకున్నాం. వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం.–అండాల్, జీసీడీఓ -
వసతి లోగిళ్లకు కొత్త సొబగులు
సాక్షి, శ్రీకాకుళం : సంక్షేమ వసతి గృహాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. భారంగా మారాయని దశల వారీగా మూసివేసింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారన్న కారణంతో పాఠశాలలను మూసివేసినట్టే వసతి గృహాలను ఎత్తి వేసింది. ఆ హాస్టళ్ల విద్యార్థినీ విద్యార్థులను పక్కనున్న వసతి గృహాలకు తరలించింది. ఈ క్రమంలో వేలాది మంది విద్యార్థులు డ్రాపౌట్ అయిపోయారు. అయితే విద్య, సంక్షేమాన్ని లాభాపేక్ష ధోరణితో చూడకుండా అందరికీ చదువును అందించాలన్న ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. పిల్లల చదువుల కోసం ఖర్చుకు ఎంతైనా వెనకాడనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టి గాడిలో పెట్టేందుకు జిల్లాకు రూ.14 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటన కూడా చేశారు. ఆమేరకు దశల వారీగా నిధులు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ విద్యను నీరుగార్చిన చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చేసింది. కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ విద్యను నీరుగార్చేశారు. తనకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉన్న కార్పొరేట్ శక్తులకు తలొగ్గి ప్రభుత్వ పాఠశాలలను, సంక్షే మ వసతి గృహాలను ఉద్దేశపూర్వకంగా గాలికొదిలేశారు. నిర్లక్ష్యం బారిన పడి అవన్నీ సమస్య ల లోగిళ్లుగా తయారైపోయా యి. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే పాఠశాలలు, వసతి గృహాలు ఆర్థికంగా భారమయ్యాయని ఏకంగా మూసివేశా రు. జిల్లాలో 35 పాఠశాలలను మూసివేయగా, 35 ఎస్సీ సంక్షే మ వసతి గృహాలను, 20 బీసీ సంక్షేమ వసతి గృహాలను ఎత్తివేశారు. దీని వల్ల వేలాది విద్యార్థులు పొరుగునున్న పాఠశాలల కు, వసతి గృహాలకు వెళ్లలేక మధ్యలోనే చదువు మానేశారు. ప్రస్తుతం పాఠశాల విద్యకు మహర్దశ నిర్వీర్యమైపోయిన విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో మూసివేసిన పాఠశాలలను తెరవాలని నిర్ణయించుకున్నారు. పిల్లల్ని చదివించే తల్లులకు ప్రోత్సాహంగా అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ బడులు, వసతి గృహాల ద్వారా నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఇప్పటికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అనే నినాదంతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా స్కూల్ ట్రాన్స్ఫార్మేషన్ మానిటరింగ్ సిస్టం (ఎస్టీఎంఎస్) సర్వే కూడా చేపడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక సౌకర్యాల స్థితిగతులపై నివేదికను సిద్ధం చేయిస్తున్నారు. తదనుగుణంగా పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దనున్నారు. దీనివల్ల జిల్లాలో 2500 ప్రాథమిక పాఠశాలలు, 661 ప్రాథమికోన్నత పాఠశాలలు, 694 ఉన్నత పాఠశాలల్లో మోక్షం కలగనుంది. వసతి గృహాల మెరుగుదలకు ప్రత్యేక నిధులు సమస్యలతో, మౌలిక సౌకర్యాల లేమితో అవస్థలకు గురవుతున్న వసతి గృహాలపై కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 40 సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల కోసం తొలి విడతగా రూ.52 లక్షలు మంజూరు చేశారు. అలాగే 71 బీసీ సంక్షేమ వసతి గృహాలకు రూ.45.21 లక్షలు విడుదల చేశారు. వీటితోపాటు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని 12 గురుకులాలకు రూ.2 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు కూడా వచ్చాయి. అలాగే, 32 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)కు రూ.2.5 కోట్ల మేర అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అవి కూడా రోజుల వ్యవధిలో విడుదల కానున్నాయి. నిధుల విడుదల ఉత్తర్వుల మేరకు సంక్షేమ శాఖలకు కేటాయించిన బడ్జెట్ ప్రకారం అంచనాలు రూపొందించి ఇవ్వాలని ఇంజినీరింగ్ శాఖాధికారులకు ఇప్పటికే కలెక్టర్ ఆదేశించారు. తొలుత మరుగుదొడ్ల మరమ్మతులు, రన్నింగ్ వాటర్, మరుగుదొడ్లకు తలుపులు, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం, విద్యుత్ సమస్యలు, తాగునీటి కోసం ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టంగా సూచించారు. ఇంజినీరింగ్ అధికారులు ఇప్పుడా పనిలో నిమగ్నమయ్యారు. దీంతో జిల్లాలో ఎన్నాళ్ల నుంచో మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్న పాఠశాలలు, వసతి గృహాలకు మోక్షం లభించినట్టు అయింది. -
గురుకుల పాఠశాలలో డీఎస్పీ విచారణ
- పోలీసుల అదుపులో నిందితుడు ఆళ్లగడ్డ: పడకండ్ల సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి..బుధవారం విచారణ చేపట్టారు. ఈ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థినికి ఐదు నెలల గర్భం రావడం.. ఈ వార్త సంచలనం కావడంతో డీఎస్పీ స్పందించారు. విద్యార్థిని ఎప్పుడెప్పుడు సెలవు పెట్టారు..ఆమె కోసం ఎవరెవరు వచ్చేవారు అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని..నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. డీఎస్పీ వెంట సీఐలు దస్తగిరిబాబు, ప్రభాకర్‌రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు? ఇదిలా ఉండగా.. విద్యార్థిని గర్భానికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పడకండ్ల గ్రామానికి చెందిన యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అహోబిలంలో జరిగిన ఓ వివాహ వేడుకలో వీరిద్దరి మధ్య మాటమాట కలిసి ప్రేమగా మారినట్లు..పెళ్లి చేసుకుంటానని నిందితుడు నమ్మించినట్లు సమాచారం. గర్భం పోయేలా మాత్రలు వేసుకోమని సలహా ఇచ్చినట్లు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చెప్పినట్లు తెలిసింది. అమ్మాయి, కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని కూడా చెప్పినట్లు సమాచారం. -
తేలు కాటుకు గురైన ‘ఆశ్రమ’ విద్యార్థి
కొత్తగూడ: తేలు కాటుకు గురై ఆశ్రమ పాఠశాల విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కామారం ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఈక రవికుమార్ రెండు రోజుల క్రితం సాయంత్రం భోజనం చేసి ఇంటికి వెళ్లే క్రమంలో తేలు కుట్టింది. పాఠశాల మొత్తంలో 37 మంది స్థానిక గ్రామ విద్యార్థులే చదువుతుండటంతో ఉదయం, సాయంత్రం భోజనం పెట్టిన తరువాత విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. కాగా ఇంటికి వెళ్లే సమయంలో తేలు కాటు వేయడంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారింది. ఉపాద్యాయులు వెంటనే హన్మకొండలోని అమృత ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈవిషయమై ఏటీడబ్ల్యూఓ మోహన్‌రావును వివరణ కోరగా తేలు కుట్టింది నిజమేనని చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ వార్డెన్‌కు ఐటీడీఏ డీడీ పోచం మెమో జారీ చేసినట్లు తెలిసింది.