మధ్యాహ్న భోజనం అధ్వానం | Midday Meals Scheme Delayed in Vizianagaram | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం అధ్వానం

Published Fri, Dec 28 2018 6:47 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

Midday Meals Scheme Delayed in Vizianagaram - Sakshi

భోజనం చేస్తున్న విద్యార్థులు అన్నంలో వచ్చిన ఈగ

విజయనగరం, బలిజిపేట: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అధ్వానంగా ఉంటోంది. దీంతో విద్యార్థులు భోజనం చేయలేక ఇళ్లకు పరుగులెడుతున్నారు. నాసిరకం బియ్యం వినియోగించడంతో విద్యార్థులు భోజనం చేయలేకపోతున్నారు. అలాగే నిర్వాహకులకు కూడా వండే సమయంలో ఇబ్బందులెదురవుతున్నాయి. బియ్యం నీటిలో పోసినవెంటనే ముక్కలైపోవడంత అన్నం బాగోడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రేషన్‌ బియ్యంపై పలురకాల విమర్శలు ఉన్నాయి.  గ్రామాలలో 90 శాతం వరకు వీటిని వినియోగించడం లేదన్న విషయం అటు ప్రభుత్వానికి.. ఇటు అధికారులకు తెలిసిందే. అటువంటప్పుడు పాఠశాలలకు ఇటువంటి బియ్యాన్ని ఎలా సరఫరా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అన్నం సంగతి ఇలా ఉంటే సాంబారు విషయానికి వస్తే దానిలో మొక్కుబడిగా నాలుగు కూరగాయల ముక్కలు వేసి నీరులాంటి సాంబారును విద్యార్థులకు సర్దుబాటు చేస్తున్నారు. ఇటీవల బలిజిపేటలో నిర్వహించిన గ్రామదర్శినికి జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, డీపీఓ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ సమయంలో ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బియ్యం నాసిరకంగా ఉండడంతో పాటు సాంబారు అంత బాగోలేదన్న విషయాలను గుర్తించారు. ఈ సందర్భంగా వారు నిర్వాహకులతో మాట్లాడుతూ, సాంబారు ఇలాగేనా తయారు చేసేదంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. భోజనాన్ని నాణ్యంగా తయారు చేయాలని సూచించారు.

తినేందుకు నిరాకరిస్తున్న విద్యార్థులు..
మధ్యాహ్న భోజన పథకం చేసేందుకు కొంతమంది విద్యార్థులు విముఖత కనబరుస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఇళ్ల నుంచే బాక్సులు తెచ్చుకుంటున్నారు. బాక్సులు తెచ్చుకోనివారు లంచ్‌ సమయంలో ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. ఉన్నవారిలో ఏ కొద్ది మంది భోజనం చేస్తున్నారు. అయితే బియ్యం నాసిరకం కావడంతో భోజనం చేస్తే కడుపునొప్పి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.

బియ్యం బాగోలేవు..                  
నా పేరు మేరీ. బలిజిపేట ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహక కమిటీ సభ్యురాలిని. బియ్యం బాగోలేకపోవడంతో అన్నం ముద్దలా అయిపోతోంది. మాకు ఇచ్చిన బస్తాకు 5 నుంచి ఆరు కిలోల వరకు తరుగు వస్తోంది.బియ్యాన్ని బాగుచేసి వండుతున్నా ముద్దలా అయిపోతోంది. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి.–  మేరీ, ఎండీఎం నిర్వాహకురాలు,బలిజిపేట ఉన్నత పాఠశాల.

సన్న బియ్యం ఇస్తామన్నారు..
పాఠశాలలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని గతంలో కలెక్టర్‌ చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. రేషన్‌ షాపుల నుంచి వస్తున్న బియ్యం దారుణంగా ఉంటున్నాయి. దీంతో అన్నం ముద్దలా మారిపోవడంతో విద్యార్థులకు తినేందుకు వెనకడుగు వేస్తున్నారు.–  రాజేశ్వరి, ప్రధానోపాధ్యాయురాలు, బలిజిపేట ఉన్నత పాఠశాల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement