చాగల్లు జెడ్పీ హైస్కూల్‌లో భోజనం సకాలంలో రాకపోవడంతో ఖాళీ కంచాలు చూపిస్తున్న చిన్నారులు
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ‘మధ్యాహ్నం 12.15 గంటలవుతోంది.. మరో 10 నిమి షాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలి. ఈ రోజు నుంచి ఢిల్లీకి చెందిన ఒక పెద్ద సంస్థ ఏక్తాశక్తికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అప్పగించిందట. ఆ సంస్థ చాలా బాగా చేస్తుందట. ఇక భోజనం వచ్చేస్తుంది.. పిల్లలకు వడ్డించడమే తరువాయి అనుకున్నారు ఉపాధ్యాయులు.’ అయితే ఆ తర్వాత పరిస్థితి మరోలా మారింది. 12.30గంటలయింది. భోజనం ఇంకా రాలేదు.. తొలిరోజు కదా కాస్త ఇబ్బంది ఎదురై ఉండి ఉంటుంది.. వచ్చేస్తుందిలే అని సర్ది చెప్పుకున్నారు మాస్టార్లు. ఒంటి గంట అయింది.. ఇంకా రాలేదు.. మాస్టారూ ఆకలేస్తోంది.. నీరసం వస్తోంది.. మాస్టారూ కళ్ళు తిరుగుతున్నాయి.. విద్యార్థులు ఒకరి తరువాత ఒకరు అడుగుతూనే ఉన్నారు. ఇదిగో వచ్చేస్తోంది, అదిగో వచ్చేస్తోంది, దారిలో ఉందట.. మరో 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. రాగానే పెట్టేస్తాం.. కాస్త ఓపిక పట్టండర్రా.. అంటూనే ఉన్నారు మాస్టార్లు.. ఒంటిగంటన్నర అయింది.. భోజనం రాలేదు.. రెండయింది అదే పరిస్థితి.. రెండున్నర.. మూడు అయింది ఇంకా దారిలోనే ఉందట వచ్చేస్తోంది అంటూ చెబుతూనే ఉన్నారు ఉపాధ్యాయులు.. మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని దుస్థితి ఇది..
కడుపుమాడ్చిన ప్రభుత్వం..
నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం విద్యార్థుల కడుపుమాడ్చింది. ఆకలిని బహుమతిగా ఇచ్చింది. ఏక్తాశక్తి అనే సంస్థకు మధ్యాహ్న భోజన పథకం అమలు కాంట్రాక్టు కట్టబెట్టి జనవరి 2 నుంచి అన్ని పాఠశాలలకూ అందచేయడానికి ఏర్పాట్లు చేసింది. అప్పటి వరకూ ఆయా పాఠశాలల్లో వంట ఏజెన్సీల ద్వారా అక్కడే వండి వేడివేడిగా పెట్టేవారు. ఏక్తాశక్తి ఫౌండేషన్‌కు అప్పగించడంతో ఆ సంస్థ జిల్లాలో ఐదు క్లస్టర్‌పాయింట్లను పెట్టుకుని వంటశాలలు నిర్మించుకుంది. అక్కడి నుంచే ఆయా క్లస్టర్ పరిధిలోని మండలాల్లో ఉన్న పాఠశాలలకు వంటలు పంపే ఏర్పాట్లు చేసుకుంది. అయితే భోజనం పంపే విషయంలో ముందస్తుగా ఎటువంటి ప్రణాళికా లేకపోవడం, కనీసం ఒకసారి ట్రయల్‌రన్ కూడా వేయకపోవడంతో తొలి రోజు సమయానికి భోజనం పంపడంలో ఆ సంస్థ పూర్తిగా విఫలమైంది.
1,07566 మంది విద్యార్థుల అవస్థ
ఏక్తా శక్తి ఫౌండేషన్ జిల్లాలోని 1,075 సూళ్లలోని 107566 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందచేయాల్సి ఉంది. వీటిలో ఏలూరు క్లస్టర్ పరిధిలోని పెదపాడు, ఏలూరు రూరల్, అర్బన్ పరిధుల్లోని 216 పాఠశాలల్లో 21793 మంది విద్యార్థులకు, ఉండి క్లస్టర్ పరిధిలోని ఆకివీడు, ఉండి కాళ్ళ, పాలకోడేరు మండలాల్లోని 245 పాఠశాలల్లో 21793 మంది విద్యార్థులకు, యర్నగూడెం క్లస్టర్ పరిధిలోని చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల్లోని 189 పాఠశాలల్లో 21751 మంది విద్యార్థులకు, భీమడోలు క్లస్టర్ పరిధిలోని భీమడోలు, గుండుగొలను, దెందులూరు, ద్వారకా తిరుమల, నిడమర్రు మండలాల్లోని 221 పాఠశాలల్లో 19093, కానూరు క్లస్టర్ పరిధిలోని నిడదవోలు, పెరవలి, తణుకు, ఉండ్రాజవరం మండలాల్లోని 204 పాఠశాలల్లో 20518 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలి. అయితే భీమడోలు, కానూరు క్లస్టర్లలో వంటశాలల నిర్మాణం పూర్తి కానందున ఆయా క్లస్టర్లలో పాత ఏజెన్సీల ద్వారానే మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారు. కాగా ఈ నెల 1 నుంచే ఏక్తాశక్తి సంస్థ భోజనం సరఫరా చేయాల్సి ఉన్నా జిల్లాలోని అధిక శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఐచ్ఛిక సెలవులు తీసుకోవడంతో పాఠశాలలు తెరవలేదు. ఈ కారణం చేత మూడు క్లస్టర్ల పరిధిలో బుధవారం ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించారు.
కొన్ని పాఠశాలలకు సరఫరా చేయలేదు..
ఏక్తాశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించిన మూడు క్లస్టర్లలో దాదాపు 65 శాతం పాఠశాలలకు మధ్యాహ్నం 3 గంటల తరువాత భోజనం తీసుకురాగా ఏలూరు నగరంతో పాటు ఆయా క్లస్టర్ల పరిధిలోని కొన్ని పాఠశాలలకు సాయంత్రం స్కూల్ విడిచిపెట్టే సమయానికి కూడా భోజనం సరఫరా కాలేదు. దీంతో కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్నం 2.30 గంటలు దాటిన తరువాత అప్పటికప్పుడు భోజనం వండి పెట్టగా మరికొన్ని పాఠశాలల్లో ఉప్మా వండి పెట్టారు. ఇంకొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకువచ్చి విద్యార్థుల క్షుద్భాధ తీర్చే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment