విద్యార్థులకు అన్నం, సాంబారు వడ్డిస్తున్న నిర్వాహకులు
విజయనగరం రూరల్: ప్రభుత్వ పెద్దల కాసుల కక్కుర్తికి విద్యార్థులకు మధ్యాహ్న భోజనన పథకంలో కోడిగుడ్డు అందని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలు మధ్యాహ్న భోజన పథకాన్ని కమీషన్లకు ఆశపడి ప్రైవేట్ ఏజెన్సీలకు 20 రోజుల కిందట అప్పగించింది. దీంతో విజయనగరం, నెల్లిమర్ల, డెంకాడ మండలాలను ఒక క్లస్టర్‌గా విభజించి ఆయా మండలాల పరిధిలోని పాఠశాలలకు సదరు ప్రైవేటు ఏజెన్సీ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. ఏజెన్సీ నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉండడం.. ఆలస్యంగా సరఫరా చేస్తుండడంపై మొదటి రోజు నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డెంకాడ మండలాన్ని తప్పించి విజయనగరం, నెల్లిమర్ల పరిధిలోని పాఠశాలలకే ఏజెన్సీ నుంచి మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో ఐదు రోజులు గుడ్డు అందించాల్సి ఉంది. అయితే పది రోజులుగా సదరు ఏజెన్సీ గుడ్డు అందించడం లేదు.
ప్రతి రోజూ సాంబారు, అన్నం మాత్రమే సరఫరా చేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మండిపడుతున్నారు. పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందిస్తామని చెప్పి కేవలం అన్నం, సాంబారు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు అందించాల్సిన భోజనాన్ని 9.30 గంటలకే పాఠశాలలకు సరఫరా చేస్తుండడంతో చలి గాలులకు అన్నం చల్లబడి నీరుపట్టి మెత్తగా అయిపోతోందని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు అన్నం తినలేకపోతున్నారు. కొంతమంది విద్యార్థులు పూర్తిగా తినకపోగా.. మరికొంతమంది అర్దాకలితో భోజనాన్ని ముగించేస్తున్నారు. రెండు మండలాల్లో 180కి పైగా పాఠశాలల్లో 20 వేలకు పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. రుచిలేని భోజనం, గుడ్డులేక వారిలో 10 వేల మంది వరకు భోజనం తినకుండా వదిలేస్తున్నారు. ఈ విషయమై మండల విద్యాశాఖాధికారి వివరణ కోరగా కొద్ది రోజులుగా మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు అందించని మాట వాస్తవమేనన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment