కందిపప్పు ఇవ్వక పోవడంతో ఉడకబెట్టిన గుడ్డు, ఓ కూరతో వడ్డించిన మధ్యాహ్న భోజనం
శ్రీకాకుళం, వీరఘట్టం: పథకం ప్రవేశపెట్టడం.. ఊపుగా ప్రచారం చేయడం.. కొనసాగించలేక మధ్యలోనే వదిలేయడం.. అంత వైఫల్యంలోనూ తమ ఆదాయ మార్గాలు వెతుక్కోవడం.. టీడీపీ మార్కు రాజకీయమిది. సర్కారు బడుల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలోనూ టీడీపీ ఇదే ఫార్ములా ఫాలో అయ్యింది. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు మధ్యాహ్నం వంటకు కందిపప్పును ప్రభుత్వమే సరఫరా చేస్తుందని విద్యా శాఖ గతంలో ప్రకటించింది. ఆ ప్రకటన మేరకు గత నెల కందిపప్పును సరఫరా చేసింది. నెల గడిచేలోపే అధికార పార్టీ తన అసలు ప్లాన్‌ను అమలు చేసింది. నవంబరు నెల సగం పూర్తయినా ఇంత వరకు పాఠశాలలకు కందిç ³ప్పు సరఫరా కాలేదు. కానీ ఆన్‌లైన్ నమోదుల్లో మాత్రం అన్ని బడులకు కందిపప్పును ఇచ్చేసినట్లుచూపిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారమే చెల్లింపులు జరుపుతుండడంతో వంట మహిళల కుకింగ్ చార్జీల్లో కోత పెడుతూ.. నెలకు రూ.5.91 లక్షల మొత్తాన్ని కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరుస్తున్నారు. అసలు సరుకే పంపిణీ చేయకుండా సర్కారు చెల్లిస్తున్న మొత్తమిది.
సరుకు ఇవ్వకుండా..
ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికీ 100 గ్రాముల బియ్యం, మసాలా దినుసులకు రూ.4.13 పైసలు చొప్పున అలాగే 6–10వ తరగతి విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం, మసాలా ఖర్చులకు రూ.6.18 పైసలు చొప్పున ఈ మహిళలకు విద్యాశాఖ చెల్లిస్తోంది. తాజాగా అక్టోబర్ నుంచి ప్రభుత్వం 1–5వ తరగతి వారికి 20 గ్రాముల కందిపప్పు, అలాగే 6–10వ తరగతి విద్యార్థులకు 30 గ్రాముల కందిపప్పు చొప్పున సరఫరా చేస్తోంది. ఈ సరుకులకు గాను కుక్కింగ్ చార్జీల్లో 1–5వ తరగతి విద్యార్థులకు రూ.1.38 పైసలు, 6–10వ తరగతి విద్యార్థులకు రూ.2.07 పైసలు కట్ చేస్తోంది. ఇలా జిల్లాలో 2,38,616 మంది విద్యార్థులకు కందిపప్పు సరఫరా పేరిట నెలకు రూ.5,91,848లు కాంట్రాక్టర్లకు ముడుతోంది. సరుకు సరఫరా చేసినా చేయకపోయినా ఈ డబ్బులు ఖాతాలకు జమ అయిపోతున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు మధ్యాహ్న భోజనానికి కందిపప్పు సరఫరా నిలిపివేశారు.
స్టాకు లేదంట....
విద్యార్థుల్లో పౌష్టికాహారం లోపం అధిగమించేందుకు మధ్యాహ్నం భోజనానికి కందిపప్పు సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం కందిపప్పు సరఫరాను మూడు రోజుల ముచ్చటగా ముగించింది. మధ్యాహ్నం వంటలకు సరఫరా చేయాల్సిన కందిపప్పు స్టాకు లేకపోవడంతో ఈనెల కందిపప్పు సరఫరా చేయలేదని కాంట్రాక్టర్ చెబుతున్నారు. అయితే ఈ నెలలో కందిపప్పు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. అలాంటప్పుడు వంట ఏజెన్సీల కుక్కింగ్ చార్జీల్లో కోత కోయడం సబబు కాదని పలువురు వాపోతున్నారు. ఈ విధానాన్ని రద్దు చేసి యథావిధిగా వంట మహిళలకు కందిపప్పు చార్జీలను ప్రభుత్వం చెల్లించాలని ఏజెన్సీ మహిళలు కోరుతున్నారు.
ఒక్క నెలే కందిపప్పు ఇచ్చారు
ప్రతి రోజు కందిపప్పుతో చారు చేసి మధ్యాహ్నం భోజనంలో వడ్డించాలని చెప్పారు. కానీ కందిపప్పు పేరిట మాకు రావాల్సిన కుకింగ్ చార్జీల్లో కోత వేశారు. ఒక్క నెలతోనే కందిపప్పు సరఫరా నిలిపివేశారు. అడిగితే స్టాకు లేదని చెబుతున్నారు. – దుప్పాడ ఇందు, వంట ఏజెన్సీ మహిళ, వీరఘట్టం
కాంట్రాక్టర్లను పెంచడానికే
కాంట్రాక్టర్లను పెంచడానికే కందిపప్పు సరఫరాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఆరు బయట ఎండలో పాట్లు పడుతూ వంటలు చేస్తున్న మాకు మాత్రం రూపాయి ఇవ్వడానికి చేయిరాని ఈ ప్రభుత్వం... కాంట్రాక్టర్ల కోసం కందిపప్పును వాళ్లకు అప్పగించారు.– కిల్లారి శ్రీదేవి, వంట ఏజెన్సీ మహిళ, వీరఘట్టం
Comments
Please login to add a commentAdd a comment