యాదమరి మండలం దళవాయిపల్లెలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు
ఆహా..ఏమి రుచీ.. తినరా మైమరచి.. అంటున్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. గతంలో మాదిరిగా పప్పు, నీళ్లచారుతో సరిపెట్టకుండా రాష్ట్ర సర్కారు సరికొత్త మెనూ రూపొందించింది. దీన్ని మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసింది. పోషకాలతో కూడిన ఆహార పదార్థాలకే ప్రాధాన్యమిచ్చింది. సరికొత్త వంటకాలు వడ్డించడంతో పిల్లలు ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉండాలంటే నాణ్యమైన, రుచి, శుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మెనూ ప్రవేశపెట్టింది. సంక్రాంతి సెలవుల అనంతరం మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో నూతన మెనూ అన్ని బడుల్లో అమలుచేశారు. దీనిపై అన్ని వర్గాల్లోహర్షం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు పులిహోర, టమాట పప్పు, ఉడికించిన గుడ్డును పెట్టారు.
నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు మొదటి రోజు పెట్టిన పులిహోరా, టమాట పప్పు, ఉడికించిన కోడిగుడ్డు
మధ్యాహ్న భోజనం తిననివిద్యార్థుల సంఖ్య తగ్గింపు
జిల్లాలో నూతన మెనూ అమలు కావడంతో మధ్యాహ్న భోజనం తినని విద్యార్థుల సంఖ్య తగ్గిందని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. గతంలో విద్యార్థులకు ఇష్టమైన భోజనం లేకపోవడంతో సరిగ్గా భోజనాన్ని తినేవారు కాదు. జిల్లాలో సంక్రాంతి సెలవుల ముందు 9వ తేదీన నివేదికల ప్రకారం జిల్లాలోని 4,830 పాఠశాలల్లో 2,13,558 మంది విద్యార్థులు హాజ రయ్యారు. వారిలో 2,04,408 మంది మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. మిగిలిన 9,150 మంది తినలేదు. కాగా మంగళవారం జిల్లాలో మధ్యాహ్న భోజనం తినని విద్యార్థుల సంఖ్య 6,172కు చేరింది. నూ తన మెనూ బాగుండడంతో మధ్యాహ్న భోజనం తినని విద్యార్థుల సంఖ్య రాబో యే రోజులలో క్రమేణా తగ్గుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 4,830 పాఠశాలల్లో అమలు
జిల్లాలోని 4,830 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆ పాఠశాలల్లో చదువుతున్న 3,23,406 మంది విద్యార్థులు ఆ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. నూతన మెనూకు అదనపు బడ్జెట్ ఖర్చవుతున్నప్పటికీ లెక్కచెయ్యకుండా నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment