తొలిరోజే అట్టర్‌ఫ్లాప్‌! | Midday Meal Scheme Delayed in Kurnool | Sakshi
Sakshi News home page

తొలిరోజే అట్టర్‌ఫ్లాప్‌!

Published Thu, Apr 25 2019 1:46 PM | Last Updated on Thu, Apr 25 2019 1:46 PM

Midday Meal Scheme Delayed in Kurnool - Sakshi

కోవెలకుంట్ల మెయిన్‌ స్కూల్‌లో ఉప్మా తింటున్న విద్యార్థులు

కర్నూలు సిటీ/ కోవెలకుంట్ల/జూపాడుబంగ్లా: ప్రభుత్వ పాఠశాలల్లో వేసవికాలం మధ్యాహ్న భోజన పథకం అమలు మొదటిరోజే అభాసుపాలైంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కరువు మండలాల్లో వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని 33 మండలాల పరిధిలో అన్ని పాఠశాలల్లో బుధవారం నుంచి  పథకం అమలు చేయాల్సి ఉంది. అయితే తొలిరోజే అట్టర్‌ఫ్లాప్‌ కావడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఆయా మండలాల్లో కొన్నిచోట్ల పాఠశాలలు తెరుచుకోక పోగా, మరికొన్ని చోట్ల మధ్యాహ్న భోజనం చేసేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు.

అరకొరగా అమలు ..
జిల్లాలోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, ఆదోని, ఆలూరు, ఆస్పరి, బేతంచెర్ల, సి.బెళగల్, చిప్పగిరి, దేవనకొండ, డోన్, గూడూరు, హాలహర్వి, çహొళగుంద, జూపాడుబంగ్లా, కల్లూరు, కోడుమూరు, కౌతాళం, కృష్ణగిరి, కర్నూలు, మద్దికెర, మంత్రాలయం, మిడుతూరు, నందవరం, నంద్యాల, ఓర్వకల్లు, పత్తికొండ, ప్యాపిలి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు, పాణ్యం మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వేసవిసెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు స్కూళ్లకు వెళ్లి ఉదయం 11 గంటలకు విద్యార్థులకు భోజనం పెట్టించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే బుధవారం తొలిరోజు ఆయా మండలాల్లో చాలా పాఠశాలల తలుపులు తెరుచుకోలేదు. కొన్ని చోట్ల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కాకపోవడంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అరకొరగా అమలు చేశారు.

కొద్ది మందికే భోజనం
నందికొట్కూరు నియోజకవర్గంలో  జూపాడుబంగ్లా, మిడుతూరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. జూపాడుబంగ్లా మండలంలో 36 పాఠశాలలు ఉండగా 3,480 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాల్సి ఉండగా 500 మందికి మాత్రమే ఏర్పాటు చేశారు. మిడుతూరు మండలంలో 49 పాఠశాలలుండగా 3,570 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉండగా కేవలం 550 మందికి  వడ్డించినట్లు అధికారులు చెబుతున్నారు. జూపాడుబంగ్లా మోడల్‌ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తినేందుకు ఒక్క విద్యార్థి కూడా రాకపోవటంతో పాఠశాల తలుపులు తెరచుకోలేదు. జూపాడుబంగ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 366 మందికి గాను 30 మందికి భోజనం వండగా, అందులో  5 మందికి మాత్రమే వడ్డించారు. పారుమంచాల జిల్లా పరిషత్‌ పాఠశాలలో 180 మందికి గాను కేవలం 50 మందికి, స్పెషల్‌ స్కూల్లో 100 మంది విద్యార్థులకు గాను 60 మందికి, మండ్లెం స్పెషల్‌ స్కూల్లో 68 మందికి గాను 32 మంది, జూపాడుబంగ్లా సిద్ధేశ్వరం పాఠశాలలో 29 మందికి గాను నలుగురికి భోజనం వడ్డించారు. మారుమూల గ్రామాలైన రామసముద్రం, కొత్తసిద్ధేశ్వరం పాఠశాలల్లో భోజనాలు అరకొరగా వడ్డించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. మిడుతూరు మండలంలో కూడా అరకొరగా  వడ్డించి ఉపాధ్యాయులు చేతులు దులుపుకున్నారు.

బియ్యం, బ్యాళ్లు ఇళ్లకు ఇస్తే మేలు..  
పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో ఆటాపాటల్లో ఇళ్ల వద్ద సరదాగా గడిపే విద్యార్థులు పాఠశాలలకు వచ్చి మధ్యాహ్న భోజనం తినేందుకు ఇష్టపడటం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలలు గ్రామాలకు దూరంగా ఉండటంతో స్థానిక, ఇతర గ్రామాల నుంచి   విద్యార్థులు పాఠశాలలకు వచ్చి భోజనం చేయడం కష్టసాధ్యమని చెబుతున్నారు. దీంతో పాఠశాలల వద్ద వండి పెట్టకుండా విద్యార్థుల ఇళ్లకు బియ్యం, బ్యాళ్లు ఇస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.   

కోవెలకుంట్లలో..
కోవెలకుంట్ల పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయగా, ఉర్దూ ఉన్నత పాఠశాల, పేట స్కూల్‌ తెరవలేదు.  జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులు ఎవరూ హాజరు కాకపోవడంతో పథకం అమలు కాలేదు. మెయిన్‌స్కూల్‌లో 40 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి బదులు ఉప్మాతో సరిపెట్టారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో మొదటిరోజే పథకం అభాసుపాలైంది. అధికారులు చర్యలు తీసుకుని పాఠశాలల్లో వేసవికాలంలో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

39,184 మంది మాత్రమే భోజనం చేశారు
జిల్లాలోని 33 కరువు మండలాల  పరిధిలోని మొత్తం 2053 స్కూళ్లలో 2,84,113 మంది విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్న  భోజనం అందించాల్సి ఉంది. అయితే మొదటి రోజు   39,184 మంది విద్యార్థులకు మాత్రమే భోజనం పెట్టినట్లు మధ్యాహ్న భోజన పథకం యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు.   పకథం అమలుపై  విద్యాశాఖ జారీ చేసిన విధి వి«ధానాలను ఉపాధ్యాయులు వ్యతిరేకించడం వల్ల చాలా చోట్ల టీచర్లు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఆయా స్కూళ్లకు చెందిన హెచ్‌ఎంలు మాత్రమే హాజరై భోజన సమయానికి వచ్చిన విద్యార్థులకు అన్నం పెట్టించి యాప్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేశారు. దీని ప్రకారం జిల్లాలో మొదటి రోజు కేవలం 13 శాతం మంది విద్యార్థులు మాత్రమే స్కూళ్లకు వచ్చినట్లు  విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.   కోసిగి మండలంలో ఒక్క విద్యార్థికి కూడా భోజనం పెట్టకపోవడం గమనార్హం. ఈ మండలం లో 46 పాఠశాలలు ఉండగా, 11,284 మంది విద్యార్థులు ఉన్నారు.

ఆరుబయటే భోజనాలు..  
వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా మధ్యాహ్న భోజనం  ఆరుబయట పెట్టకూడదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంద్యారాణి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ  చాలా చోట్ల వంట ఏజెన్సీల నిర్వాహకులు ఆరు బయటే విద్యార్థులకు భోజనాలు పెట్టారు. 

వేసవి భోజనాలకు సరుకులేవీ?
కరువు మండలాల్లో మధ్యాహ్న  భోజన పథకం అమలుకు అవసరమైన సరుకుల పంపిణీపై విద్యాశాఖ  స్పష్టత ఇవ్వకపోవడంతో మొదటి రోజు నిర్వాహకుల వద్ద మిగిలిన సరుకుల్లో నుంచే విద్యార్థులకు భోజనాలు పెట్టారు. వేస వి సెలవుల్లో  సరుకులు పంపిణీ చేయకపోతే భోజనం ఎలా పెట్టాలని చాలా మంది వంట ఏజెన్సీల నిర్వాహకులు ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలను నిలదీస్తున్నట్లు తెలుస్తోంది.

కరువు మండలాల్లోని స్కూళ్లన్నింటిలోనూ మధ్యాహ్న భోజనం పెట్టాలి
జిల్లాలో 33 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ మండలాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం పెట్టాలని ఇప్పటికే  హెచ్‌ఎంలకు ఆదేశాలు ఇచ్చాం. ఎంత మంది విద్యార్థులు భోజనం చేసిందీ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.  – తాహెరా సుల్తానా, డీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement