మద్నూర్: మధ్యాహ్నం భోజనం పెట్టినందుకు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం విడుదల చేసే సొమ్ము ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో మధ్యాహ్నం భోజనం పెట్టాలంటే తంటాలు పడాల్సి వస్తోందంటున్నారు.
రెండులక్షల మందికి ‘భోజనం’
జిల్లాలోని 36 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు సుమారు రెండు వేలకు పైగానే ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో రోజూ దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండనక, వాననక ఏజెన్సీలు మధ్యాహ్నం భోజనం వండి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. పలు పాఠశాలల్లో కనీసం వంటశాలలు కూడా లేవు. అలాంటి చోట్ల చెట్లు, పాఠశాలల చూర్ల కిందే భోజనం తయారు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రూ.5కు పౌష్టికాహారం సాధ్యమా..!
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం కేటాయించే నిధులు దారుణంగా ఉన్నాయి. బజారుకు వెళ్లి రూ. 5 చెల్లిస్తే చాయ్ కూడా ఇవ్వడం లేదు. ఇదే డబ్బుతో ఒక్కో విద్యార్థికి ఒకపూట పౌష్టికాహారం ఎలా అందించాలని ప్రశ్నిస్తున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిందేనని హుకూం జారీచేసే అధికారులు కనీసం ఆలోచించాలని నిర్వాహకులు కోరుతున్నారు. సాధారణ భోజనమైతే ఎలాగోలా పెట్టేవాళ్లమని, మెనూ ప్రకారం గుడ్లు, ఇతర ప్రత్యేక ఆహార పదార్థాలు అందించడం ఎలా సాధ్యమని ఏజెన్సీ మహిళలు ప్రశ్నిస్తున్నారు.
నిధులు గుడ్డుకే సరిపోవు..!
ప్రస్తుతం పాఠశాలలో ఒకటి నుంచి ఐదోతరగతి విద్యార్థులకు 100గ్రాముల బియ్యం, వంటకు అవసరమైన రూ. 4.35 చెల్లిస్తారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు 150గ్రాముల బియ్యంతో పాటు రూ.6 చొప్పున కేటాయిస్తారు. నిబంధనల ప్రకారం రోజూ అన్నం, సాంబారు లేదా కూరతో భోజనం తప్పనిసరిగా అందించాలి. సోమ, గురువారాల్లో అదనంగా కోడిగుడ్డుతో కూడిన భోజనం పెట్టాలి. పెరిగిన ధరలతో సర్కారు చెల్లించే సొమ్ముతో కోడిగుడ్డే రావడం లేదు. ఇలాగైతే మిగిలిన సరుకులకు సొమ్ము ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులే మిగులుతున్నాయ్
మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు బియ్యం తప్ప మరే సరుకు అందివ్వరు. వంటకు అవసరమైన నూనెలు, పప్పులు, ఉప్పులు, కూరగాయాలు, వంటచెరుకు..ప్రతీది ఏజెన్సీ నిర్వాహకులే కొనుగోలు చేయాలి. రెండు నెలల తర్వాతే నిర్వాహకులకు బిల్లులు అందుతున్నాయి. ముందు పెట్టుబడులు పెడితే ఆ తర్వాత సర్కా రు నిధులు మంజూరు చేస్తోంది. దీంతో అప్పు చేసి మరీ భోజనం పెడుతున్నారు. సకాలంలో బిల్లులు అందక తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరి గిపోతున్నాయి.
‘ఉపాధి హామీ’ నయం
ఉపాధిహామీ పథకం ద్వారా రోజుకు రూ.120 వరకు గిట్టుబాటవుతుంది. 25రోజులకు రూ. 3 వేల వరకు లభిస్తుంది. మధ్యాహ్నంభోజనం వండి వడ్డిస్తే రూ. రెండు వేలే ఇస్తున్నారు. అంటే రోజు కూలి రూ.66 మాత్రమే.
‘మధ్యాహ్న’ వంట.. అప్పుల మంట
Published Thu, Aug 14 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement
Advertisement