భోజన పథకానికి గ్యాస్‌ ‘మంటలు’..! | Gas Cylinders Shortage in Midday Meal Scheme | Sakshi
Sakshi News home page

భోజన పథకానికి గ్యాస్‌ ‘మంటలు’..!

Published Tue, Dec 11 2018 6:40 AM | Last Updated on Tue, Dec 11 2018 6:40 AM

Gas Cylinders Shortage in Midday Meal Scheme - Sakshi

విజయనగరం అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేసే మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. రాయితీపై సిలిండర్లు సరఫరా చేయకపోవడం, కనెక్షన్ల కోసం పాఠశాల నిర్వహణ నిధులు వినియోగించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు, భోజన నిర్వాహకుల సంఘాలు తప్పుబడుతున్నాయి. గ్యాస్‌పై వంట చేయడం భారం కావడంతో వంట నిర్వాహకులు స్టౌవ్‌లను మూలకు చేర్చుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 2,635 పాఠశాలల్లో కర్రలపైనే వంటలు సాగుతున్నాయి. భోజన వంటకాలు గ్యాస్‌ పొయ్యిలపై చేయాలనే కలెక్టర్‌ ఉద్దేశం మంచిదే అయినా అమలులో చిత్తశుద్ధి లోపించింది.

ఇదీ పరిస్థితి...
పదేళ్ల కిందట జిల్లాలోని 800 ప్రాథమిక పాఠశాలలకు  గ్యాస్‌ స్టౌవ్‌(సింగిల్‌ పొయ్యి)లను పంపిణీ చేశారు. గ్యాస్‌ సిలిండర్లను రాయితీపై సరఫరా చేయకపోవడంతో వంటలు భారమయ్యాయి.  దాదాపు అన్ని పాఠశాలల్లోని స్టౌవ్‌లూ మూలకు చేరాయి. వీటి కోసంఅప్పట్లో సుమారు రూ.30 లక్షలు సర్వశిక్షా అభియాన్‌ నిధుల కేటాయించినా ఫలితం లేకపోవడం గమనార్హం. దీనిని చక్కబెట్టకుండానే గత ఏడాది జిల్లాలో స్కూల్‌ నిర్వహణ నిధులు వస్తున్న 2,635 పాఠశాలలకు గ్యాస్‌ కనెక్షన్‌లను బలవంతంగా అంటగట్టారు. గ్యాస్‌ కనెక్షన్‌ కోసం అవసరమైన నిధులను ప్రత్యేక గ్రాంట్‌ల నుంచి కాకుండా ఆయా పాఠశాలల గ్రాంట్ల నుంచి ఎస్‌ఎస్‌ఏ యంత్రాంగం నేరుగా తీసుకుంది. ఒక్కో పాఠశాల అకౌంట్ల నుంచి రూ.2,600 వంతున రూ.67.3 లక్షల మొత్తంగా గ్యాస్‌ ఏజెన్సీలకు చెల్లిందించి. కనెక్షన్‌ అయితే ఇచ్చారు గానీ స్టౌవ్‌ కొనలేదు. ఇప్పటికే ఉన్న నిధులు తీసుకుపోవడంతో ఖాతాల్లో సొమ్ములు లేవని సుమారు 1500 స్కూళ్లు  స్టౌవ్‌లు కొనుగోలు చేయని పరిస్థితి అప్పట్లో ఏర్పడింది. స్టౌవ్‌లు కొనుగోలు చేసిన పాఠశాలల్లో రాయితీ సిలెండర్‌ పంపిణీపై రాతపూర్వక ఆదేశాలు రాకపోవడంతో వాటి వాడకం కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో గ్యాస్‌ వాడకం పేరుతో స్కూళ్ల నిధుల నుంచి తీసుకున్న రూ.67.3 లక్షలు బూడిదపాలయ్యాయి.

వినియోగానికి దూరం...
గృహావసరాల సిలెండర్‌ను పాఠశాలలకూ సరఫరా చేస్తామని చెబుతున్నా ఆచరణ శూన్యమే అయ్యింది. దీంతో ప్రస్తుతం వాణిజ్య వినియోగంలోనే రూ.950 ధరతో సిలెండర్లను కొనాల్సిన పరిస్థితి. భోజన పథకానికి వచ్చే నిధులు చాలకపోవడంతో కట్టెలనే వాడాల్సి వస్తోందని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. నెలకు సరిపడే సంఖ్యలో రాయితీపై సిలెండర్లను ఇప్పించాలంటే జిల్లా యంత్రాంగం నుంచి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలి. అలాంటి చర్యలు ఏవీ తీసుకోకుండా అమలు సాధ్యంకాదని ఉపాధ్యాయులు వాఖ్యానిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీతోపాటు ఆదర్శపాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు కలిపి 335 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇలాంటి పాఠశాలకు సిలెండర్ల సమస్య తప్పక ఎదురవుతుంది. నిబంధనల మేరకు గృహావసరాల సిలెండర్‌ కావాలంటే  21 రోజులైతే కాని రాయితీతో ఇచ్చే పరిస్థితి లేదు. వందల మంది విద్యార్థులున్న పాఠశాలలకు నెల పొడువునా 15 సిలెండర్లు కనీసం అవసరం పడతాయి. వీటి అమలు సాధ్యం కాదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

రాతపూర్వక ఆదేశాలు రావాలి
పాఠశాలలల్లో మధ్యాహ్న భోజన వంటల కోసం గ్యాస్‌ కనెక్షన్లను కలెక్టర్‌ మంజూరు చేశారు. ఎస్‌ఎంసీ నుంచి సేకరించిన నిధులను వెచ్చించాం. రెగ్యులర్‌గా సిలెండర్‌ గ్యాస్‌ కొనుగోలును ఆయా పాఠశాలల మధ్యాహ్న భోజన మెస్‌ చార్జీల నుంచి కేటాయించుకోవాలి. రాయితీ సిలెండర్లపై రాతపూర్వక ఆదేశాలు ఇంకారాలేదు. ఆర్థికంగా భారం కాకూడదని సిలెండర్‌ కేటగిరీని గృహావసరాలకు అనుమతి ఇచ్చారు.     
– డాక్టర్‌ బీ.శ్రీనివాసరావు, పీఓ, ఎస్‌ఎస్‌ఏ

రాయితీ సిలెండర్లపై స్పష్టత తప్పనిసరి
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటకు గ్యాస్‌ కనెన్షన్‌ ఇచ్చారు. నెలకు సరిపడినన్ని గ్యాస్‌ సిలెండర్ల పంపిణీని రాయితీపై ఇవ్వడం లేదు. ఇవ్వగలిగితే అందుకు అవసరమైన చట్టబద్ధమైన ఆదేశాలను గ్యాస్‌ ఏజెన్సీలకు ఇవ్వాలి. గ్యాస్‌ స్టౌవ్‌లు సాధారణమైనవి కాకుండా ఎక్కువ మందికి వండగలిగే  పెద్ద స్టౌవ్‌లను విధిగా ఇవ్వాలి. ఇలాంటి సమ్యలన్నింటినీ అధిగమించకపోతే గ్యాస్‌ కనెక్షన్‌లు వృథాగా పడి ఉంటాయి.– టి.సన్యాసిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రధానోపాధ్యాయ సంఘం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement