అధ్వాన భోజనం | Private Agency Neglect on Midday MEals Scheme Meals | Sakshi
Sakshi News home page

అధ్వాన భోజనం

Published Sat, Dec 15 2018 8:46 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

Private Agency Neglect on Midday MEals Scheme Meals - Sakshi

నాణ్యతలేని మధ్యాహ్న భోజనాన్ని తినలేక బయటపడేస్తున్న విద్యార్థులు

బడిపిల్లల ఆకలి తీర్చడంలోనూ నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. ఎక్కడికక్కడే మధ్యాహ్న భోజనం వండిపెట్టే నిర్వాహకులను కాదని... ప్రత్యేకఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. వారు మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. సకాలంలో ఆహారం సరఫరా చేయడం లేదు. కొన్ని చోట్ల పూర్తిగా అందడం లేదు. గత్యంతరం లేక కొన్ని చోట్ల ఉప్మాతో సరిపెడుతుండగా... కొన్ని చోట్ల సరఫరా అయిన అన్నంలో రాళ్లు కనిపిస్తున్నాయి. ఇక ఉడికీ ఉడకని అన్నం... నీరులాంటి చారుతో అందించిన భోజనం తినలేక ఎంతోమంది పిల్లలు పారబోశారు. ఈ సంఘటనలు శుక్రవారమే చోటుచేసుకోవడం గమనార్హం.

సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తాజాగా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడంతో మరింత సమస్యాత్మకంగా తయారైంది. క్లస్టర్ల వారీగా వంట తయారీ కేంద్రాలను నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చి వాటిని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే విధానాన్ని విద్యాశాఖ తాజాగా అమలులోకి తెచ్చింది. ఇంతవరకు నిర్వహించే పాఠశాల స్థాయి భోజన పంపిణీ వ్యవస్థను రద్దు చేయడంతో మహిళా పొదుపు సంఘాలసభ్యులకు ఉపాధి పోయింది. జిల్లాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ‘సాక్షి’ శుక్రవారం పరిశీలించినప్పుడు  విద్యార్థులు, నిర్వాహకుల సమస్యలు కనిపించాయి. ఈ రోజు కొన్ని పాఠశాలలకు ప్రైౖ వేట్‌ సంస్థ భోజనాలు తీసుకు వచ్చింది. సాధారణంగా మెనూ ప్రకారం గుడ్డు, రైస్, కూరగాయలతో సాంబారు ఇస్తుండేవారు. కానీ రైస్, తాలింపు వేయని పప్పుచారు శుక్రవారం వచ్చింది. గుడ్డు లేదు. రాళ్లతో నిండిన రైస్‌ ఉంది. ఈ భోజనాన్ని తినలేక విద్యార్థులు బయట పడేస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా పిల్లలకు  వండిపెడుతున్న తమను అన్యాయంగా తీసేశారంటూ  మహిళా పొదుపు సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదు క్లస్టర్లుగా విడగొట్టి:
జిల్లాలోని 2,701 వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్‌ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పథకం అమలు జరుగుతోంది. ఈ స్కూళ్లలో 1,84,184 మంది విద్యార్ధులకు ఈ పథకం ద్వారా భోజనం అందుతోంది. ప్రతి స్కూలుకు ఒక్కో నిర్వాహక ఏజెన్సీని ఆయా గ్రామాల పరిధిలో మహిళా పొదుపు సంఘాల సభ్యులతో ఏర్పాటు చేశారు. తొలిదశలో 1,600 స్కూళ్లలో క్లస్టర్‌ పరిధి భోజన నిర్వహణ విధానాన్ని అమలుచేయాలని గత ఏడాది నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా పార్వతీపురం, రామభధ్రపురం, నెల్లిమర్ల, ఎల్‌.కోట, గరివిడి 5 ప్రాంతాలుగా విడగొట్టి ఆయా ప్రాంతాలలో భోజన వంట కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని కార్పొరేట్‌ సంస్థకు అప్పగించారు. పొదుపు సంఘాలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రయోగాత్మకం పేరుతో రెండురోజుల క్రితం నెల్లిమర్ల క్లస్టర్‌ పరిధిలోని విజయనగరం, డెంకాడ, నెల్లిమర్ల పరిధిలోని 240 స్కూళ్లలో కార్పొరేట్‌ భోజన పంపిణీ ప్రారంభించారు. దానిని మహిళా పొదుపు సంఘాల సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలను అరెస్ట్‌ చేశారు. తొలి రోజు 78 స్కూళ్లకు భోజనం వెళ్లక విద్యార్థులు పస్తులున్నారు. రెండవ రోజు శుక్రవారం అదే తీరులో కొనసాగింది. దాదాపు 150 స్కూళ్లకు మధ్యాహ్నం 2 గంటలలోపు భోజనం పంపిణీ కాలేదని నివేదికలు చెబుతున్నాయి.

రూ.6 కోట్లు బకాయి
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు రెండు నెలల బిల్లుల బకాయి ఉంది. అక్టోబర్, నవంబర్‌ నెలలకు రూ.6 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. అప్పు చేసి భోజనాలు పెడుతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోయినా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అప్పులు చేసి బాధ్యతగా భోజనాలు పెట్టేవారు. విద్యార్థుల హాజరు పెంచడంతోపాటు పౌష్టికాహారం అందించేందుకు కేంద్రప్రభుత్వ నిధుల ద్వారా నిర్వహిస్తున్న మధ్యాహ్నభోజన పథకంపై జిల్లా వ్యాప్తంగా 5,024 మంది పొదుపు సంఘం మహిళల కుటుంబాల జీవనం ఆధారపడుతోంది. తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణల వల్ల వీరంతా రోడ్డున పడ్డారు. ఇప్పుడు తామెలా బతకాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తినేలా లేదు
ఇన్నేళ్లుగా ప్రభుత్వం ఇస్తున్న రూ.1000ల వేతనంతోనే మధ్యాహ్న భోజన నిర్వాహకులు పిల్లలకు భోజనం వండి పెడుతున్నారు. పిల్లలు తినగా మిగిలిన భోజనాన్ని తింటూ పొట్ట నింపుకుంటున్నారు. సుమారు రూ.లక్షన్నర ఖర్చుచేసి వంటకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసుకున్నారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. ఏనాటికైనా తమ బతుకులు మారతాయని, ప్రభుత్వం తమ జీతాలు పెంచుతుందని ఆశతో ఇన్నాళ్లుగా నెట్టుకొస్తుంటే ఇప్పుడు అకారణంగా తీసేయడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. ఇక పిల్లలు కూడా కొత్తగా వస్తున్న భోజనాన్ని తినలేకపోయారు. ఉప్పూ, కారం లేని పప్పుచారు, రాళ్లూ, ముక్కిపోయిన బియ్యంతో వండిన అన్నం తినలేక బయటపడేశారు.

అమలు కాని భోజన మెనూ
విద్యాశాఖ నిర్దేశిత భోజన మెనూ విధిగా అమలు చేయాల్సి ఉంది. తాజాగా నెల్లిమర్ల క్లస్టర్‌ పరిధిలో అమలయిన భోజన పంపిణీ శుక్రవారం అమలు చేయలేదు. మెనూ ప్రకారం శుక్రవారం, గుడ్డు, అన్నం, వెజిటబుల్స్, పప్పు పెట్టాలి. కానీ ఉడికీ ఉడకని అన్నం, తాలింపులేని పప్పు మాత్రమే పెట్టారు. గుడ్డు పెట్టడంపై స్పష్టత ఇంకా రాలేదు. ఈ విషయంపై నెల్లిమర్ల ఎమ్‌ఈఓ రాజు మాట్లాడుతూ ఉడకబెట్టిన గుడ్డును పాఠశాల పరిధిలోనే వండి పెట్టాలని, అదే విధంగా భోజన పంపిణీ పనికూడా స్థానికంగా చూసుకోవాలని చెప్పారు. ఆ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement