కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు
ఒంగోలు టౌన్: త్వరలో సీఎం ఇంటిని గంటెలు, పప్పుగుత్తులతో ముట్టడించనున్నట్లు మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి వెల్లడించారు. మ«ధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించకుండా యథావిధిగా తమతోనే కొనసాగించాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ పథకం కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ వద్దకు చేరుకొని లోపలికి వెళ్లేందుకు సన్నద్ధమైయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వారివద్దకు వచ్చి కొన్ని అంశాలకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన విరమించుకున్నారు.
6న చలో విజయవాడకు తరలిరావాలి
రాష్ట్రంలోని 85 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధిని దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఏపీ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డీ రమాదేవి ధ్వజమెత్తారు. తమను యథావిధిగా కొనసాగించి వేతనాలు పెంచాలని కోరుతూ ఆగస్టు 6వ తేదీ చలో విజయవాడలో భాగంగా సీఎం ఇంటిని ముట్టడించనున్నట్లు వెల్లడించారు. చలో విజయవాడకు రాకుండా పోలీసులు అడ్డుకుంటే అక్కడికక్కడ రోడ్లపై ధర్నాలు నిర్వహించాలని కోరారు. పదిహేను సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల కడుపు కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. కేవలం వెయ్యి రూపాయల వేతనంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని, నెలల తరబడి బిల్లులు నిలిచిపోయినప్పటికీ అప్పుచేసి కొంతమంది, పుస్తెలు తాకట్టుపెట్టి మరికొంతమంది మధ్యాహ్న భోజనం అందిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి మరింత ప్రోత్సాహకాలను అందించాల్సిన ప్రభుత్వం వారి ఉనికి లేకుండా చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. 25 కిలోమీటర్ల దూరంలో 25 వేల మందికి ఒకేసారి భోజనం అందించేందుకు స్వచ్ఛంద సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొందన్నారు.
ఏకీకృత వంటశాల పేరుతో ఉదయం పూట వండిన భోజనాన్ని 20 కిలోమీటర్ల దూరంలో ఉండే పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందిస్తే వాటిలో పోషక విలువలు ఉంటాయా అని ప్రశ్నించారు. వేడిగా ఉండే ఆహార పదార్థాలను విద్యార్థులకు అందిస్తే వారికి పోషక విలువలు అందుతాయని, చల్లారిన ఆహారం అందిస్తే 30 శాతం పోషక విలువలు తగ్గుతాయని వైద్యులు హెచ్చరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోషక విలువలు లేకుండా, కోడిగుడ్డు అందించకుండా ఆహారాన్ని అందిస్తే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంíపించడం తగ్గిస్తారని, పిల్లల సంఖ్య తక్కువగా ఉందని చివరకు ఆ పాఠశాలలను ప్రభుత్వం ఎత్తివేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.
స్వచ్ఛంద సంస్థకు ఈ పథకాన్ని అప్పగించడం వల్ల జిల్లాలో దానిపై ఆధారపడిన 5500 మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారన్నారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో చలో విజయవాడకు తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు నాగేశ్వరరావు, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కన్వీనర్ పెంట్యాల కల్పన, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మజుందార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment