వస్త్రాల మీద వంట చేసిన అన్నం వేసిన వైనం
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ సవ్యంగా అమలు కావడం లేదు. నిబంధనల ప్రకారం వారంలో అయిదు రోజుల పాటు గుడ్డు, మూడు రోజులు పప్పు, రెండు రోజులు కూరగాయలు, ఆరు రోజులు సాంబారు వడ్డించాలి. గుడ్డు సరఫరా చేసే కాంట్రాక్టు గడువు ఇటీవల పూర్తి కావడంతో వారు సరఫరాను నిలుపుదల చేశారు. ఏజెన్సీలే వాటిని సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అంత పెట్టుబడి పెట్టలేని ఏజెన్సీలు చేతులెత్తేయగా, ఆ భారం ప్రధానోపాధ్యాయుడిపై పడింది.
శ్రీకాకుళం: పిల్లలను బడిబాట పట్టించాలనే లక్ష్యంతో సర్కార్ బడుల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం తీరు నానాటికీ తీసికట్టుగా మారింది. లేని పోని నిబంధనలు తెరపైకి తేవడం, సకాలంలో వంట ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలు కూడా పథకం సక్రమంగా అమలు కాకపోవడానికి కారణాలుగా మారాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం నుంచి నేటి వరకు నిర్వహణ, ఇతర నిధులు విడుదలకాకపోవడంతో ఇప్పటికే వేలాది రూపాయలను ఖర్చు చేసిన ప్రధానోపాధ్యాయులు గుడ్లు కోసం ఖర్చు చేయలేక తలలు పట్టుకున్నారు. ఈ విషయమై ఆందోళన వస్తుండడంతో ప్రభుత్వం పాత కాంట్రాక్టర్‌కే మూడు నెలల గడువును పెంచింది. దీనివలన కొంత సమస్య తీరినా ప్రభుత్వం ఏజెన్సీలకు కొత్త మెలిక పెట్టింది. నూనె, పప్పు తామే సరఫరా చేస్తామని ఇందుకు అయ్యే మొత్తాన్ని విద్యార్థుల నుంచే తలసరి మొత్తం నుంచి మినహాయిస్తామని పేర్కొంది. ఈ సరఫరా సవ్యంగా జరగకపోవడంతో ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం ఒకటి నుంచి అయిదో తరగతి చదివే విద్యార్థికి రోజుకు రూ.6.48, హైస్కూల్, ఇంటర్ చదివే విద్యార్థులకు రోజుకు రూ.8.53 మంజూరు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రస్తుతం నిత్యావసర ధరలకు అనుగుణంగా లేదని ఏజెన్సీలు మొత్తుకుంటున్నా పట్టించుకొనే నాథుడే లేకుండా పోయాడు.
ఏజెన్సీలకు రెండు నెలల బకాయి
జిల్లాలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రభుత్వం రెండు నెలలకు సంబంధించిన బిల్లులు బకాయి పడింది. జిల్లాలో 3,154 పాఠశాలలు, 14 మోడల్ స్కూళ్లు, 42 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతోంది. వీటి పరిధిలో 2.50 లక్షల మంది విద్యార్థులు ఉండగా, 2.30 లక్షల మంది భోజనం చేస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతోంది. వంట కార్మికునికి నెలకు వెయ్యి రూపాయలు వేతనం ఇస్తుండగా, అదికూడా సకాలంలో చెల్లించడం లేదు. వారికి కూడా మూడు నెలల బకాయి ఉంది. వీరికి జీతం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులు సకాలంలోనే వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ వాటా ఆలస్యంగా వస్తుండడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.
శ్రీకాకుళంలో రెండు కళాశాలల్లో అమలు కాని భోజన పథకం
జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల్లో ఇప్పటికీ మధ్యాహ్న భోజనం అమలు కావడం లేదు. ఈ రెండు కళాశాలల్లోనూ ఒక్కో దానిలో 1500 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. కళాశాలల్లో భోజనాలు వండకుండా సమీపంలోని పాఠశాలల నుంచి భోజనాలు తెచ్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంతమంది విద్యార్థులకు తాము వండలేమని సమీపంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెప్పడంతో మధ్యాహ్న భోజనం అమలుకావడం లేదు. అయినా జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖాధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తూ తాము ఏం పాపం చేశామో తెలియకపోయినా భోజనాన్ని సరఫరా చేయడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇలా మధ్యాహ్న భోజన పథకం అస్తవ్యస్తంగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment