భోజనం పెట్టేదెలా.! | Midday Meal Scheme Delayed in YSR Kadapa | Sakshi
Sakshi News home page

భోజనం పెట్టేదెలా.!

Published Tue, Apr 23 2019 1:52 PM | Last Updated on Tue, Apr 23 2019 1:52 PM

Midday Meal Scheme Delayed in YSR Kadapa - Sakshi

భోజనం వడ్డిస్తున్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు (ఫైల్‌)

మధ్యాహ్న భోజనం అందించే ఏజెన్సీల నిర్వాహకుల ఆకలి కేకలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. పాఠశాలల విద్యార్థులకు వీరు అప్పు చేసి పప్పు అన్నం పెడుతున్నారు. నాలుగైదు నెలల నుంచి బిల్లులు అందలేదు. బుధవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో తమ బిల్లుల పరిస్థితి ఏమిటని ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు టౌన్‌ :  జిల్లాలో 2,585కుపైగా ప్రాథమిక పాఠశాలల్లో 92 వేల మందికిపైగా విద్యార్థులు, 280కిపైగా  ప్రాథమికోన్నత పాఠశాలల్లో 18వేల మంది,  391 ఉన్నత పాఠశాలల్లో 92,769 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరంతా ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న వారే. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు నాలుగైదు నెలలుగా భోజనం బిల్లులు చెల్లించడం లేదు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా నెలకు రూ.10వేల నుంచి రూ.50వేలకు పైగా బిల్లులు అవుతున్నాయి.

రూ.కోట్లలో బకాయిలు..
ప్రభుత్వం భోజనం బిల్లులు ఇవ్వకపోవడంతో ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బిల్లులు ఎప్పుడు వస్తాయోనని ఏజెన్సీ నిర్వాహకులు ఎదురు చూస్తున్నారు. అప్పు చేసి రూ.లక్షకుపైగా తెచ్చామని మరి కొందరు ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. ఒక్కో వంట ఏజెన్సీకి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏజెన్సీ నిర్వహిస్తే కుటుంబ పోషణకు పదో పరకో వస్తుందని అనుకున్న ఏజెన్సీల నిర్వాహకులు చివరకు అప్పుల పాలవుతున్నారు.

రేపటి నుంచి పాఠశాలలకు  వేసవి సెలవులు..
ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది.  జూన్‌ నెల 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐదు నెలలుగా ఎదురు చూసి బిల్లులు వస్తాయని అనుకున్న ఏజెన్సీలకు జూన్‌ 12వ తేదీ దాటితే కానీ బిల్లులు రావని అనుకుంటున్నారు. ఈ విధంగా మరో రెండు నెలలు బిల్లుల కోసం ఆగాల్సిన పరిస్థితి ఏజెన్సీ నిర్వాహకులకు ఏర్పడబోతోంది. ఈ విధంగా  అయితే ఏజెన్సీలను నిర్వహించబోమని, రూ.లక్షలు అప్పు చేసి రోడ్లపాలు కాబోమని మరి కొందరు చెబుతున్నారు. విద్యార్థులకు భోజనం పెడుతూ వారి ఆకలిని తీరుస్తున్న ఏజెన్సీలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ఈ విధంగా తమకు బిల్లులు చెల్లించడం లేదని కొందరు ఏజెన్సీల వారు వాపోతున్నారు.

రూ.లక్షకు పైగా అప్పు చేశాను
పట్టణంలోని 2వ వార్డు మున్సిపల్‌ హైస్కూల్‌లో వంట ఏజెన్సీని నిర్వహిస్తున్నాను. ప్రభుత్వం ఏజెన్సీలకు ఇవ్వాల్సిన బిల్లులు నాలుగు నెలల నుంచి చెల్లించడం లేదు. దీంతో నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు భోజనం ఖర్చు అవుతుంది. ఇప్పటికే నేను రూ.లక్షకు పైగా వడ్డీకి తీసుకొచ్చి ఏజెన్సీని నిర్వహిస్తున్నా. బుధవారం నుంచి వేసవి సెలవులు ఉన్నాయి. ఇప్పటికీ బిల్లులు రాకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి.  –ఎ.జయలక్ష్మి, 2వ వార్డు మున్సిపల్‌ హైస్కూల్‌ వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, ప్రొద్దుటూరు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement