బద్వేలు ఉన్నత పాఠశాలలో వంట చేస్తున్న నిర్వాహకురాలు
వైఎస్‌ఆర్ జిల్లా, బద్వేలు: సంపాదించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వ నేతల చూపు ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకంపై పడింది. ఏజెన్సీల కడుపు కొడుతూ పప్పులు, నూనెలు సరఫరాను కంట్రాక్టర్లకు అప్పగించారు. అరకొర జీతా లతో ఇబ్బంది పడుతున్న వంట ఏజెన్సీల కడుపు కొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సరుకులను ప్రయివేట్ సరఫరాను ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పగించడంపై వారుమండిపడుతున్నారు. సరుకులు సరఫరా చేస్తే వడ్డించేందుకు తమకు జీతాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీనికి తోడు వారికి ఇవ్వాల్సిన గౌరవవేతనాలు నెలవారీ అందడం లేదు. ప్రస్తుతం నాలుగు నెలల బకాయిలు రూ.5.5కోట్లు అందాల్సి ఉంది.
పేద విద్యార్థులకు ఒక పూటైనా నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో పథకం ఆధ్వానంగా మారుతోంది. ఇప్పటికే నెలల తరబడి బిల్లుల పెండింగ్ పెటట్టడంతో ఇక్కట్లు పడుతున్న వంట ఏజెన్సీలకు రాష్ట ప్రభుత్వం కడుపుకోడుతోంది. నవంబరు ఒకటి నుంచి మధ్యాహ్న భోజనానికి అవసరమైన సరుకుల సరఫరాను ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించారు. సకాలంలో బకాయిలు అందక అప్పుల చేయలేక చాలా ఏజెన్సీలు వంట వండేందుకు ముందుకు రావడం లేదు. సరుకుల పంపిణీ బాధ్యతనూ ప్రయివేట్‌కు అప్పగిస్తే వంట చేసేవారికి కూలీ కూడా గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంటోందని వారు వాపోతున్నారు. ఇదే జరిగితే చాలా మంది మానుకుంటామని చెబుతున్నారు.
రూ.2 వరకు కోత
పప్పు, మసాల దినుసులు, కూరగాయలు నిర్వాహకులు కొనుగోలు చేసి గ్యాస్‌పై వంట చేసి వడ్డించిన నిమిత్తం ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.4.13, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6.18 చెల్లిస్తున్నారు. కానీ కందిపప్పు, నూనె సరఫరా చేస్తున్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.1.38, ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.2.07 చొప్పున కట్ చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2.13, ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.4.50 మాత్రమే అందించనున్నారు.
బేడలు, నూనె సరఫరా
ఈ నెల ఒకటో తేదీ నుంచి మధ్యాహ్న భోజనానికి వినియోగించే కందిబేడలు, వంటనూనెను ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి. దీంతో భోజన ఏజెన్సీలకు అందించే బిల్లులో 30 శాతం వరకు కోత విధిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతీసారి బిల్లులు తగ్గిపోతే తమకు ఎలా గిట్టుబాటు అవుతుందని వంట నిర్వాహకులు వాపోతున్నారు.
పచారికొట్టోళ్లమా...
మధ్యాహ్న భోజనానికి సంబంధించి కందిపప్పు, నూనెను ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి. సరుకులు వచ్చిన సమయంలో వాటిని లెక్క చూసుకోవాలంటే ఒక పూట పాఠాలు వదిలి వాటిని చూచుకోవడానికే సరిపోతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అనంతరం ప్రతి రోజు వచ్చిన విద్యార్థుల సంఖ్యను బట్టి వంట ఏజెన్సీలకు కొలిచి ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి 100 గ్రామల చొప్పున బియ్యం, ఐదు గ్రామలు నూనె, 20 గ్రాముల చొప్పున కందిబేడలు, ఉన్నత పాఠశాల విద్యార్థికి150 గ్రామలు బియ్యం, 7.5 గ్రామలు నూనె, 30 గ్రాముల కందిపప్పు ఇవ్వాలి. ఐదు రోజుల పాటు కోడిగుడ్లు అందించాలి. ఈ సరుకులను కొలిచి ఇవ్వడానికి, ఏ రోజుకారోజు వాటిని అన్‌లైన్లో అప్‌లోడ్ చేయడానికి రెండు నుంచి మూడు పీరియడ్ల సమయం అవసరమవుతుందని ఉపాధ్యాయలు వాపోతున్నారు.
కష్టానికి తగ్గ ఫలితం లేదు
పాఠశాలలో విద్యార్థులకు వంట చేస్తున్న మేం పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు. దీనికి తోడు కందిపప్పు, నూనెల సరఫరా పేరుతో కుకింగ్ చార్జీలను తగ్గిస్తే మాకు నష్టం తప్ప లాభం లేదు. ఎంతో కష్టపడి వంటలు చేసి వడ్డిస్తున్న మాకు కనీస కూలి కూడా పడటం లేదు. నిర్ధిష్ట జీతాలు ఇస్తే బాగుంటుంది.– అంజమ్మ, వంట నిర్వాహకురాలు. జడ్పీహైస్కూల్, బద్వేల
Comments
Please login to add a commentAdd a comment