జీతాలు, బిల్లులివ్వకుండా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వంపై మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు కన్నెర్ర చేశారు. బిల్లుల పెండింగ్‌పై సమ్మె బాట పట్టారు. మంగళవారం అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు.
నెల్లూరు(టౌన్): జిల్లాలో 2,611 ప్రాథమిక, 380 ప్రాథమికోన్నత, 413 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో 1,21,297 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 61,299 మంది, ఉన్నత పాఠశాలల్లో 37,540 మంది విద్యార్థులు భోజనం తీసుకుంటున్నారు. నెల్లూరు అర్బన్ ప్రాంతంలోని 111 పాఠశాలల్లో ఇస్కాన్ పథకాన్ని అమలు చేస్తుండగా, గూడూరు, వెంకటాచలం, మనుబోలు, ముత్తుకూరు ప్రాంతాల్లోని 291 పాఠశాలల్లో అక్షయపాత్ర సంస్థ భోజనం పెడుతోంది. మిగిలిన చోట్ల పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో పథకాన్ని నిర్వహిస్తున్నారు.
నిలిచిన బిల్లులు
జిల్లా వ్యాప్తంగా మూడువేలకు పైగా మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీలున్నాయి. కొంతకాలం క్రితం జీతాలు, బిల్లుల చెల్లింపులు నిలిపివేయడంతో వారు ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వం రెండు నెలలకు సంబంధించిన జీతాలు, మూడు నెలలకు సంబంధించిన బిల్లులు చెల్లించింది. ఇంకా ఐదు నెలల జీతాలు, నాలుగు నెలల బిల్లులు నిలచిపోయాయి. జిల్లాలో సుమారు రూ.1.20 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏజెన్సీలు నిర్వహిస్తోంది పేద మహిళలు కావడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భోజనం పెట్టకపోతే ప్రభుత్వం ఏజెన్సీని రద్దు చేస్తుందనే భయంతో రూ.5 వడ్డీకి అప్పు తెచ్చి భోజనం పెడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీరి గురించి పట్టించుకోవడం లేదు.
స్పందించే వరకు..
పెండింగ్‌లో ఉన్న జీతాలు, భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని మంగళవారం ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు నిరంతరాయంగా సమ్మె చేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.
బిల్లులు వెంటనే చెల్లించాలి
పేద మహిళలే మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు బిల్లులిస్తుందో తెలియని పరిస్థితి ఉంది. డీఈఓని వెళ్లి కలిశాం. ఆయన ప్రతినెలా మొదటి ఆదివారం సమావేశాన్ని పెట్టాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. అయితే ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా జరగలేదు. వెంటనే బిల్లులు చెల్లించాలి.
– రెహానాబేగం, మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ గౌరవాధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment