గోవాడ స్కూల్‌కు నవప్రయాస్ పంపిన భోజనం ఆకలి తట్టుకోలేక పాడైన అన్నమే ఇబ్బందిగా తింటున్న విద్యార్థులు
విశాఖపట్నం, చోడవరం: పాడైపోయిన భోజనం తినలేమంటూ గోవాడ హైస్కూల్ విద్యార్థులు మధ్యాహ్నం ఆకలితోనే ఉండిపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ఈనెల 1వ తేదీ నుంచి మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణ ‘నవప్రయాస్’అనే ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. రోజూలాగే గురువారం కూడా గోవాడ జెడ్పీ హైస్కూల్‌కు నవ ప్రయాస్ సంస్థ నుంచి ఉదయం 10 గంటకు మధ్యాహ్నం భోజనం క్యారేజీల్లో వచ్చింది. ఒంటి గంటకు స్కూల్ బెల్ కాగానే విద్యార్థులంతా భోజనానికి సిద్ధమయ్యారు. భోజన క్యారేజీలు తెరవగానే అన్నం దుర్వాసన వస్తుందంటూ విద్యార్థులంతా భోజనం చేయడం మానేశారు. ఈ స్కూల్‌కు గోవాడతోపాటు పరిసర 8 గ్రామాల నుంచి 10 కిలోమీటర్ల దూరం నుంచి 700మంది విద్యార్థులు వస్తుంటారు. వీరంతా ప్రతీ రోజూ మధ్యాహ్నం భోజనం ఈ స్కూల్‌లోనే చేస్తారు. ఇలాంటి పరిస్థితిలో నవప్రయాస్ పంపిన భోజన పాడైపోవడంతో ఆ విద్యార్థులంతా ఆకలితో మలమలమాడారు.
ఇళ్లకు వెళదామంటే చాలా దూరం కావడంతో కొందరు ఆ పాడైపోయిన భోజనమే చేయగా మిగతా వారంతా ఆకలితో ఉండిపోయారు. వసతి గృహాల విద్యార్థులు కూడా ఈ పాఠశాలకే రావడంతో వారు కూడా స్కూల్‌లోనే భోజనం చేయాల్సి ఉంది. కాని విద్యార్థులంతా భోజనం చేయకుండా ఉండిపోవడంతో స్థానికులంతా కలిసి ఇక్కడి వసతి గృహంలో అత్యవసరంగా వంట చేయించి విద్యార్థులకు భోజనం పెట్టారు. మధ్యాహ్నం 3గంటల వరకు విద్యార్థులంతా ఆకలితో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు భోజనం లేక చాలా ఇబ్బంది పడ్డారు. గతంలో మాదిరిగానే పాఠశాలలోనే భోజనం వండి పెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నవప్రయాస్ సంస్థ తెచ్చిన పాడైపోయిన భోజనాలను వెనక్కి తీసుకెళ్లిపోతుండగా స్థానికులు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారని ఉపాధ్యాయులు ఎంఈవో దృష్టికి తీసుకువెళ్లారు.
భోజనం చేయకుండా నిరసన
చీడికాడ: నవ ప్రయాస్ సంస్థ అందిస్తున్న భోజ నం పాడైపోవడంతో మండలంలోని తురువో లు, చీడికాడ, బైలపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులు భోజనాలు తినకుండా నిరసన వ్యక్తం చేశా రు. తమ సమస్యను 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. నవప్రయాస్ అందిస్తున్న మధ్యాహ్న భోజనం రెండు రోజులుగా బైలపూడి ఉన్నత పాఠశాలకు పాడైన భోజనం సరఫరా చేస్తుండడంతో విద్యార్థులు వెనక్కి పంపిస్తున్నారు. చీడికాడ ఉన్నత పాఠశాల విద్యార్థులు భోజనాలు చేయకుండా గురువారం నిరసనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నేత దేముడునాయుడు ఎంఈవో గంగరాజుకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. తురువోలు విద్యార్థులు పాడైన భోజన పదార్థాలను బేసిన్‌లో వేసి కుక్కకు పెట్టగా అది ముట్టకపోవడంతో ఆ ఫొటో తీసి 1100కి ఫిర్యాదు చేసినట్టు విద్యార్థులు జి.గీతమా, వెంకటలక్ష్మీ, ధనుషా, సు«ధీర్, విశాలక్ష్మి తెలిపారు. భోజనాలను పాఠశాలల్లోనే తయారు చేయాలని విద్యార్థులు కోరారు.
మళ్లీ ఆమరణ దీక్ష చేపట్టిన నిరుద్యోగులు
అరకులోయ: ఒడిశా, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌తో ఐదుగురు నిరుద్యోగులు ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష శిబిరంలో ఆందోళనకారుల ఆరోగ్యం క్షీణించడంతో మాచ్‌ఖండ్ పోలీసులు బుధవారం వారికి వైద్యసేవలు కల్పించారు. కోరాపుట్ జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందిన వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో రాత్రికి ఒనకఢిల్లీ చేరుకుని గురువారం ఉదయం మళ్లీ ఆమరణ దీక్షను కొనసాగించారు. సంఘ నాయకులు ఉమేష్‌చంద్ర పాత్రో,సనాయి బాద్‌నాయక్,జోగేష్ కిల్లో,ఎండీ జమాలుద్దీన్, సురజ్‌కుమార్ మహరియాలు దీక్ష చేస్తున్నారు. ఆమరణ దీక్ష చేపట్టడంతో మాచ్‌ఖండ్ పవర్ ప్రాజెక్ట్ సెక్యూరిటీ అధికారి గురువారం దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఆందోళన గురించి మాచ్‌ఖండ్ బోర్డు అధికారులకు తెలియజేస్తానని,దీక్షను విరమించాలని కోరారు. అయినా ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment