నర్సాపూర్‌రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని డీఈఓ రమేశ్ హెచ్చరించారు. గురువారం మండలంలోని రుస్తుంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతు రుస్తుంపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం వంటచేసి వడ్డిస్తున్నప్పటికీ రోజువారీ రికార్డుల నిర్వహణ సరిగా లేదన్నారు.
అలాగే విద్యార్థులకు మీనా ప్రపంచం కోసం రేడియోలు కేటాయించినా ఉపయోగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు నర్సింలు అందుబాటులో లేకపోవడంతో ఆయన వివరణ తీసుకున్న అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉన్నత పాఠశాలలో నిర్వహణ కోసం ఆర్వీఎం ద్వారా 17వేలతోపాటు ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా మరో 15వేలు మంజూరు చేసినప్పటికీ రేడియోల్లో సెల్స్ లేవనే సాకు చూపి వాటిని ఉపయోగించడం లేదని తనిఖీలో వెల్లడైందన్నారు. బీహార్‌లో మధ్యాహ్న భోజనం తిని మృతి చెందిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తనతోపాటు డిప్యూటీ డీఈఓలు, ఎంఆర్‌ఓలు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ఇన్‌చార్జిలు ప్రతివారం జిల్లాలోని ఏదో ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు
జిల్లాలో 15ఏళ్ల తరువాత ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలతోపాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 30,31న మండల స్థాయిలో క్రీడాపోటీలు ఉంటాయని, వచ్చేనెల 3,4 తేదీల్లో నియోజకవర్గ స్థాయి, 12,13,14తేదీల్లో జిల్లాస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు.
115 ప్రాథమికోన్నత పాఠశాలల మరమ్మతులకు నిధులు మంజూరు
జిల్లాలోని 115 ప్రాథమికోన్నత పాఠశాల భవనాల మరమ్మతుల కోసం ఒక్కో పాఠశాలకు రూ.2లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని జిల్లా విద్యాధికారి తెలిపారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ప్రజల భాగస్వామ్యంతో గుర్తిస్తామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సులేమాన్ నజీబ్ తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీని సందర్శించిన డీఈఓ
జిన్నారం, న్యూస్‌లైన్: జిన్నారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యా కేంద్రాన్ని (కేజీబీవీ) గురువారం జిల్లా విద్యాధికారి రమేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రత్యేకాధికారి నరసింహులు పాత కేజీబీవీ భవనంలో వసతులు సరిగా లేనందున కొత్త భవనంలోకి మార్చేందుకు అనుమతి ఇవ్వాలని డీఈఓను కోరారు. దీనిపై స్పందించిన డీఈఓ నిర్మాణ పనులు పూర్తయిన కేజీబీవీ భవనాన్ని సందర్శించారు. పాత భవనంలో ఉన్న సమస్యలను నరసింహులు డీఈఓకు వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ రమేశ్ మాట్లాడుతూ మూడు రోజుల్లో నూతన భవనంలోకి విద్యార్థులను తరలించేందుకు చర్యలు చేపడతామన్నారు. పాత భవనంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. నూతన భవనంలో విద్యార్థులు ఎలాంటి సమస్యలు లేకుండా చదువుకోవచ్చన్నారు.