DEO Ramesh
-
పాఠశాలలను పచ్చదనంతో నింపుతాం
వికారాబాద్ రూరల్ : జిల్లాలోని పాఠశాలలను పచ్చదనంగా మారుస్తామని, అందుకోసం ఉపాధ్యాయులు కంకణబద్ధులు కావాలని డీఈఓ రమేష్ అన్నారు. శుక్రవారం స్థానిక మేరరీ ఏ నాట్స్ పాఠశాలలో డివిజన్లోని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో హరితహారంపై సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల ఆవరణ మొత్తం పచ్చదనంతో కళకళలాడేలా చేయాలని ఉపాధ్యాయులకు సూచించినట్టు చెప్పారు. ప్రతి విద్యార్థికి ఒక మొక్కను దత్తత ఇచ్చి వాటి సంరక్షణ అప్పగిస్తామన్నారు. మొక్కలకు కూడా పుట్టిన రోజు జరిపేలా చూస్తామన్నారు. పాఠశాలలో ఎన్జీసీ( నేషనల్ గ్రీనరీ క్రాప్) ఏర్పాటు చేసి హరితదళం ఏర్పాటు చేస్తామన్నారు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్క్స కింద 5 మార్కులు ఇస్తామని చెప్పారు. ఆగస్టున 15న మొక్కలను సంరక్షించిన పాధ్యాయులకు క్యాష్ బహుమతులతో పాటు హరితమిత్ర అవార్డును అందిస్తామని డీఈఓ చెప్పారు. పాఠశాలలకు 1412 వంట గదులు మంజూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వంటకు ఇ ఇబ్బందులు లేకుండా 1412 వంట గదులు మంజూరు చేసినట్టు డీఈఓ చెప్పారు. ఇందులో 100 మందిలోపు విద్యార్థులున్న దానికి రూ. 1.36లక్షలు, 101 నుంచి 200 మంది విద్యార్థులుంటే రూ. 1.86 లక్షలు, 201 నుండి 500 మంది విద్యార్థులుంటే రూ. 2.75 లక్షలు, 500పైన ఉంటే 3.35 లక్షలు ఖర్చు చేస్తాన్నారు. 1498 మంది విద్యావలంటీర్ల నియామకం ప్రస్తుతం 1498 మంది విద్యావలంటీర్లను నియమించినట్టు డీఘో రమేష్ తెలిపారు. పాఠశాల ప్రారంభ సమయంలో ఉన్న 274 మంది విద్యావలంటీర్లను కలుపుకుని కొత్తగా 1224 మందిని భర్తీ చేశామన్నారు. ఎక్కువగా బషీరాబాద్ మండలంలో 112 మంది, మర్పల్లి మండలంలో 98 మంది విద్యావలంటీర్లను నియమించినట్టు చెప్పారు. జిల్లాలోని 595 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించామన్నారు. ఉపాధ్యాయులు ఇతర బిజినెన్స్లు చేయకూడదని ఆదేశాలు ఉన్నాయన్నారు. అనంతరం ధన్నారంలోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, ఎంఈఓ గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ఈ ఏడాది సరికొత్త విధానంలో టెన్త పరీక్షలు జరుగనున్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిలో 80శాతం పబ్లిక్ పరీక్షల ద్వారా, 20 శాతం అంతర్గత పరీక్షల ద్వారా విద్యార్థి ప్రతిభను గుర్తిస్తున్నాం. జిల్లాలో వందశాతం ఫలితాలు సాధించేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: మార్చి 25 నుంచి జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నామని డీఈఓ రమేష్ స్పష్టం చేశారు. విద్యాశాఖ రూపొం దించిన ప్రణాళిక అంశాలను ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకు సరికొత్త ప్రణాళికను అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి పదో తేదీ వరకు అన్ని పాఠశాలల్లో పాఠ్యాంశ బోధన పూర్తవుతుంది. ఆ తర్వాత 45 రోజుల సమయంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశ పునఃశ్చరణ చేపడుతున్నాం. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ఈ తరగతులు కొనసాగిస్తాం. ప్రతి పాఠశాలలో ప్రత్యేకం.. ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెకులో ప్రతి యూనిట్ నుంచి ఇరవై అంశాలతో కూడిన ప్రశ్ననిధిని తయారు చేసుకోవాలని ఆదేశించాం. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా తన సబ్జెకుపై ఇలాంటి ప్రశ్నానిధిని తయారు చేస్తూ.. ఉపాధ్యాయులు తయారుచేసిన ప్రశ్నావళిని పర్యవేక్షించాలి. ఒక పాఠశాలలో తయారుచేసిన వాటికి, మరో పాఠశాలలో తయారుచేసిన ప్రశ్నానిధికి సంబంధం లేకుండా పకడ్బందీగా తయారయ్యేలా చూస్తున్నాం. వీటిని ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు బోధించాలి. కానీ బట్టీ విధానాన్ని మాత్రం ప్రోత్సహించకూడదు. గ్రేడ్ తగ్గినా.. ఉత్తీర్ణత పెరిగేలా.. కొత్త విధానంతో విద్యార్థులు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ పద్ధతితో విద్యార్థి పాఠ్యాంశంపై మంచి పట్టు సాధించవచ్చు. దీంతో భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ తొలిఏడాది గ్రేడ్లలో కొంత వెనకబడొచ్చు. కానీ ఉత్తీర్ణత శాతం మాత్రం గతేడాది కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాం. బోధనలో ప్రత్యేక చొరవ చూపి ఉత్తమ ఫలితాలు సాధించిన టీచర్లను ప్రత్యేకంగా అభినందిస్తాం. అదేవిధంగా పనితీరు అధ్వాన్నంగా ఉన్న వారిపై నిర్మొహమాటంగా చర్యలు తీసుకుంటాం. సహకారమే ముఖ్యం పాఠశాలలో ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. ఇదే తరహాల్లో ఇంటివద్ద కూడా తల్లిదండ్రులు చదివించాలి. ఎలాంటి పనులు చెప్పకుండా వారికి స్వేచ్ఛ ఇస్తే మంచింది. ఈ అంశాన్ని వారికి వివరించేందుకు ఈనెల పదో తేదీలోగా అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాల్సిందిగా ఆదేశించాం. ప్రతి పాఠశాలలో ప్రతిభలో వెనకబడిఉన్న విద్యార్థులను అడాప్ట్ (దత్తత) చేసుకుని బోధన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాం. పలుపాఠశాలల్లో ఈ పద్ధతి కొనసాగిస్తున్నారు. వెనకబడిన విద్యార్థుల తల్లిదండ్రులతోనూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. పక్కాగా పరీక్షలు.. ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు మరింత పకడ్బందీగా నిర్వహిస్తాం. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తాం. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే విద్యార్థితోపాటు సంబంధిత ఇన్విజిలేటర్పైనా కఠిన చర్యలు తీసుకుంటాం. మార్చి రెండో తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్ష ముగిసిన తర్వాత యధావిధిగా ప్రత్యేక తరగతులు, రివిజన్ ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 24 వరకు తప్పకుండా విద్యార్థులు బడికి హాజరు కావాల్సిందే. విద్యార్థుల కోసమే.. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలలో గడపాల్సి వస్తోంది. మధ్యాహ్నం భోజనం చేసినప్పటికీ ఎదిగే పిల్లలు కావడంతో సాయంత్రానికి ఆకలి వేస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు స్థానికంగా ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల సహకారం కోసం లేఖలు రాశాం. వారు స్పందిస్తూ విద్యార్థులకు స్నాక్స్ అందించేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లాలోని 437 ఉన్నత పాఠశాలలకు ఈ లేఖలు అందించా. జిల్లా విద్యాశాఖ తరఫున ఇచ్చే ఈ లేఖల్లో వారి పేర్లు, చిరునామా రాస్తున్నాం. కొత్త విధానమిదే.. పదో తరగతి పరీక్షల విధానంలో భారీ మార్పులు జరిగాయి. గతంలో వందమార్కులకు పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాదినుంచి కేవలం 80 మార్కులకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్నాం. మిగతా 20మార్కులు విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి నిర్వహించిన ఫార్మెటీవ్ 1,2,3,4ల ఆధారంగా మార్కులు వేస్తాం. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ప్రశ్నాపత్రాన్ని చదువుకునేందుకు ప్రత్యేకంగా 15నిమిషాల సమయాన్ని కేటాయించారు. హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుంటాయి. ఈ క్రమంలో ఒక పేపర్‌కు 40 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నాలుగు పెద్ద ప్రశ్నలు (4మార్కుల చొప్పున), ఆరు చిన్న ప్రశ్నలు (రెండు మార్కులు), ఏడు వ్యాఖ్య ప్రశ్నలు(ఒక మార్కు) చొప్పున 35 మార్కులు, మరో ఐదు మార్కులు ఆబ్జెక్టీవ్ పద్ధతిలో ఉంటాయి. -
బడులను గుడులుగా మార్చాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: డీఈఓ రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ బోధనపరంగానే గాకుండా విద్యార్థులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక భూమికన్నారు. పవిత్రమైన, ఆదర్శవంతమైన వృత్తికి న్యాయం చేయాలని ఆమె సూచించారు. ప్రతి గ్రామంలో గుడి బడి రెండూ ఉంటాయని, బడులను గుడులుగా మార్చాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. కనిపించని దైవం గుడిలో ఉంటే.. కనిపించే దైవం బడిలో ఉంటారని తెలిపారు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, సంస్కృతిని నేర్పేందుకు కృషి చేయాలని సూచించారు. నేటి యువత పాశ్చాత్య సంస్కృతికి గురవుతూ గ్రామీణ వాతావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు, నేరాలు పెరుగుతున్నాయని, విద్యార్థులకు నీతి నిజాయితీతో కూడిన విలువలను బోధించాలన్నారు. రూ.6 వేల కోట్లతో మౌలిక వసతులు.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాప్రమాణాలు పెంపొం దించేందుకు కృషి చేస్తోందని, పాఠశాలల్లో మౌ లిక వసతులు కల్పించేందుకు 2012-13 విద్యా సంవత్సరంలో రూ.6వేల కోట్లు ఖర్చు చేసింద ని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల మనుగడను కాపాడుకునేలా సమష్టి కృషితో పనిచేయాలని సూచించారు. సన్మానం పొంది న ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పని చేసి పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఉపాధ్యాయుల కృషి భేష్.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు చేయూతనందించేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులు ‘స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్’ పేరిట ముందుకు రావడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో మెరుగైన స్థానం పొందేందుకు కృషి చేయాలన్నారు. మనుగడ కోసం సమష్టిగా కదలాలి: కలెక్టర్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాధించాలంటే ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే సాధ్యమని కలెక్టర్ దినకర్‌బాబు సూచించారు. సమాజంలో గురువులకు సముచిత స్థానం ఉన్నా కాలానుగుణంగా తగ్గిందని, దాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రణాళికతో ముందుకు వెళ్తే మెరుగైన ఫలితాలు సాధ్యమన్నారు. ప్రభుత్వం 2012-13లో వె య్యికి పైగా అదనపు గదుల నిర్మాణం చేపట్టిందన్నారు. అదనపు జేసీ మూర్తి మాట్లాడుతూ విద్యార్థుల ను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సాం స్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉ పాధ్యాయులుగా ఎంపికైన 55 మందికి మంత్రి సునీతారెడ్డి మొక్కలు, జ్ఞాపికలు అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఇన్చార్జి ఆర్డీఓ ప్రసా ద్, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ పీసీపీ రాజు, ఐసీడీఎస్ పీడీ శైలజ, డిప్యూటీ ఈఓలు, ఎంఈ ఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘మధ్యాహ్న’ పథకంపై నిర్లక్ష్యం తగదు
నర్సాపూర్‌రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని డీఈఓ రమేశ్ హెచ్చరించారు. గురువారం మండలంలోని రుస్తుంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతు రుస్తుంపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం వంటచేసి వడ్డిస్తున్నప్పటికీ రోజువారీ రికార్డుల నిర్వహణ సరిగా లేదన్నారు. అలాగే విద్యార్థులకు మీనా ప్రపంచం కోసం రేడియోలు కేటాయించినా ఉపయోగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు నర్సింలు అందుబాటులో లేకపోవడంతో ఆయన వివరణ తీసుకున్న అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉన్నత పాఠశాలలో నిర్వహణ కోసం ఆర్వీఎం ద్వారా 17వేలతోపాటు ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా మరో 15వేలు మంజూరు చేసినప్పటికీ రేడియోల్లో సెల్స్ లేవనే సాకు చూపి వాటిని ఉపయోగించడం లేదని తనిఖీలో వెల్లడైందన్నారు. బీహార్‌లో మధ్యాహ్న భోజనం తిని మృతి చెందిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తనతోపాటు డిప్యూటీ డీఈఓలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ఇన్చార్జిలు ప్రతివారం జిల్లాలోని ఏదో ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు జిల్లాలో 15ఏళ్ల తరువాత ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలతోపాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 30,31న మండల స్థాయిలో క్రీడాపోటీలు ఉంటాయని, వచ్చేనెల 3,4 తేదీల్లో నియోజకవర్గ స్థాయి, 12,13,14తేదీల్లో జిల్లాస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. 115 ప్రాథమికోన్నత పాఠశాలల మరమ్మతులకు నిధులు మంజూరు జిల్లాలోని 115 ప్రాథమికోన్నత పాఠశాల భవనాల మరమ్మతుల కోసం ఒక్కో పాఠశాలకు రూ.2లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని జిల్లా విద్యాధికారి తెలిపారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ప్రజల భాగస్వామ్యంతో గుర్తిస్తామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సులేమాన్ నజీబ్ తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీని సందర్శించిన డీఈఓ జిన్నారం, న్యూస్‌లైన్: జిన్నారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యా కేంద్రాన్ని (కేజీబీవీ) గురువారం జిల్లా విద్యాధికారి రమేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రత్యేకాధికారి నరసింహులు పాత కేజీబీవీ భవనంలో వసతులు సరిగా లేనందున కొత్త భవనంలోకి మార్చేందుకు అనుమతి ఇవ్వాలని డీఈఓను కోరారు. దీనిపై స్పందించిన డీఈఓ నిర్మాణ పనులు పూర్తయిన కేజీబీవీ భవనాన్ని సందర్శించారు. పాత భవనంలో ఉన్న సమస్యలను నరసింహులు డీఈఓకు వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ రమేశ్ మాట్లాడుతూ మూడు రోజుల్లో నూతన భవనంలోకి విద్యార్థులను తరలించేందుకు చర్యలు చేపడతామన్నారు. పాత భవనంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. నూతన భవనంలో విద్యార్థులు ఎలాంటి సమస్యలు లేకుండా చదువుకోవచ్చన్నారు.