100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం | 100 percent Eligibility is the target | Sakshi
Sakshi News home page

100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

Published Sat, Feb 7 2015 12:53 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం - Sakshi

100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

ఈ ఏడాది సరికొత్త విధానంలో టెన్‌‌త పరీక్షలు జరుగనున్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిలో 80శాతం పబ్లిక్ పరీక్షల ద్వారా, 20 శాతం అంతర్గత పరీక్షల ద్వారా విద్యార్థి ప్రతిభను గుర్తిస్తున్నాం. జిల్లాలో వందశాతం ఫలితాలు సాధించేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం.      
 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మార్చి 25 నుంచి జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నామని డీఈఓ రమేష్  స్పష్టం చేశారు. విద్యాశాఖ రూపొం దించిన ప్రణాళిక అంశాలను ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకు సరికొత్త ప్రణాళికను అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి పదో తేదీ వరకు అన్ని పాఠశాలల్లో పాఠ్యాంశ బోధన పూర్తవుతుంది. ఆ తర్వాత 45 రోజుల సమయంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశ పునఃశ్చరణ చేపడుతున్నాం. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ఈ తరగతులు కొనసాగిస్తాం.

ప్రతి పాఠశాలలో ప్రత్యేకం..

ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెకులో ప్రతి యూనిట్ నుంచి ఇరవై అంశాలతో కూడిన ప్రశ్ననిధిని తయారు చేసుకోవాలని ఆదేశించాం. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా తన సబ్జెకుపై ఇలాంటి ప్రశ్నానిధిని తయారు చేస్తూ.. ఉపాధ్యాయులు తయారుచేసిన ప్రశ్నావళిని పర్యవేక్షించాలి. ఒక పాఠశాలలో తయారుచేసిన వాటికి, మరో పాఠశాలలో తయారుచేసిన  ప్రశ్నానిధికి సంబంధం లేకుండా పకడ్బందీగా తయారయ్యేలా చూస్తున్నాం. వీటిని ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు బోధించాలి. కానీ బట్టీ విధానాన్ని మాత్రం ప్రోత్సహించకూడదు.

గ్రేడ్ తగ్గినా.. ఉత్తీర్ణత పెరిగేలా..

కొత్త విధానంతో విద్యార్థులు కొంత కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ పద్ధతితో విద్యార్థి పాఠ్యాంశంపై మంచి పట్టు సాధించవచ్చు. దీంతో భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ తొలిఏడాది గ్రేడ్‌లలో కొంత వెనకబడొచ్చు. కానీ ఉత్తీర్ణత శాతం మాత్రం గతేడాది కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాం. బోధనలో ప్రత్యేక చొరవ చూపి ఉత్తమ ఫలితాలు సాధించిన టీచర్లను ప్రత్యేకంగా అభినందిస్తాం. అదేవిధంగా పనితీరు అధ్వాన్నంగా ఉన్న వారిపై నిర్మొహమాటంగా చర్యలు తీసుకుంటాం.

సహకారమే ముఖ్యం

పాఠశాలలో ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. ఇదే తరహాల్లో ఇంటివద్ద కూడా తల్లిదండ్రులు చదివించాలి. ఎలాంటి పనులు చెప్పకుండా వారికి స్వేచ్ఛ ఇస్తే మంచింది. ఈ అంశాన్ని వారికి వివరించేందుకు ఈనెల పదో తేదీలోగా అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాల్సిందిగా ఆదేశించాం. ప్రతి పాఠశాలలో ప్రతిభలో వెనకబడిఉన్న విద్యార్థులను అడాప్ట్ (దత్తత) చేసుకుని బోధన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాం. పలుపాఠశాలల్లో ఈ పద్ధతి కొనసాగిస్తున్నారు. వెనకబడిన విద్యార్థుల తల్లిదండ్రులతోనూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా.

పక్కాగా పరీక్షలు..

ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు మరింత పకడ్బందీగా నిర్వహిస్తాం. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తాం. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే విద్యార్థితోపాటు సంబంధిత ఇన్విజిలేటర్‌పైనా కఠిన చర్యలు తీసుకుంటాం. మార్చి రెండో తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్ష ముగిసిన తర్వాత యధావిధిగా ప్రత్యేక తరగతులు, రివిజన్ ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 24 వరకు తప్పకుండా విద్యార్థులు బడికి హాజరు కావాల్సిందే.

విద్యార్థుల కోసమే..

ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలలో గడపాల్సి వస్తోంది. మధ్యాహ్నం భోజనం చేసినప్పటికీ ఎదిగే పిల్లలు కావడంతో సాయంత్రానికి ఆకలి వేస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు స్థానికంగా ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల సహకారం కోసం లేఖలు రాశాం. వారు స్పందిస్తూ విద్యార్థులకు స్నాక్స్ అందించేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లాలోని 437 ఉన్నత పాఠశాలలకు ఈ లేఖలు అందించా. జిల్లా విద్యాశాఖ తరఫున ఇచ్చే ఈ లేఖల్లో వారి పేర్లు, చిరునామా రాస్తున్నాం.
 
కొత్త విధానమిదే..

పదో తరగతి పరీక్షల విధానంలో భారీ మార్పులు జరిగాయి. గతంలో వందమార్కులకు పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాదినుంచి కేవలం 80 మార్కులకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్నాం. మిగతా 20మార్కులు విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి నిర్వహించిన ఫార్మెటీవ్ 1,2,3,4ల ఆధారంగా మార్కులు వేస్తాం. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ప్రశ్నాపత్రాన్ని చదువుకునేందుకు ప్రత్యేకంగా 15నిమిషాల సమయాన్ని కేటాయించారు. హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుంటాయి. ఈ క్రమంలో ఒక పేపర్‌కు 40 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నాలుగు పెద్ద ప్రశ్నలు (4మార్కుల చొప్పున), ఆరు చిన్న ప్రశ్నలు (రెండు మార్కులు), ఏడు వ్యాఖ్య ప్రశ్నలు(ఒక మార్కు) చొప్పున 35 మార్కులు, మరో ఐదు మార్కులు ఆబ్జెక్టీవ్ పద్ధతిలో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement