గుమ్మఘట్ట మండలం గోనబావి పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు
‘మధ్యాహ్నం’ విద్యార్థులకు పస్తులు తప్పట్లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేని తనం కారణంగా పథకం అమలులో ఘోరంగా విఫలమైంది. వంట ఏజెన్సీలకు రూ.లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వారు మెనూకు మంగళం పాడేశారు. తమకు తోచిన విధంగా భోజనం వడ్డిస్తుండటంతో అది తినలేక విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా జిల్లాలో అమలు చేస్తున్న కేంద్రీకృత వంటశాల విధానం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. వేలాది మందికి వంట చేసే క్రమంలో నాణ్యత లోపిస్తోంది. చాలా పాఠశాలల్లో గదుల కొరతతో ఆరుబయట వండుతుండగా.. అన్నం ఉడకడం లేదు. పౌష్టికాహారం పేరుతో విద్యార్థులు ఉడకని అన్నం.. నీళ్లచారుతో తంటాలు పడుతున్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : ‘ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకం అనంతపురం జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది. భోజనం తయారు చేసే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. క్వాలిటీతో పాటు తగిన మోతాదులో కూడా భోజనం పెట్టడం లేదు. కొందరు టీచర్లు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు.’
ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ నెల 12న విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలివి. అంటే జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకం అమలు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
3,753 స్కూళ్లలో అమలు
జిల్లాలో 3,753 స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతోంది. ఇందులో 2,603 ప్రాథమిక పాఠశాలు, 607 ప్రాథమికోన్నత, 543 ఉన్నత పాఠశాలున్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి మొత్తం 3,24,822 మంది విద్యార్థులు భోజనం తింటున్నారు. అలాగే 42 జూనియర్ కళాశాలల్లోని 18,738 మంది విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
ఆరుబయటే వంటలు
జిల్లాలోని చాలా పాఠశాలల్లో వంటగదులు లేదు. దీంతో ఆరుబయట, చెట్ల కింద వంట తయారు చేస్తుండడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. గాలి, వాన కాలం పొయ్యిలు మండక ఉడికీ ఉడకని భోజనాన్నే పిల్లలకు వడ్డించే పరిస్థితి. దీంతో చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం తినేందుకు పిల్లలు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం వంట గదుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టినా... ఆచరణలో చేతులెత్తేసింది. 2012లో మంజూరు చేసిన వంట గదుల నిర్మాణాలు నేటికీ పూర్తికాలేదు. ఫలితంగా జిల్లాలో చాలాచోట్ల చెట్ల కింద, గోడచాటున భోజనాలు వండుతున్నారు. చెట్ల కింద వంట చేస్తున్న సమయంలో దుమ్మూ, ధూళితో పాటు చెట్లపై నుంచి పడేవి కూడా విద్యార్థుల కంచాల్లోకి చేరుతున్నాయి. అందువల్లే రోజూ ఏదో ఒక స్కూళ్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపిస్తున్నాయి.
నవ్ ప్రయాసమే
మధ్యాహ్న భోజన పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రీకృత వంటశాల విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే ఒకే చోట వంట చేసి చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను ‘‘నవ్ ప్రయాస్’’ అనే సంస్థకు అప్పగించింది. జిల్లాలో ఈ విధానాన్ని నాలుగుచోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. పెనుకొండ, గుంతకల్లు, కదిరి, కుందుర్పి, అనంతపురంలో కేంద్రీకృత వంటశాలలు ఏర్పాటు చేస్తున్నారు. పెనుకొండలో ఇప్పటికే వంటశాల పూర్తయి ఈనెల 3 నుంచే అమలు చేస్తున్నారు. గుంతకల్లులో జనవరిలో ప్రారంభం కానుండగా, తక్కినచోట్ల వంటశాలలు నిర్మాణాలు జరుగుతున్నాయి. పెనుకొండలో ఏర్పాటు చేసిన వంటశాల నుంచి పెనుకొండ, రొద్దం, సొమందేపల్లి మండలాల్లోని 175 స్కూళ్లకు సరఫరా చేస్తున్నారు. అలాగే కుందుర్పి నుంచి కుందుర్పి, శెట్టూరు, కంబదూరు, అమరాపురం, బ్రహ్మసముద్రం మండలాల్లోని 114 స్కూళ్లు, కదిరి నుంచి కందిరి, నల్లచెరువు, గాండ్లపెంట, నల్లమాడ, ఓడీసీ మండలాల్లోని 218 స్కూళ్లు, అనంతపురం నుంచి అనంతపురం రూరల్, రాప్తాడు, బత్తలపల్లి మండలాల్లోని 88 స్కూళ్లు, గుంతకల్లు నుంచి గుంతకల్లు, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లోని 97 స్కూళ్లకు సరఫరా చేయనున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు
మధ్యాహ్న భోజనం పథకం అమలును విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించడం లేదు. ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు పరిశీలించాల్సి ఉన్నా...ఇతరత్రా పనులు అధికంగా ఉండడంతో.. వారుకూడా ఏజెన్సీలపైనే ఆధారపడుతున్నారు. దీంతో చాలాచోట్ల మెనూకు మంగళం పాడుతున్నారు. అందుబాటులో ఉన్న వంటకాలు చేసి పిల్లలకు పెడుతున్నారు. మరోవైపు చాలా స్కూళ్లకు నాణ్యతలేని కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని టీచర్లు, విద్యార్థులు వాపోతున్నారు.
ముద్దకడుతున్న అన్నం
కేంద్రీకృత వంటశాల విధానం అమలు చేస్తున్న పెనుకొండ ప్రాంతంలో వేలాదిమంది విద్యార్థులకు వడ్డించాల్సి ఉండడంతో... తెల్లవారుజామున 2.30 గంటల నుంచే భోజనం తయారు చేయాల్సి వస్తోంది. పైగా చౌక బియ్యంతోనే భోజనం చేయాల్సి కావడంతో సుదూర గ్రామాల్లోని స్కూళ్లకు సరఫరా చేసి పిల్లలు తినే సమయానికి అన్నం ముద్దలా మారడంతోపాటు నీరు ఒడుస్తోందని రొద్దం మండలంలోని పలువురు టీచర్లు చెబుతున్నారు. నాణ్యతగా కూడా ఉండడం లేదనీ, అందువల్లే విద్యార్థులు తినలేక పారబోస్తున్నారన్నారు. ఇక చాలా పాఠశాలల్లోని విద్యార్థులకు గుడ్డు ఇవ్వడం లేదు. గుడ్డు సరఫరా ఏజెన్సీలకు అప్పగించడం వారు వారినికో..నెలకో సరిపడా ఒకే సారి కోడిగుడ్లు అందజేస్తుండడంతో అవి పాడైపోయి దుర్వాసన వస్తున్నాయి. అందువల్లే వాటిని చిన్నారులకు ఇవ్వడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment