ఇంటి నుంచి తెచ్చుకొన్న భోజనాన్ని తింటున్న కర్నూలులోని దామోదరం సంజీవయ్య స్కూల్ విద్యార్థులు
కర్నూలు సిటీ: మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో ప్రభుత్వ తీరు ఇటు విద్యార్థులకు, అటు కార్మికులకు శాపంగా మారుతోంది. పథకం అమలును ‘కేంద్రీకృతం’ చేసేందుకు ప్రభుత్వం పూనుకోవడంపై ఏజెన్సీల కార్మికులు భగ్గుమంటున్నారు. తమ పొట్ట కొట్టొద్దంటూ ఉద్యమబాట పట్టారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం కల్లూరు, కర్నూలు, ఇతర మండలాల్లోని సుమారు 60 పాఠశాలల్లో వంట బంద్ చేశారు. దీంతో కొన్నిచోట్ల విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత ఇళ్లకు వెళ్లిపోగా..మరికొన్ని చోట్ల ఆకలితో అలమటించారు. జిల్లాలోని 2,898 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. జిల్లాలో ఐదు కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేసి 15 మండలాల్లోని 814 స్కూళ్లకు ఢిల్లీకి చెందిన నవప్రయాస్ సంస్థ ద్వారాభోజనం సరఫరా చేసేలా బాధ్యతలు అప్పగించారు. ఈ కేంద్రీకృత వంటశాలల వల్ల 2,140 మంది మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రోడ్డున పడనున్నారు.
దీనికి నిరసనగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు కార్మిక సంఘాల నాయకులు డీఈఓకు నోటీసు అందజేశారు. అయితే.. సమ్మె మొదటి రోజు కావడంతో విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని చాలాచోట్ల ఏజెన్సీల వారే భోజనం వండిపెట్టారు. మరికొన్ని చోట్ల టీచర్లే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. వాస్తవానికి నవప్రయాస్ సంస్థ కర్నూలు శివారులోని పెద్దపాడు కేంద్రీకృత వంటశాల నుంచి ఈ నెల 10, 11 తేదీల్లోనే భోజన సరఫరా ప్రారంభించింది. అందులో నాణ్యత లేకపోవడం, ఉడికీ ఉడకని అన్నం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా బంద్ చేశారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్న తరువాతే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే.. గురువారం నుంచి పునఃప్రారంభించేందుకు ‘నవప్రయాస్’ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీల కార్మికులు సుమారు 60 పాఠశాలల్లో వంట బంద్ చేసి..నిరసన తెలిపారు.
♦ కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని సుమారు 45 స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వడ్డించలేదు. కొంత మంది టీచర్లు సొంతంగా డబ్బు పెట్టి చిన్న పిల్లలకు అన్న క్యాంటీన్‌లో భోజనాలు పెట్టించారు. మరికొన్ని చోట్ల తల్లిదండ్రులకు సమాచారమిచ్చి భోజనాలను ఇంటి నుంచి తెప్పించారు.
♦ కల్లూరు అర్బన్‌లోని 9 స్కూళ్లు, రూరల్‌లోని ఉలిందకొండ, కొంగనపాడు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పెట్టలేదు. ఉలిందకొండ హైస్కూల్ నుంచి సుమారు 150 మంది పిల్లలను మధ్యాహ్నమే ఇళ్లకు పంపించారు.
♦ కర్నూలు మండలంలోని పంచలింగాల, మిలటరీ కాలనీ, గార్గేయపురం, సి.బెళగల్ మండలం మారందొడ్డి, బ్యాతోలి, బురాన్‌దొడ్డి, చింతమానుపల్లె, తిమ్మందొడ్డి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం లేక విద్యార్థులు అలమటించారు.
కార్మికుల పొట్ట కొట్టడం తగదు
కల్లూరు (రూరల్): మధ్యాహ్న భోజన పథకాన్ని నవప్రయాస్ సంస్థకు అప్పగించి..కార్మికుల పొట్ట కొట్టడం తగదని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కన్వీనర్ పి.నిర్మలమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.నాగేశ్వర్‌రావు అన్నారు. ఈ మేరకు బుధవారం యూనియన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవప్రయాస్ సంస్థకు అప్పజెప్పడంతో ఈ నెల 10,11 తేదీల్లో ఐదు వేల మంది విద్యార్థులకు కూడా భోజనాలు అందజేయలేదని గుర్తు చేశారు. పైగా నాణ్యత లేకపోవడం వల్ల కొన్ని పాఠశాలల విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.6వేల వేతనం ఇస్తామన్న చంద్రబాబు ఇంతవరకూ అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.భారతి, రుక్మిణమ్మ, సీఐటీయూ నాయకులు గౌస్, అంజిబాబు, మోహన్, సుధాకరప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment