ప్రత్యేక తరగతుల్లో చదువుకుంటున్న విద్యార్థులు
గుంటూరు, సత్తెనపల్లి: టెన్త్ విద్యార్థులు అర్ధాకలితో అల్లాడుతున్నారు. పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతుండటంతో జిల్లావ్యాప్తంగా స్కూళ్లలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం బడికి బయల్దేరే పిల్లలు స్కూలులో మధ్యాహ్నం భోజనం మాత్రమే చేస్తున్నారు. సాయంత్రం వదలగానే అర్ధాకలితో ప్రత్యేక తరగతుల్లో కూర్చుంటున్నారు. మళ్లీ ఇంటికి వెళితేనే నోట్లోకి ముద్ద దిగేది. వారికి ఆహార విషయమై విద్యాశాఖ నుంచి నేటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. ఏటా జిల్లా పరిషత్ నుంచి కేటాయింపులు చేసేవారు. ప్రస్తుతం అంతా ఎన్నికల హడావుడిలో పట్టించుకోక పోవడంతో జిల్లాలోని టెన్త్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 59 వేల మంది టెన్త్ విద్యార్థులు ఉంటే వీరిలో సగం మంది జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన వారే ఉన్నారు.
దాతలు ముందుకు రావాలని వినతి
ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులు మంచి గ్రేడ్‌లతో ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో విద్యా శాఖ ఉదయం, సాయంత్రం వేళల్లో గత 45 రోజులుగా గంట చొప్పున ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. విద్యార్థుల సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం వేళ అల్పాహారం లేక చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం లేదు. ఆయా మండలాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే దాతలు ఎంతో మంది ఉన్నారు. వీరితో పాటు ప్రతి గ్రామంలో గ్రామాభివృద్ధి, ఎస్‌ఎంసీ, జన్మభూమి కమిటీలు ఉన్నాయి. విద్యార్థుల సమస్యలపై వారంతా స్పందించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఆరోగ్యంపై ప్రభావం
మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయుల సహకారం, విద్యాశాఖ ప్రణాళికలు బాగానే ఉన్నా ... అల్పాహార విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురవు తున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన దూర ప్రాం తాల విద్యార్థుల్లో కొందరు ఉదయం భోజనం చేయకుండానే తరగతులకు హాజరవు తున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.
సాయంత్రానికి నీరసం
పాఠశాలలో మధ్యాహ్నం తీసుకున్న భోజనంతో సాయంత్రానికి నీరసం వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పాఠ్యాంశాలు చదడం, రాయడంతో శక్తిని కోల్పోతున్నాం. మధ్యాహ్నం భోజనం తప్పా మళ్లీ ఆహారం అందకపోవడంతో సాయంత్రానికి నీరసం వస్తోంది.– ఏసుపోగు హరిణి, టెన్త్ విద్యార్థిని
దృష్టి సారించలేకపోతున్నాం
కొన్నిసార్లు ఉదయం ఇంటి వద్ద ఆçహారం తీసుకోకుండానే వచ్చేస్తున్నాం. పాఠశాలలో మధ్యాహ్న భోజనం మాత్రమే చేస్తున్నాం. సాయంత్రానికి ఆకలితో నీరసం వస్తోంది. దీంతో చదువుపై దృష్టి సారించ లేకపోతున్నాం. – చల్లా మహేష్,టెన్త్ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment